నేను నిలువెత్తున ఎదిగిన

నేను నిలువెత్తున ఎదిగిన

నేను ఒళ్ళంతా గాయాలుండే
వెదురు మొక్కను కాదు
నా హృదయ రంద్రాల్లో నుండి
జీవన సంగీతాన్ని వెలువరించి
నీ యదగాయాలను మాన్పే వేణువును

నేను కవన లేఖనంలో చేయి
తిరిగిన కవిని కాదు
కమనీయ భావాలను రమణీయంగా
రచించి రస హృదయాలను
రంజింప చేసే రచయితను

నేను నిలువెత్తున ఎదిగిన
మహా వృక్షాన్ని కాదు
నా తనువు అణువణువునా
అలసిన తీయని ఫలాలనందించి
పరుల క్షద్భాధ తీర్చే తరువును నేను

నిగూఢమైన విద్యలను నిరంతరము
అందించే గురువును కాదు
గురుతైన గుణములను ఘనముగా
బోధించి పామరులను సైతం
ప్రభావితం చేసే పండితుడను

నేను మహిలో జనించిన
మామూలు మనిషిని కాదు
అరిషడ్వర్గాలను అధిరోహించి
ఆధ్యాత్మిక భావతరంగాలు
చవి చూసి మహిని వెలిగించే మనీషిని

చిలుకమారి తిరుపతి