ప్రేమకు వేయని ఓటు – చెల్లని రూపాయి నోటు..

ప్రేమకు వేయని ఓటు - చెల్లని రూపాయి నోటు..

ప్రేమకు వేయని ఓటు – చెల్లని రూపాయి నోటు..

మొక్క ఒక్కటే పువ్వులు అనేకం.. హృదయం ఒక్కటే స్పందనలు అనేకానేకం.. పువ్వులు వికసించిన వసంతం.. హృదయంలో నివసించిన ”ప్రేమ” జీవితం.. కళ్లలో పుట్టి కన్నీళ్ళలో కరిగేది కాదు ”ప్రేమ” మనసుఁలో పుట్టి మట్టిలో కలిసేదాకా కలసిసాగేవారు ”ప్రేమికులు”..

ఒకే మనిషి రెండు మనుషులతో గడిపేవారు, ఒకే మనిషి రెండు హృదయాలతో జీవించేవారు ”ప్రేమికులు”

ఓ చెలీ..!
నీ కను బొమ్మల మధ్యన
ఒదిగిన కుంకుమ అందాన్ని చూసి,
నల్లని కనుమలలో వెలిగే సూరీడు
సిగ్గుతో తల వాల్చుకున్నాడు..
కారుమబ్బులలో అల్లుకున్న మేఘమాలలలో, పసిడి ఛాయతో మెరిసే నీ చెక్కిళ్ళ సొగసుతో, పకృతి సైతం అసూయపడే అందంగా వర్ణించారు.. భాషలేని భావ గీతాలెన్నో మనోస్వేఛ్ఛగా పాడుకున్నారు..

నీ ముఖ కమలం –
నా కనుల కొలనులో వికసించాకే
నేను మేనకను వీక్షించిన విశ్వామిత్రుడనైతిని..!!

నీ చూపుల పూలజల్లు –
నా హృది నదిలో ప్రవహించాకే
నేను రతీదేవి తిలకించిన మన్మధుడైతిని..!!

నీ దివ్య సుందర రూపం –
నా మది కోవెలలో సంప్రతిష్టితమయ్యాకే
నేను వరూధిని దర్శించిన ప్రవరాఖ్యుడనైతిని..!!
నిన్ను చూసినంతలోనే.. నన్ను నేను మరిచిపోయాను.. నీ అందాకృతులతో, నా మతిని, యతిని పోగొట్టుకున్నాను. నీ ప్రేమకు దాసుడినైనాను..

నీ ముఖ కమలాలను –
చూసేందుకూ సూర్యుడు వస్తాడు..
నీ కలువ కనులు –
చూసేందుకూ చంద్రుడూ వస్తాడు..

రాజహంసలే వినయంతో నీ నడకలకూ శిష్యరికం చేస్తాయన్నారు.. రామచిలుకలే రసికతతో నీ పలుకులనూ కవిత్వంగా చిత్రిస్తాయన్నారు.. ఇంద్రధనస్సు సలాం చేస్తూ దేదీప్యమానమైన కాంతిలో కరిగిపోతాయన్నారు..

ఈ ప్రపంచం నాకెందుకూ, నా ప్రపంచమైన నీవుండగా. నీతో మనసు విప్పి మాట్లాడాలని, అనుక్షణం నీ గుండె చప్పుడు వినిపించాలనీ, నిన్నటి ఊహకు, నేటి కలకూ, రేపటి దిశలకూ, ప్రాణమైన గుండెల్లో ”చిలకమారి తిరుపతి” ప్రాణ ప్రతిష్ఠచేసారు..

అవును –
అనుక్షణం నీ గుండె చప్పుడు వినాలనిపిస్తుంది..
ఒక్క క్షణం ప్రపంచాన్ని మరిచి –
నా ప్రపంచమైన నీతో మనసు విప్పి మాటాడాలనిపిస్తుంది..
ప్రియా.. నిన్నటి ఊహ, నేటి కల, రేపటి ఆశ, అన్నీ నువ్వే.. నా ప్రాణమై ఉన్నావే నా గుండెల్లో.. నిన్ను మరవడం అంటే నా ప్రాణం పోవడమే అంటూ చిలకమారి తిరుపతి ప్రమాణం చేసారు..

అతిలోక సౌందర్య రూపం సాక్షాత్కారమైందో, నిను అర్చిస్తూ, ప్రేమామృత మమత సాధనలో.. ప్రేమ మనసులో ప్రతిఫలిస్తున్నాయి.. హృదయంలో ప్రతిపాదిస్తున్నాయి..

కనులు తెరిచిన ఎదుట నువ్వై కమనీయంగా కనిపిస్తావని..
పెదవి పలికిన మాటలు నువ్వై పాటలా మారి పల్లవిస్తావని..
మౌనమలిగినా ఆశవు నువ్వే మనసులో చేరి మురిపిస్తావని..
ఊపిరిఊదగా ఊహవు నువ్వై శ్వాసగా మారి మురిపిస్తావని..
ఊపిరాడగా ధ్యాస నువ్వై దరహాసములా నర్తిస్తావని..

మొదటి సారి చూసినపుడూ అనుకోలేదూ.. కల గన లేదూ..
(చిరుగాలి తరంగంలా, లయబద్దంగా మనసును స్పృశించి తామరాకుపై హిమబిందువులా కదిలించావు, కరిగించావు, ఓ సరికొత్త జీవితం ప్రారంబించావన్నారు)

ఆకాశం క్రింద, పుడమితల్లి ఆకుపచ్చని సహృదయంతో, మల్లె పూవ్వుల్లా పుష్పిస్తూ,, జాబిలి వెన్నెలలా పరిళమిస్తూ, చిరునవ్వుతో.. గులాబీల గుబాళిస్తూ, గుండెలలో సంపంగిలా సంస్కరించావన్నారు..

జక్కన్న చెక్కిన –
శిల్పానికీ ప్రాణం వచ్చేనా..
బాపు గీసిన –
చిత్రానికి ఊపిరి వచ్చేనా..
నీ వదనం పై ఓ మధుమాసం ఇల ఉదయించేనా.. నీ అధరం పై చిరుధరహాసం నను మై మరిపించే ”నా” పరిపూర్ణపు అందం నిను చేరగా నీ సొగసు వర్ణించ నా తరమా తనకున్న ప్రేమను మరోసారి ప్రకటించారు..

నీవులేని నా హృదయానికి స్పందనెక్కడా..
నీవులేని నా హృదయానికి స్పందనెక్కడా..
నీవులేని క్షణం నిర్జీవదేహా సదృశ్యమై కనిపిస్తాయి.. భావాలు చలనం కోల్పోతాయి.. మనసులో చీకట్లు అలుముకుంటాయి.. మోము భావరహితమై యుగాలు వైరాగ్యాన్ని ప్రతిఫలిస్తాయి.. కులాన్ని కాగితం మీద ఉంచితే ఒక్క మనసుకు సమాధానం చెప్పడం చేతగాక నిరాశ నిస్పృహల్ని వెళ్లగ్రక్కుతుంది..

ఏ ప్రేమ మహిమచే ఈ ధరిణి చక్రం –
ఇరుసు లేకుండానే తిరుగుచున్నది..
ఏ ప్రేమ మహిమచే వేల నక్షత్రాలు –
నేల రాలక మింట నిలుచున్నాయి..
కలల తూనీరవం కలకాలం కొలువుదీరి సాగాలిక సుఖసంతోషాల ప్రేమాయణంలో, ప్రేమ శాశ్వతం, ప్రేమ అద్భుతం, ప్రేమ అఖండం, ప్రేమ అనిర్వచనీయం, ప్రేమ జీవితమే జగమంతా పరుచుకున్నాయి..

నీ కోసమే కలం పట్టాను
నీ కోసమే కవిత రాసాను
నీ ఊసే అందని వేళా –
శ్వాస బరువై అలసిపోయాను..
అనంత విశ్వ చైతన్యం నాలో నింపిన ప్రేమతత్వం హృదయాన్ని ముంచేస్తున్నపుడు.. కోటి రంగులతో హరివిల్లు కవిత్వమై ఆవిష్కరిస్తాను.. ఉద్వేగ తరంగం విశ్వాన్ని ఆక్రమిస్తాను..

నా అక్షరాలను అశ్రువులుగా –
నా ఆర్తిగా,
నా ఆశలుగా, నా ప్రేమ భావనలుగా అనుకుంటే
నీ ప్రేమ దాసునిలా స్వీకరించు..
ప్రేమ సీమలో.. పదాల పెదాలపై అక్షరీకరిస్తాను, కవి భావాల చరణాలతో అభిషేకిస్తాను, రవి కిరణాలతో ప్రతిజన్మ ప్రతిగా రాసిస్తానూ.. కాలమేదైనా హృదయ కాగితాలు కవితల్నే ప్రేమ సందేశంగా ప్రచురిస్తాయి..

మనసుమాటలో హృదయ రాగాలు పలుకుతాయి, ప్రేమను మీటితే అనురాగాలు కళాత్మకంగా ఆడుతాయి.. మనిషిని మనీషిగా మార్చే ఒక తీయని స్వప్నం ”ప్రేమ”

శూన్యమై వస్తావని చెప్పు –
స్వప్న లోకాలలో విహరిస్తాను,
శిల్పానివై వస్తావని చెప్పు –
మునుపే శిలనై మారి చూస్తాను..
ప్రేమ సామ్రాజ్యంలో వసంతమై వస్తావని కోయిలయై ఎదుచూస్తూ, సూర్యతాపానివై వస్తావని హిమబిందువై ఎదుచూస్తూ, అలవై వస్తావని తరగని తీరాన ఎదుచూస్తూ, చల్లని వెన్నలలో – కురిసే మేఘాలలో కలలుకంటున్నాడు..

కాలాన్ని ఆగి పొమ్మని చెప్పనా –
వీచే గాలికి విన్నవించనా –
ప్రేమలో కురిసే చినుకుల సవ్వడులలో తడవని మనుషులుంటారా, ప్రేమ హృదయం ఉరిమే ఉరుముల శృతి, లయలలో కరగని మనసులుంటాయా, పారే ఏరులా – పాడే వెన్నెలలా స్వర మాధుర్యంలో చెప్పనా..

మానవ జీవితంలో అదృష్టం అంటే ఆస్తులు-అంతస్తులు కాదు, అనురాగం-ఆప్యాయతలు, వాస్తవం-వాత్సల్యం, ప్రేమించడం-ప్రేమించబడటం.. ప్రేమను పొందటం, ప్రేమకోసం తపించడం.. అంటూ..

మాట మురిపెంలో మదు మురళీ గానమై, హృదయ సౌందర్యంలో సరిగమల సమ్మోహమై, ప్రతి అక్షరంలో ప్రేమ సంతకమై ”తిరుపతి” పరిమళింపజేసారు.. ప్రతి కవితలో ప్రేమతప్త హృదయాన్ని ఆవిష్కరించారు..

ప్రేమ కావ్య నాయకుడై, హృదయ సంవాద ప్రేమికుడై, ప్రేమికుల అంతః ఆలోచనలనూ, మనో సుమాలనూ, కార్యకార్యాలనూ, ద్యేయాద్యేయాలనూ, భావానుభవాలనూ, గీతానుగీతీకలనూ ”చిలకమారి తిరుపతి” కావ్యగానం చేసాడు..

ఆధునిక కవిత్వంలో ”చిలకమారి తిరుపతి” తనదైన శైలిలో.. వివిధ ప్రక్రియలలో మరిన్ని పరిశోధనలతో మరింత అధ్యయనంతో తనజీవితం నుండి తన సమాజం నుండి అనుభవాలను జోడిస్తూ, ప్రేమకవితలతో ఆగిపోకుండా ప్రయోగాత్మకమైన/ ప్రయోజనాత్మక రచనలతో రాణించాలని కాంక్షిస్తూ.. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను..

మీ
కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ
తొలి అద్యక్షులు –
జానపద అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జాతీయ అధ్యక్షులు –
తెలుగు రక్షణ వేదిక , భారతదేశం
చరవాణి ; 93 94 93 94 93