అమ్మ భాష అమృతపు జల్లుల భాష్యం

కొప్పుల ప్రసాద్ గారి వ్యాసం

అమ్మ భాషకు వందనాలు..!!

నాగరికత కల ప్రతి జాతికి భాష ఉంటుంది. ఆ జాతి మొత్తము ఆ భాషలోనే మనుగడ సాగిస్తూ, మాట్లాడగలుగుతుంది. భాషలో ప్రధానంగా సంస్కృతి- సాంప్రదాయాలు అంతర్లీనంగా వెన్నెముకలా ఉంటాయి.మాతృభాషగా తెలుగు ఉన్న మనమంతా ఈ విషయాన్ని మరవకుండా ముందుకు సాగాలి. అమ్మ భాషకు వందనాలు సమర్పించాలి. మాతృభాష పరిరక్షణకై ప్రతి తెలుగు వాడు కంకణ బద్ధుడై పోరాటం సలిపి, తెలుగు తల్లి ముద్దుబిడ్డలు గా ముందుకు సాగాలి. ప్రజల మధ్య భాష సోదరభావాన్ని పెంచుతుంది. దేశవిదేశాల హద్దులను దాటి సంస్కృతి సాంప్రదాయాల ప్రసార సాధనగా నిలబడుతుంది. మనుషుల మధ్య అడ్డుగోడలు కూల్చి విశ్వకళ్యాణం కోసం వసుధైక కుటుంబమై సర్వేజనాః సుఖినోభవంతు ఆశీర్వదిస్తుంది.

నేడు ఆంగ్ల భాషా వ్యామోహంతో మాతృభాషను వదలి
ఆంగ్లమే సర్వస్వమని భావించే రోజులు వచ్చాయి.
అటూ తెలుగు సరిగా రాక, ఇంగ్లీష్ భాషలో సరైన ప్రావీణ్యం లేక, ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. మొదట మాతృ భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఎన్ని భాషలు అయినా సులభంగా నేర్చుకోవచ్చును. ఒక భాష ఎక్కువ ఒక భాష తక్కువగా ఎప్పటికీ ఉండదు. ఆంగ్లం గొప్పకాదు
తెలుగు తక్కువ కాదు. నేడు తెలుగులో మాట్లాడడం అనాగరికంగా భావిస్తున్నాం. మన భాషను మనమే కించ పరుచుకుంటూ ఉన్నాం. ఎవరి భాష వారిదే, ఎవరి గొప్పలు వారివే.

ఒక జాతి మొత్తం అభివృద్ధివైపు అడుగులు వేసేందుకు
ముఖ్య కారణమూ, స్ఫూర్తి నిచ్చేదీ మాతృభాషే
చైనా జపాన్ లాంటి దేశాలలో వాళ్ళ మాతృభాషలోనే వారు అభివృద్ధి చెందారు తప్ప, ఆంగ్లం వల్ల కాదని ఈ సత్యాన్ని మనం గ్రహించగలగాలి, పొట్టకూటికి ఉద్యోగాలకు ఆంగ్లమే అక్కరకొస్తుంది. ఆంగ్లభాషావ్యామోహం తొలగిపోవాలి. మాతృభాషలో పట్టు సాధిస్తే, ఆంగ్లములోను రాణించగలం . దేశంలో ఎందరో ప్రముఖులైన తెలుగువారు తను మాతృభాష తెలుగు ద్వారానే ఉన్నత స్థానాన్ని పొందగలిగామని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు.

ముఖ్యంగా నేడు సాంకేతిక విజ్ఞాన మైన ఇంజనీరింగ్ కూడా మాతృభాషలోనే బోధన చేయాలని నిర్ణయించడం ఆనందదాయకం. తెలుగు మీడియం చదివితే, నష్ట పోతామని విద్యార్థులకు ఇది చాలా శుభసూచికం . అంతే కాకుండా ప్రభుత్వము కూడా, మాతృభాషలో చదివే విధంగా ప్రోత్సాహకరం పథకాలు తీసుకురావాలి. నేడు పిల్లలకు మాతృ భాష పైన మమకారము లేదు, అభిమానం చూపడం లేదు. వారికి తెలుగంటే అది ఏదో ఒక వింత భాషగా నేడు కనిపిస్తోంది. కారణం కార్పోరేట్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు. తల్లిదండ్రులలో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పాలన్న వెర్రి వ్యామోహంతో దినదినగండంగా నేడు తెలుగు భాష ప్రయాణం సాగిస్తున్నది.

అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ సంవత్సరంగా 2019ని ప్రకటించిన నేపథ్యంలో, తెలుగు నేల పైన తెలుగు భాషా పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణ జరగవలసినది ఎంతైనా ఉన్నది. ప్రతి తెలుగు వాడు, మాతృభాష అయిన తెలుగు వికాసం కోసం తలా ఒక చెయ్యి వేసి ముందుకు తీసుకుపోవడానికి అవసరం ఉన్నది.

సామాన్య ప్రజలు సైతం అందంగా కవితా ధోరణిలో మాట్లాడగలిగే భాష మన తెలుగు భాష ఒక్కటే. అమ్మ ఒడిలో సేద తీరితే వచ్చే ఆనందం తెలుగు భాష మాట్లాడితే వస్తుంది. ఎందరో మహానుభావులు తెలుగు భాషకు విశేషమైన కృషి చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు భాష గురించి ఎంతో ఉన్నతంగా వర్ణించిన మహాకవులు ఉన్నారు.

జనని సంస్కృతంబు సకల భాషలకును
భాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద
మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె..

వినుకొండ వల్లభరాయడు ఏనాడో తెలుగు భాష విశిష్ఠత పై పద్యములో తెలియజేశాడు.

మధుర మధురమైన మన భాష కంటెను
చక్కనైన భాష జగతి లేదు
తల్లి పాల కంటే తనయులకే పాలు
బలము నీయ గలవు తెలుగుబిడ్డ..

కొమర్రాజు లక్ష్మణరావు గారు మన భాష గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుకున్నాడు.

జన్మభూమి కన్న స్వర్గము వేరేది?
మాతృభాష కన్న మధుర మేది?
తల్లికన్న వేరె దైవమింకేదిరా
తెలియ మోయి నీవు తెలుగు బిడ్డ!

నార్ల చిరంజీవి గారు తన భాషాభిమానాన్నిలా చాటుకున్నారు.

“నిరక్షర కుక్షి మాట్లాడిన తెలుగు భాష శ్రవణానందకరంగా ఉంటుంది, తెలుగు ద్రవిడ భాషలన్నిటిలో మధురాతి
మధురమైనది ”

హెన్రీ మోరిన్ వంటి విదేశీయులు సైతం తెలుగు భాషను పొగిడారు.

“శబ్ద సంపద లోను, శబ్ద సౌష్టవం లోను , భావ వ్యక్తీకరణలోను, శ్రావ్యతలోను, తెలుగుకు తక్కిన భాషలు సాటిరావు”

ఎ.పి.కాంప్ సెల్ గారు తెలుగు విశిష్ఠతను ప్రపంచానికి చాటారు.

ప్రాచీన కవులు, ఆధునిక కవులు మన మాతృభాష మకరందాన్ని నలుదిశలా పంచి, ఉన్నత స్థానంలో నిలిపి నారు. విదేశీయులు సైతం తెలుగు భాషను గౌరవించి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ పొగిడినారు.మాతృభాషను అమృతమయం చేసేందుకు ఎందరో సాహితీకారులు తమ కలం ద్వారా పరిపూర్ణత ప్రసాదించారు.

అన్నీ పరాయి భాషలోనే దొరుకుతాయి అనే భ్రమ నుండి ముందు మనం బయట పడాలి. తెలుగు జాతికి ఈ ధోరణి చాలా ప్రమాదకరం. నేడు అంతర్జాలములో కూడా మనకు కావలసిన సమాచారం అంతా తెలుగులోనే లభిస్తున్నది.ప్రభుత్వాలు కూడా తెలుగు భాష లోనే ప్రయాణం సాగితే ప్రభుత్వ కార్యకలాపాలు త్వరితగతిన జరుగుతాయి.సామాన్యుడికి చేరువై ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.

భవిష్యత్తరాలకు మాతృభాషను సజీవంగా అందించగల గాలి, భావితరం పలుకుబడి ఉంచి మాతృభాష నిశ్శబ్దంగా జారి పోయిందో, క్రమేపీ అది కాలగర్భంలో కలిసి పోయినట్లే , అలా ఎన్నో భాషలు నేడు కనుమరుగై పోయినా విషయం గ్రహించాలి. మాతృభాషను మృతభాషగా కానివ్వరాదు. అమ్మ భాషను అమృత భాష గా తీర్చి దిద్దుటకై
సర్వ శక్తులను ఒడ్డీ వ్యక్తిగతంగా, వ్యవస్థగతంగా పోరాటం చేయాలి.భాషను మనమే కాపాడుకోవాలి. మన సంస్కృతీ సాంప్రదాయాలు భావితరాలకు అందించాలి. మన ఉనికిని నిలబెట్టుకోవాలి. అప్పుడే మాన జాతి బ్రతికి ఉన్నట్లు. మనం సజీవంగా ఉన్నట్టు.

కొప్పుల ప్రసాద్,
తెలుగు ఉపన్యాసకులు,
నలంద కళాశాలలు,
నంద్యాల,
9885066235.