మట్టి హృదయం…!

కొప్పుల ప్రసాద్

మట్టి హృదయం…!!

ఆ మట్టి పరిమళం స్పర్శిస్తుంటే
బాల్యపు గుర్తులతో గుండె బరువెక్కింది
మట్టి పిసికిన చెయ్యికి
అంటుకున్న జ్ఞాపకాలతో కన్నీటి సుడులు..

సొంత ఊరు కన్న తల్లిలా
అడుగుపెట్టగానే మంచి నీళ్ల బావి ఆహ్వానం
మట్టి మనసును తట్టి లేపి
కళతప్పి బోసి పోయి మా వైపు దీనంగా చూసె…

పాడుబడ్డ బావి ప్రక్కనే
తరతరాలుగా చెత్త నింపుకున్నాను
పుష్పకవిమానము లా ఇంకా స్థలం మిగిలే ఉంది
ఊరికి వచ్చే వారికి స్వాగత ఏర్పాట్లు చేస్తూ.

కల్లము లో చింత తోపు కనబడలేదు
పశువుల కొట్టం భవంతి యై కూర్చుంది
చెట్లపై ఆడిన ఆటల ఆనవాళ్లు పలకరిస్తే
చెమ్మగిల్లిన కళ్ళకు చెట్టు భస్మం కనబడే..

రచ్చబండ సందడి కళతప్పి
ముసిలి ప్రాణాలు మూలుగుతూ కూర్చున్నాయి
గత వైభవాన్ని నెమరువేస్తూ
రాజసం కోల్పోయిన వీధి అరుగు వింతగా చూస్తూంది..

దేవాలయాల్లో రూపురేఖలు మారినా
మనుషుల్లో ఆ కాలపు పలకరింపులు అందలేదు
ఆధిపత్యపు పోరు లే పోకడలు
ఆప్యాయత లో ఉప్పు కారం కనిపిస్తూంది..

నలభై వసంతాల వాళ్లు పలకరిస్తే
ఇరవై ఏండ్ల వాళ్లకు నేనొక ప్రశ్న
నా తర్వాతి తరం కోసమే నేను ప్రయాణం
పరిచయం చేయాలనే ఆత్రుతతో..

నా బాల్య స్మృతులను నెమరు వేస్తూ
నా సంతానానికి పరిచయం చేస్తూ
పెద్దలు ఇచ్చిన పొలమును చూపిస్తూ
వారికి సొంతూరి మట్టి సింధూరం దిద్దిన…

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235