*భగ భగ మండే సూరీడు*
””””””””’
భగ భగ మండే ఓ నిప్పు కణం
ఒడిషాతల్లి ఒడి నుంచి జల జల జారీ
భరత నేలపై మెరిసిన ఉషోదయ కిరణం
జంకు బొంకు లేని కొదమ సింహ మతడు
సాయుధ బాటలో నడిచిన సమరయోధుడు!
పరుల హితం కోసం ప్రాణం ఫణంగా
అర్పించిన అకుంఠిత దీక్షాపరుడు
దేశం కోసం దేహం లెక్కచేయని మగధీరుడు
జైహింద్ అని నినదించిన జన సైనికుడు
జీవన గమనానికి పిరికి మాట ఆటంకమని పలికాడు!
ఆత్మ గౌరవమే ధ్యేయం స్వేచ్ఛా భారతీ తన స్వప్నం
యువ లోకానికి స్ఫూర్తి ప్రదాత దేశానికి కీర్తి కిరీటం
చదువు సంస్కారంలో మేటి లేరెవరతనికి సాటి
అపర చాణుక్యుడై ఖండ ఖండాంతరాలు దాటి
జాతి ఔన్నత్యం చాటిన మహా మేధావి నేతాజీ!
స్వాతంత్ర్యం ఊపిరిగా సాహసం ఆయుధంగా
అన్యాయం ఎదురించే ఉత్తుంగ తరంగం
ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపించిన ఆజానుబాహుడు
ఆంగ్లేయుల గుండెల్లో సింహ స్వప్నం
జైలు జీవితానికి భయపడని ధిక్కార స్వరం!
అఖండ భారత దాస్య శృంఖలాలు చేధించగ
స్వాతంత్ర్యం చేజాపి అడుక్కునే బిక్ష కాదనీ
పోరాడి పొందే హక్కని చాటిన వీర కిషోర రత్నం
సుభాష్ పౌరుషాగ్నికి హిట్లర్ శభాషని పొగడగ
భారతీయ బిగ్ బాస్ చంద్రబోస్ వందనం!
(జనవరి 23, నేతాజీ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ…)
రచన: కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,సబ్ యూనిట్ – సికింద్రాబాద్, 8555010108.