అమ్మ కన్నీరు ఆగేదెన్నడు?

అమ్మ కన్నీరు ఆగేదెన్నడు?

అమ్మ కన్నీరెడుతుంది
రాలిన బిడ్డను జూసి
మానవుడయ్యే రాక్షసుడై
చేసే హత్యలను జూసి..

నేల రాలేను కుసుమాలు
ఆడ జాతి ఆక్రందనలు
విష నాగులు కోరలతో
నిత్యం జరిపే అకృత్యాలు.

ఏ ప్రాంతమేగిన
ఎందు కాలిడిన
దేశమంతయు
జరుగుతున్న
వికృత చేష్టలు.

సమాధి అవుతున్న నిజాలెన్నో
బహిర్గతము కాని వాస్తవాలెన్నో
కామపిశాచి చేసే దారుణాలెన్నో
చిద్రం చేసిన రక్త చారికలెన్నో.

జరుగుతుంది విద్వంసం
మానవ జాతి వినాశనం
జన్మనిచ్చే అమ్మ ఆడదే
ఆమె లేకుంటే పుట్టుకేది?.

కామంతో కళ్ళు మూసి
వావివరుసలు మరచి
క్రీనీడన కామాంధులు
స్త్రీలపై చేసే దాష్టీకాలు.

అమ్మ.. కన్నీరెడుతుంది
జాతి, మతాల వైరాలు
కులకుంపట్లో రగిలే అగ్ని
దేశమంతా జ్వలిస్తుంటే..

తోటి వాడిని చంపేస్తున్నారు
ఆడవారిని చెరిపేస్తున్నారు
పసిబిడ్డను చిదిమేస్తున్నారు
విషాద గీతిక ఆవేదనలు.

తల్లి భారతీ
రాలిన బిడ్డను
చేతులతో మోస్తూ
వేదన పడుతుంది
కన్నీరు పెడుతోంది.

అమ్మ కన్నీరు ఆగేదెన్నడు?.

అశోక్ చక్రవర్తి. నీలకంఠం.