కోయిల్ కందాడై రంగనాధాచార్యుల దృక్పథంలో దళిత సాహిత్యం

కెకెఆర్ దృక్పథంలో దళిత సాహిత్య పరిశీలన

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకులలో కెకెఆర్ గా ప్రసిద్ధులైన కోయిల్ కందాడై రంగనాధాచార్యులు ప్రముఖులు. కెకెఆర్ దృష్టిలో తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయాలంటే చరిత్ర, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడం ఎంతో అవసరం. సాహిత్యాన్ని సరిగ్గా తూకం వెయ్యాలంటే..!! దాని సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలతో దానికున్న అవినాభావ సంబంధాన్ని నిగ్గు తేల్చాలి. సాహిత్య విమర్శకులుగా రాణించాలంటే భూత, వర్తమాన అంశాలపైన పట్టుతో పాటు ఆయా సాహిత్య అంశాల, వివిధ శాస్త్రాల అధ్యయనం, లోతైన పరిశీలన ఉండాలి. కెకెఆర్, ప్రముఖ భారతీయ చరిత్రకారుడు డి.డి. కోశాంబి పద్ధతిని పునికిపుచ్చుకొని చరిత్రను, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను సాహిత్యంతో అంటు కట్టి ఆనాటి సాహిత్య చరిత్రలను వింగడిస్తాడు, విశ్లేషిస్తాడు. అది కెకెఆర్ పద్ధతి. ఇదెంతో ప్రామాణికమైనది. ఆమోదకరమైనది. ఇది డి.డి. కోశాంబికి కొనసాగింపు అనుకోవచ్చుకూడను. కెకెఆర్ దృక్పథంలో ఇక దళిత సాహిత్యాన్ని గనుక పరిశీలిస్తే.. దళిత సాహిత్యం యొక్క ఆగమనం దాని రూపురేఖలు, అది తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకున్న తీరును వివరిస్తాడు. భారతదేశ సాహిత్య చరిత్రలో 1960 లో నుండి దళిత చైతన్యం, దళిత సాహిత్యం అన్న పదాలు కనబడుతున్నాయంటాడు. 1970లలో మరాఠీ, కన్నడ భాషల్లో ఒకే నిర్దిష్టమైన లక్ష్యాలతో, ప్రత్యేకమైన అభివ్యక్తులతో దళిత సాహిత్యం పురోగమించింది. 1980ల ఉత్తరార్థంలో తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యం పునికిపుచ్చుకొని 1990 మొదలయ్యే నాటికి దళిత సాహిత్యం సాహిత్యంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసిందంటాడు. 1985లోనే కారంచేడులో దళితులు అగ్రవర్ణాల చేతిలో దారుణంగా ఊచకోతకు గురైనారు. అప్పటి వివిధ రకాల సాహిత్య ప్రక్రియలలో రచనలు చేస్తున్న కవులు, రచయితలు కారంచేడు ఘటనకు చలించిపోయి దళితవాద ధోరణిలో రచనలు చేయడం మనం చూడవచ్చు. ఆ తర్వాత 1991లో చుండూరు ప్రాంతంలో కొంతమంది దళితులను ఊచకోత కోశారు. ఆ నేపథ్యంలో వెచ్చించే “చిక్కనవుతున్న పాట”. దీనికి సంపాదకులు జి. లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ లు. 1994లో కొలకలూరి స్వరూపరాణి ప్రబోధం, ఎస్. టి. జ్ఞానానంద కవి పాంచజన్యం, ధర్మాగ్రహం, ఆశావాది ప్రకాశరావు అంతరంగం తరంగాలు మొ.న ఎంతోమంది కవులు, రచయితలు దళితవాద పంథాలో రచనలు చేశారు.
సమస్యల పరిష్కారాన్ని సూచించింది. అటు తర్వాత విప్లవ సాహిత్యోద్యం గిరిజన సమస్య సమస్యలతో పాటు హరిజన సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటాడు. అందుకే దళితులు తమను తాము విముక్తుల్ని చేసుకోవడానికి, సమాజాన్ని సంస్కరించడానికి విప్లవ బాట పట్టారు. క్రియాశీలక పాత్ర పోషించారు. దళితుల చేరికతో ఉద్యమం ఉద్ధృతంగా సాగింది.

కెకెఆర్ దృక్పథంలో దళిత సాహిత్యం పోరాట రూపంలో…

* ఉత్పత్తి రంగంలో శ్రమ దోపిడిని, వెట్టిచాకిరి, మట్టి మనుషుల శ్రమను కించపరిచే సంస్కృతిని ఎదుర్కోవడం.

• ” సంస్కారం” పేరుతో చెల్లుబాటు అయ్యే ఆధిపత్యాన్ని, అహంకారాన్ని బద్దలు కొట్టడం.

* సాహిత్య రంగంలో భాష, శిల్పం పేరుతో ఉన్నత వర్గాల దృక్పథం చుట్టూ ఆవరించుకొని ఉన్న దర్పాన్ని, మిత్రులను బద్దలు కొట్టడం. భాషా, సాహిత్యాలకు సంబంధించిన ఉచ్చ, నీచ భావన సమాజంలోని ఉచ్చ, నీచ భావాలతో ముడిపడి ఉందంటాడు.

పై అంశాల ఆధారంగా దళిత సాహిత్యం తన ఉనికిని, ఆకాంక్షలను ప్రకటించుకోవడం చూస్తాము. కెకెఆర్ పై విషయాలను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఉటంకించారు. ఇలా ప్రాంతీయ భాషల్లో సాహిత్యాన్ని
లోతుగా పరిశీలించిచడం, అధ్యయనం చేయడం, విషయాన్ని విపులీకరించడం. ఇది కెకెఆర్ లోని ముఖ్య విమర్శక పద్దతి.

ఆయన విమర్శ పద్ధతిలోనే ఆలోచించి ఈ భాగాన్ని రాసే ప్రయత్నం చేస్తున్నాను.

దళిత సాహిత్య ఉద్యమ విషయానికి వస్తే మరాఠీలో ముందుగా వచ్చినటువంటి దళిత సాహిత్యోద్యమం కొంతమంది ప్రముఖుల ఆత్మకథల్ని, స్వీయచరిత్రల్ని రాసింది. అవి చాలా ప్రఖ్యాతమైనాయి. అలాంటి ప్రయత్నం తెలుగులో ఇంకా రాలేదు. దీన్ని కొనసాగించాలి. ఇది ప్రాంతీయ సాహిత్యాన్ని నేర్చుకునే ప్రయత్నం కూడ. సాహిత్య ప్రక్రియల్ని విస్తృత పరచుకునే పద్దతి కూడా.

కన్నడ సాహిత్యంలో ‘దేవనూర మహాదేవ’ రచించిన దళిత కథలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇప్పటికి తెలుగులో అలాంటి కథలు లేవు. ఆ పద్దతిని మనం అంటు కట్టుకోవాలి. తమిళంలో పెరుమాండ్లు దళిత, స్త్రీ వాదాన్ని కలుపుకొని అనేక రచనలు చేశాడు.

తెలుగు ప్రాంతానికి వస్తే రాయల సీమ ప్రాంతం నుంచి అంటరాని వసంతం (నవల) మాత్రమే కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలైన తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి అనేక దళిత నవలలు రాయాల్సి ఉంది. ఇది ప్రాంతీయ సాహిత్యాల పరిశోధన. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ప్రత్యేక దళిత ఉప కులాల మీద అనేక మోనోగ్రాఫ్ లు రావాలి. అంతరించి పోయే దశలో ఉన్న, పట్టింపుకు దూరంగా ఉన్న, కొన్ని ప్రత్యేక లక్షణాలున్న ప్రత్యేక కులాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి.

ఉదా. తెలంగాణలో మాష్టి కులం, వీరు మాదిగ కుల వడ్రంగి, కుమ్మరి వృత్తులు నిర్వహిస్తారు.

ఆంధ్రాలో దండాసి కులం, దండ అంటే అధికార దండం, అసి అంటే కత్తి. వీరి ప్రధాన వృత్తి ఊరికి కాపలా కాయడం. కాని ఊరికి వెలుపలే జీవిస్తారు. ఇలాంటి కులాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. అనేక వ్యాసాలు, పరిశోధన గ్రంథాలు రావాలి. ఈ విధమైన పరిశోధన, పరిశీలన కెకెఆర్ పద్దతికి కొనసాగింపుగా అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కొత్త పద్ధతిని అనుసరిస్తే దళిత ఉద్యమం ఇంకా విస్తృతమై అనేక జన సమూహాల్ని చేరి విజయవంతం అవుతుందని భావిస్తున్నాను.

తెలంగాణలో జానపద కళారూపాలైన చిందు,డక్కలి మాదిగ ఉప కులాల కళారూపాలు. అవి ప్రచారం చేసే ‘జాంబ పురాణం ‘లాంటి దళిత పురాణ కళారూపాల్ని కథల రూపంలో, నవల రూపంలో, సరళ వచన రూపంలో రాసి పైకి తేవాలి. అదేవిధంగా జాంబ పురాణం ఆధారంగా నవలలు, కథల్ని రాసిన రచయితల్ని గురించి అన్వేషణ చేయాలి. మరింత ప్రోత్సాహాన్ని ఎక్కువ మందికి అందివ్వాలి.

కింది కులాల్లో కూడా కొంతమంది గొప్ప రచయితలు, కవులు ఉన్నారు. వారిని గుర్తించి, వారి రచనల్ని సంపుటాలుగా దళిత సాహిత్యంలో భాగంగా తీసుకురావాలి.

కొత్త సాహిత్య ప్రక్రియలు, మాల మాదిగల సాహిత్య జన బాహుళ్యానికి ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ఒడిసి పెట్టుకోవాలి. పైకి తేవాలి.

దళిత సమూహాల ప్రత్యేకమైన నానుడుల్ని, సామెతలను, పద బంధాలను దళిత సాహిత్యంలో భాగంగా ఒక పుస్తకంగా తేవాలి.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కింది కులాల దళిత నాయకుల గురించిన వ్యాసాలు ఏమిలేవు. వారి త్యాగాలు, సేవాతత్పరతను గుర్తించాలి. దళిత సాహిత్యంలో భాగంగా పుస్తక రూపంలోకి తేవాలని భావిస్తున్నాను.

తెలంగాణలో మాదిగల ఉప కులమైన చిందు లాంటి కులంలో పురుషుడితో పాటు సమానంగా స్త్రీలు వేషం కట్టి బాగోతం ఆడడం ఆ కళారూపంలో కనిపిస్తుంది. ఇది కళాత్మక దృష్టితో పరిశీలిస్తే అమోఘమైనది. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాళ్ళు ఇంకా సజీవులే.. వారి సంఖ్య తక్కువనే కూడా కావచ్చు. కాని వారి ప్రతిభా పాటవాలు ఏ మాత్రం తీసిపోవు. వాళ్లను గురించి కూడా దళిత సాహిత్యంలో భాగంగా పుస్తకాలు తేవాలి. అప్పుడే సాహిత్యానికి ముందు పోయే దారి కనబడుతుందని భావిస్తున్నాను. ఇది కెకెఆర్ అనుసరించి నేను సూచిస్తున్న సూచనలు. విమర్శక పద్ధతిని

జీడి రమేష్, రిసెర్చ్ స్కాలర్, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్. గ్రా. పల్లగుట్ట, మం. చిల్పూర్, జి. జనగాం, 50614435,
9652756516

Comments (0)
Add Comment