తెలంగాణ ప్రాంతంలో మొహర్రం పండుగ మహత్యం – విశిష్టత

సాకివార్ ప్రశాంత్ కుమార్ గారి వ్యాసం

*తెలంగాణ ప్రాంతంలో మొహర్రం పండుగ మహత్యం – విశిష్టత*

తెలంగాణ ప్రాంతంలో చాలా పండుగలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.వాటిలో కొన్ని పండుగలు చాలా ప్రత్యేకమైనవి. బతుకమ్మ,దసర,హోళి,దీపావళి మొహర్రం వంటి పండుగలు చాలా ప్రత్యేకతను చాటుకున్నాయి. హిందు ముస్లింల ఐక్యతకు మొహర్రం పండుగ ప్రతీకగా చెప్పుకోవచ్చు. మొహర్రం ఇస్లాం పంచాంగంలో మొదటి నెల.ఈ నెలలో చంద్రుడు కనిపించిన 5వ రోజు (నెల వంక దర్శనం ) నుండి మొదలవుతుంది దీనినే ” పీర్ల పండుగ “అంటారు.మొహర్రం పండుగను ముస్లింలోని ” షియా ” మతస్థులు జరుపుకుంటారు. ముస్లింలు మొహర్రంను “యౌము-యె- అషురా” గా పిలుస్తారు

*ఇస్లాం మతము*
ఏకేశ్వరవాద ప్రాతిపదికపైన మహమ్మద్ ప్రవక్త 7వ శతాబ్ధంలో స్థాపించిన ఒక మతం 140 నుండి 180 కోట్ల జనాభాతో క్రైస్తవం తర్వాత ఇస్లాం మతంగా 2వ అతి పెద్ద మతం. ఇస్లాం అనునది మతము. ముస్లిం అనగా ఇస్లాం మతావలంబీకుడు. ఇస్లాం అనే పదానికి మూలం అరబ్బీ భాషా పదం ” సలెమ ” అనగా శాంతి, స్వచ్ఛత ,అర్పణ ,అణకువ, మరియు సత్ శీలత.

మహమ్మద్ ప్రవక్త మరణానంతరం అతని ప్రతినిధిని “ఖలీఫా” అంటారు

మహమ్మద్ ప్రవక్తకి ముగ్గురుకుమారులు మరియు నలుగురు కుమార్తెలు
*కుమారులు*
1)మహమ్మద్ ఖాసిం
2) మహమ్మద్ ఇబ్రహీమ్
3)మహమ్మద్ అబ్దుల్లా
*కుమార్తెలు:*
1)హజ్రతే జైనబ్
2) హజ్రతే ఉమెఖుల్సుమ్
3)హజ్రతే రోఖయ
4)హజ్రతే ఫాతిమ

ప్రవక్త యొక్క 4వ కుమార్తెయైన హజ్రతే ఫాతిమా మరియు నాల్గవ ఖలీఫా అయిన హజ్రతే ఆలీల సంతానమే “హజ్రతే ఇమామ్ హస్సేన్,హజ్రతే ఇమామ్ హుస్సేన్”

*హస్సేన్ – హుస్సేన్ చరిత్ర:*
క్రీ.శ 680 సంవత్సరంలో ప్రజల హక్కుల కోసం జరిగిన ఒక పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జరిపే పండగే పీర్ల పండుగ. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం పాలన కొనసాగించిన హజ్రతే అబుబాకర్ సిద్ధిఖ్,హజ్రతే ఉమర్, హజ్రతే ఉస్మాన్,హజ్రతే ఆలీలు సైతం మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందారు . కానీ ఆ తర్వాత వచ్చిన “హజ్రతే మావియ” అనే చక్రవర్తి ప్రజలను పీక్కుతినడం మొదలు పెట్టాడు దీనితో ముస్లిం జాతి ప్రపంచమంతా 2 వర్గాలుగా విడిపోయింది.అతని వారసుడిగా వచ్చిన “యజీద్” చక్రవర్తి ఏకంగా రాక్షస పాలన కొనసాగించాడు “యజీద్” అందరినీ అణచి రాజు అయ్యాడు.చెడు అలవాట్లకు బానిస అయిన యజీద్ ప్రజలను వేధిస్తుంటే ఇమామ్ హుస్సేన్ వ్యతిరేకించి ధైర్యంగా ఎదురు తిరిగాడు.ప్రజలు హుస్సేన్ పక్షాన నిలబడ్డారు.శాంతి ప్రతిపాదననే శ్రేయస్కరమని హుస్సేన్ చేసిన ప్రతిపాదనను
యజీద్ తోసిపుచ్చడమే కాక ఇమామ్ హుస్సేన్ పై యుద్ధం ప్రకటించాడు.మొహర్రం నెల ఒకటవ రోజున “కూఫా” నగరం లోని “కర్భల మైదానం” లో సమరం ప్రారంభం అవుతుంది ” యజీద్” సైన్యం వేల మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటుంది.మొహర్రం నెల పదవ రోజున “యజీద్” సేనలు రెచ్చిపోతాయి.అయినా వెనకడుగు వేయకుండా హుస్సేన్ సైన్యం వారు వీరోచితంగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. సాయం సంధ్యావేళలో కర్భలా యుద్ధ మైదానంలో నమాజు చేస్తున్న ఇమామ్ హుస్సేన్ ను శత్రుసైన్యం ముట్టిడించింది. ప్రార్ధనలో భాగంగా భూమిపై తల ఆనించిన వెంటనే సైన్యాధిపతి “షిమర్” ఆదేశాల మేరకు హుస్సేన్ – బిన్ – నమీర్ అనే సైనికుడు దాడి చేశాడు . వెనువెంటనే సన్నాన్-బిన్-ఆనస్ అనే సైనికుడు హుస్సేన్ యొక్క తలను మొండెంను వేరు చేశాడు.హుస్సేన్ మరణానికి ముందే “యజీద్ తెగ” వారు హస్సేన్ కి విషం ఇచ్చి చంపుతారు.ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబీకులను ప్రజలు ఇప్పటికీ స్మరిస్తునే ఉంటారు.దానికి గుర్తుగా మొహర్రం పండుగ సమయంలో
“షియా” ముస్లింలు కత్తులతో బ్లేడులతో తమ శరీరాలను గాయపరుచుకుంటు రక్తం చిందించటం గుండెలను బాదుకుంటూ ఊరేగింపు నిర్వహించడాన్ని “మాతం” అంటారు.మొహర్రం నెలలో పదవ రోజుని “ఆషురా” గా పిలుస్తారు.

*పండుగ జరిపే విధానం*
పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తారతమ్య భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారు.పీరీలను నమ్మే ముస్లింలతో పాటు హిందువులు కూడా నమ్మి కొలుస్తారు.మొహర్రం నెలవంక కనిపించిన దగ్గరి నుండి నిమజ్జనం ముగిసే వరకు మద్యమునకు దూరంగా ఉంటారు.నిష్టగా ఉండి కటిక నేల పైన నిద్రపోతారు.పీర్లబంగ్లా వద్ద అగ్నిగుండం లేదా ఆలువ ఏర్పాటుచేస్తారు.కాళ్లకు గజ్జలు కట్టుకొని లయబద్ధంగా “అసైదులా” ఆడుతారు.నిప్పుకణికలపై పీర్లను పట్టుకొని నడవడాన్ని మహత్యంగా భావిస్తారు.పీర్లు పట్టినవారికి పూనకం వచ్చినప్పుడు వారితో తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం కోరుతారు.పూనకం వచ్చినప్పుడు పిల్లలు లేని మహిళలు కొంగు చాచి నిలబడతారు.పీర్లకు అలంకరించిన దండల్లోంచి కొంగులో పువ్వు పడితే బాలుడు,ఆకు పడితే బాలిక పుడుతుందని నమ్ముతారు.పీర్లను మొక్కిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రాప్తి.పీర్లను మొక్కటం వలన పిల్లలు పుడితే వారికి ముస్లిములు అయితే హస్సేన్,హుస్సేన్ అనీ,హిందువులు అయితే ఆశన్న, ఊషన్న అని పేర్లు పెడతారు.అన్నం, షర్బత్,బెల్లం,మలీద ముద్దలు(చక్కెర+చపాతీ మిశ్రమం) సమర్పిస్తారు.దీనినే “మటికీలు” తీయడం,చదివించడం అంటారు.మేకలు,కోళ్ళు పీర్లకు సమర్పించటాన్ని “కందోర” చేయించడం అంటారు.ఆఖరి రోజు అయినా పదవరోజు జల్తా అనగా కర్భల ఊరేగింపు ఉంటుంది.పదిరోజుల పాటు జరిగే ఈ పండుగలో పీర్లను నిలపడం మొదలుకొని పీర్ల నిమజ్జనం వరకు వందల సంఖ్యలో భక్తులు పాల్గొని అల్విదా పలుకుతారు.

*పీర్లు-రకాలు*
పీర్లు రకరకాల ఆకారాల్లో తయారుచేస్తారు.కిరీటాలు పంజా ఆకారంలో,అర్ధ చంద్రాకారంలో,చేయి ఆకారంలో…ఇత్తడి,వెండితో తయారుచేస్తారు.వీటిని పొడుగాటి కట్టెలకు గుమిటీ తయారుచేసి వాటికి అందంగా రంగు రంగుల బట్టలు అలంకరించి పూలదండలతో వెండిపేర్లతో,యంత్రాలతో అలంకరిస్తారు.గ్రామాలలో ఈ పీర్లకు పేర్లు కూడా ఉంటాయి.దూద్ పీరు,పంజా,మొహమ్మద్ ఆలీ,లాల్ చావా,వెండి పీరు,సత్యపీరు…తర్వాత ఆయా కులాల వారు ఇంటి పేర్ల మీదుగా పీర్లను నిలుపుతారు.

*ప్రత్యేకత*
కుతుబ్ షాహీలు “షియా” మతస్తులు కావడంతో గోల్కొండ రాజ్యంలో మొహర్రంకెంతో ప్రాధాన్యత పెరిగింది.తెలంగాణ రాష్ట్రంలో అంతటా చాలా ఘనంగా భక్తియుక్త కార్యక్రమాలతో,హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో,ఆదిలాబాద్ జిల్లాలో పల్లె ప్రాంతాలైనా రుయ్యాడి, అర్లి(కే),తలమడుగు,బరంపూర్, బండల నాగపూర్…వంటి గ్రామాల్లో ప్రతీ సంవత్సరం మొహర్రం పండుగను చాలా ఘనంగా ప్రత్యేకంగా నిర్వహిస్తారు.ప్రతీ సంవత్సరం దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి సందర్శించి మొక్కులు మొక్కుకుంటారు.

*తెలంగాణ ఉద్యమంలో మొహర్రం పండుగ పాత్ర*
తెలంగాణ ఉద్యమంలో “ఆలువ ఆట” ఓ ఆయుధమైంది.ఉద్యమ గేయాలు ఆలపిస్తూ జట్టుకట్టి కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆలువాట ఆడటం అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ పిలుపుకి సాధనంగా ఈ ఆటను వాడుకోవడం జరిగింది.

ప్రతీ సంవత్సరం త్యాగానికి గుర్తుగా ఈ శోక దినాలైన పది రోజుల పండుగను కోరిన కోరికలు తీర్చే తమ దైవంగా పీర్లను భక్తులు నమ్ముతూ కొలుస్తూ ఉంటారు.హస్సేన్,హుస్సేన్ ల బలిదానం ప్రజలకు,ధైర్యానికి,ధార్మికతకి,నిజాయితీకి,భక్తికి, భగవంతుని ఇచ్ఛకు సమర్పించుకోవడానికి చిహ్నం అయింది.

సాకీవార్ ప్రశాంత్ కుమార్
తెలుగు ఉపన్యాసకులు
TMRJC ఖానాపూర్
9381475331