తరతరాల వారసత్వమా…!!!
వెన్నలు పూసిన మాటలతో
మర్మమై యేరు దాటుతున్నారు…
ప్రకృతికి కాచిన పువ్వులమని
జాబిలని విరుచుకొన్న అందాలమని
కళ్ళబొళ్ళి మాటలను కావ్యమై
వినిపిస్తు మీ కోరికల మగ్గం పై
మా బతుకులను ఆడిస్తున్నారు…
కొలిచిన ద్రవ్యమై
అందరు పంచుకొనే పదార్థమై…
హృదయంలేని బొమ్మగా కారణం లేని
జీవితానికి మీరు భాగస్వామ్యమై…
తీరని వాంచలతో నలిగిన దేహాన్ని
నగ్నంగా ఉరేగిస్తున్నారు ఇది శాపమా…
లేక తరతరాల వారసత్వమా…
కనిపెంచిన మూర్తీభావంతో
అమ్మగా ఆలిగా చెల్లిగా ఎన్నో
ఊడిగపు పాత్రలను పోషిస్తున్నా…
ఆశల పురిటితో పొరలు కమ్ముతు
క్రమం లేనివాడిగా ఎదన కత్తులు
గుచ్చుతు నింపుకొన్న నీ స్వార్థానికి
అమాయకత్వాన్ని బలిచేస్తున్నారు…
నమ్మిన వాస్తవాలన్ని
చేసిన వాగ్ధానాలన్ని వెంటాడే
నీడలైనప్పుడు విరిగిన రెక్కలతో
చెదిరిన గూటిలో రోజులకు ఖైదీలమై…
శ్వాసల వ్యూహాలు చల్లబడుతు
మగ్గిన స్వేచ్ఛలు నీరెండుతున్నాయని…
ఆలకించలేని లోకం చేతగానితనం
కళ్ళుకు గంతలు కట్టుకొన్నది…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396