కమ్మటి నిద్రే వరము..!! వచన కవిత

కొప్పుల ప్రసాద్ గారి రచన

కమ్మటి నిద్రే వరము..!!

ఎందుకో తొందరగా తెల్లారుతుంది
అర్ధరాత్రి వరకు ఆలోచనల్లో ముంచి
తలగడ పై తల్లడిల్లిన తల
కళ్ళు మూసుకొని కలత చెందుతూ…

ఊహల్లో మబ్బులు ఏవో సుడులు తిరుగుతూ
పరి పరి విధాల మస్తిష్కాన్ని తొలుస్తూ
మంచముపై తనువు భారంగా ఉంటే
కంటి తలుపులు మూసిన వెలుగే కనిపిస్తుంది..

అలసిన శరీరానికి విశ్రాంతి నిద్ర
మెదడులో విషపురుగు తిరుగుతుంటే
కలల కోనేరు స్థిరంగా ఉండదు
మనసులో అలజడి తగ్గేవరకు…

కమ్మటి నిద్ర అనేది ఒక వరం అయితే
అదే ఆరోగ్యానికి సంజీవిని
వర్షించిన తర్వాత ఆకాశం నిర్మలమైనట్లు
గాడ నిద్ర లేస్తే మనసు ప్రశాంతమే కదా..

తీయటి కలలకు సుందర దృశ్యం
ఆస్వాదించే హృదయానికి అమృతం
రసజ్ఞత వుంటే నవరసాల సారం తెలుసు
కలలు కంటే మరో లోకం చూస్తాము..

నిద్దర్లో నీకంటూ ఒక తోడు స్వప్నం
అస్పష్ట రూపములో కనిపించిన
ఊహలకు ప్రాణం ప్రతిష్ట కావించి
ఆలోచనలకు రూపం దాల్చి నిలుస్తుంది…

అర్ధరాత్రి కూడా మేల్కొలిపే అక్షరం
బంధించిన భావాలను నిద్ర లేపేటందుకు
మధన పడిన మనసులో
మలుపు తిప్పిన కావ్యాలెన్నో…

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

Get real time updates directly on you device, subscribe now.