అద్దె భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు (తెలంగాణ)

వడ్డేపల్లి మల్లేశము 9014206412

అద్దె భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర వసతుల మధ్య విద్యాభ్యాసం. ప్రభుత్వ విద్యా రంగం పైన తెలంగాణ రాష్ట్రంలో చర్యలు సమీక్షలు అవసరం లేదా
********************

పాఠశాలల వసతులు, సరైన ఉపాధ్యాయ సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, సొంత భవనాలు, ఆట స్థలము విద్యా రంగం యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. తద్వారా ఆ సమాజం యొక్క ఉన్నతి ని ఎంతైనా కాంక్షించ వచ్చు. ఇ oదుకు ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థ అనేది ప్రధానమైతే పూర్తి సౌకర్యాలతో కొనసాగడం అనేది ప్రభుత్వ పనితీరు కు దర్పణం పడుతుంది. బడ్జెట్ ప్రతిపాదనలలో విద్యారంగానికి 25 శాతం కేటాయిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం 24 శాతం కేటాయిస్తున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి ఆదర్శంగా నిలబడితే ఇవాళ అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యకు బడ్జెట్లో అరకొర ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా దాని ప్రభావం సమాజం మీద పడుతుంది అనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యను ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తారని ప్రజలందరూ ఆశించారు. కానీ దానికి భిన్నంగా ప్రైవేటు రంగంలో విద్యా నిర్వహించడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాధారణ మధ్య తరగతి ఆదాయం కలవారు ప్రైవేట్ పాఠశాలలో చదివించడానికితిప్పల తప్పడం లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫీజులపై నియంత్రణ లేని కారణంగా విద్యా రంగంలో తెలంగాణ ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసి ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆ వైపుగా ప్రజలు, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, విద్యాభి మానులు ఆలోచించి పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వ రంగంలో ఉచిత విద్యను పొందలేము.
అరకొర వసతులు అద్దె భవనాల్లో పాఠశాలలు:-
********
నా అనుభవంలో 50 సంవత్సరాల క్రితం కూడా మెజారిటీ గ్రామాలు ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాల భవనాలు ఉండేవి. ఎక్కడో కొన్ని అద్దె భవనాలలో నడిచేవి కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 132 ప్రాథమిక 24 ఉన్నత పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తూ అరకొర సౌకర్యాలతో విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతున్న సందర్భం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా ఇందులో జంటనగరాల పరిధిలోనే 92 ప్రాథమిక 17 ఉన్నత పాఠశాలలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. అంటే పట్టణాలలో ప్రభుత్వ విద్య ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వరంగల్ కరీంనగర్ వంటి కొన్ని జిల్లాలలో కూడా ప్రైవేటు భవనాలలో విద్యాభ్యాసం కొనసాగుతున్నది. అక్కడ ఆటస్థలం కానీ ఇతర సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్న పట్టించుకునే యంత్రాంగం కానీ ప్రజా ప్రతినిధులు కానీ లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో వెలితి. అంటే అద్దె భవనాల్లో ముఖ్యంగా 70% జంటనగరాల్లోని ఉన్నాయి అనే చేదు వాస్తవాన్ని మనమందరం గ్రహించాలి పాలకులు ఆలోచించాలి.
కొన్ని చోట్ల అద్దెను కూడా ప్రభుత్వాలు సకాలంలో చెల్లించకపోవడంతో అద్దె ఇంటి యజమానులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది పైన ఒత్తిడి చేస్తున్న సందర్భంలో విధిలేక ఉపాధ్యాయ సిబ్బంది తాత్కాలికంగా చెల్లించి ప్రభుత్వం నుండి తర్వాత తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇది బంగారు తెలంగాణకు తగునా? రాష్ట్ర ప్రభుత్వం “మన బస్తి మనబడి”” మన గ్రామం మన బడి “అనే పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సందర్భంగా ఇలాంటి అనేక విషయాలు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకు పోవడం తో పత్రికలు టీవీ ప్రసారాల ద్వారా విద్యారంగ పరిస్థితి తెలుస్తున్నది.
జిహెచ్ఎంసి పరిధిలో సమస్యలేమిటి:-
********
జిహెచ్ఎంసి పరిధిలో అద్దె భవనాలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడానికి ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవని ఒక వాదన ఉంటే ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట పిల్లలు లేక లేదా పిల్లలకు దూరంగా ఉన్న కారణంగా అక్కడ నిర్మాణము సాధ్యం కావడం లేదని అధికారులు తెలుపుతున్న కారణంగా కూడా ప్రభుత్వం పాఠశాల నిర్మాణం పై నిర్లక్ష్యం వహిస్తున్న ది.
స్థానిక యంత్రాంగం కలెక్టర్లు ప్రభుత్వ భూములను నిర్దేశిస్తే భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జనావాసాలకు అందుబాటులో అవసరమైతే ప్రైవేటు భూములను కొని అయినా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు? అనేది మన ముందున్న ప్రశ్న? ప్రైవేటు స్థలాల ధరలు భారీగా పెరిగినవి అనడంలో సందేహం లేదు. కానీ ప్రభుత్వం సంక్షేమ రంగంపై చేస్తున్న ఖర్చుతో పోల్చుకుంటే పక్కా భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేయకపోవడం ,అశ్రద్ధ వహించడం ,అద్దె భవనా లతోనే కాలం గడపడం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అభ్యాసానికి ఎంతో ఆటంకం అని గుర్తిస్తే తప్ప పక్కా భవనాల నిర్మాణాన్ని సాధించుకో లేము.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పాఠశాల విద్యాశాఖ కు 10 వేల కోట్లకు పైగా బడ్జెట్ లో కేటాయించినప్పటికీ ఈ దుస్థితిని కళ్ళారా చూస్తే జాలి వేయక మానదు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు అరకొరగా ఉన్న కారణంగా ఉదయం పూట కొన్ని తరగతులను సాయంకాలం కొన్ని తరగతులను నడుపుతూ కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేస్తే వాళ్ళ మౌలిక సౌకర్యాలు మరుగుదొడ్లు ఆటస్థలాల సంగతి ఏమిటని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ ప్రభుత్వం లాగా విద్యారంగానికి 25% కనీసం ఇస్తే తప్ప పూర్తి సౌకర్యాలతో ప్రభుత్వ రంగంలో ప్రతి విద్యార్థికి ఉచిత విద్యను అందించలేము.. అంతేకాకుండా ప్రభుత్వము చిత్తశుద్ధితో అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఉపాధ్యాయులకు ఇప్పించి పేద పిల్లలకు మెరుగైన విద్యను ఉచితంగా అందించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో విద్యా రంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని ప్రజలు గుర్తిస్తారు. ప్రభుత్వాలను అభినందిస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు నియంత్రించడంతో పాటు సామాన్య మధ్యతరగతి కుటుంబాల పిల్లల కోసం ఆ ఫీజును ప్రభుత్వమే భరించే విధంగా చట్టాన్ని తీసుకు వస్తే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రైవేటు పాఠశాలలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే సంస్థలు ఉంటే ఉండనివ్వండి. డబ్బున్న వాళ్ళకు మాత్రమే! కానీ పేదవాళ్లకు ప్రభుత్వమే నాన్యమైన విద్యను ఉచితంగా అందించే ఏర్పాటు చేయడం ద్వారా తన సామాజిక బాధ్యతను గుర్తించాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఉచిత విద్య ఉచిత వైద్యం ఎన్నికల సందర్భంగా ప్రధానమైన డిమాండ్ గా ఉంటుందని ఇటీవల సర్వేలను బట్టి తెలుస్తున్నది. అందుకే ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో మరింత అధిక నిధులను కేటాయించి కేరళ ఢిల్లీ ప్రభుత్వాల సరసన నడవాలని మనం ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Get real time updates directly on you device, subscribe now.