కవి కోకిల గుర్రం జాషువా ..గబ్బిలం పై లఘు విశ్లేషణ

B. రాణి లీలావతి

కవి కోకిల గుర్రం జాషువా ..గబ్బిలం పై లఘు విశ్లేషణ
———————————————————————
కవి ఏ పాత్రను చిత్రించేటపుడు ఆ పాత్రలో తాదాత్మ్యం చెందాలి అపుడే సజీవ పాత్ర చిత్రణ
జరుగుతుంది అంటే పరకాయ ప్రవేశం లాగ పరాత్మ
ప్రవేశం …మరి కవి తన ఆత్మను పాత్రలో ప్రవేశ
పెడితే అది గబ్బిలమే అవుతుంది …గబ్బిలం
చిరస్మరణీయం ఐంది అందుకే అనటం అతిశయోక్తి కాదు.

రూపంలో ప్రాచీనత,వస్తువులో ఆధునికత కనిపిస్తుంది జాషువ రచనలలో ….లాలిత్యమైన
పదాలు చదువరులకు రసజ్ఞతను కల్గిస్తాయి అనడంలో సందేహమే అవసరం లేదు. సామాజిక
అంతరాలు తొలగిపోవు ..అవి ఎప్పుడు రుగ్మతగా కొనసాగుతూనే
మనిషి ఎదుగుదలను ఆటంక పరుస్తూ మానసిక
వేదనను కలిగిస్తూ హేళనను రగిలిస్తూనే ఉంటాయి. గబ్బిలంలో
నీతి మంతుడైన కడగొట్టు బిడ్డడు తన గోడును వెల్ల
బోసుకునే క్రమంలో …కవి రాత్రిని వర్ణిస్తూ
భూనభముల గ్రొoజీకటు లేనుగునకు మదము వోలి
యెసక మెసఁగె ….భూమ్యాకాశాలకు చీకట్లు ఏనుగుకు మదము అతిశయించినట్లు కమ్ముకున్నాయి
అని చెప్పడంలో చీకటిని మదపుటేనుగు తో పోలుస్తూ
చెప్పడం లోనే లోకం పోకడ ను గర్హి స్తున్నట్టుగా గమనించవచ్చు.
తన చిన్న గుడిసెలో గుడ్డి దీపమును తన రెక్కలతో ఆర్పివేసి నపుడు ఆ అభాగ్యుడు చూస్తు వుండి కూడా కోపపడలేదు,ఎందుకంటే లోకం లోని మనుషులు మదము తో కళ్ళు మూసుకుపోయి చీకటిలో వుంటూఅదే వెలుగుగా భ్రమపడుతు జీవిస్తున్నారని కవి ఆంతరంగిక భావనని తలవవచ్చు. ఎవరైనా ఇటువంటి స్థితిలో పక్షిని కసిరికొడతారు,తన దారిద్ర్యపు ఆక్రోశాన్ని ఆ చిన్నిజీవిపై
చూపించి మానసిక సర్దుబాటు చేసుకుంటారు,కానీ ఇక్కడ తన ఇంటికి వచ్చినన్దుకు,తన బాధ చెప్పుకుంటూ … మదోన్మత్త ప్రపంచoబులో బులుగు, బుట్రలు గాక బేదలకు నాప్తుల్ జుట్ట పక్కంబులున్ గలరే అంటాడు…ఇక్కడ ఇంకోసారి మదము అనే పదం మనం గమనించవచ్చు,లోకమంతా ఎంతటి అహంకారంతో నిండిపోయి వుందో,సాటి మనిషి పట్ల ఎంత క్రూరంగా వుందో చెప్పడానికి మాటల జాలని కవి వాని కవోష్ణ బాష్పములు వ్యాఖ్యానించే అంటాడు ….వాని హృదయం ఎంత వేదనతో మరుగుతుందో మరి ఆ కన్నీరు ఎంత వెచ్చగా వుందో ఉష్ణమాపని కూడా కొలవలేదేమో కదా…నిషిద్ధ గేహినైన తను, అపశకున పక్షి గా వెలివేయ బడిన గబ్బిలాన్ని సహోదరీ అని సంబోధించడం ఇక్కడ వ్యంగ్య సముచితంగా గమనింపవచ్చు.ఇంకా
పగలంతా ఒక మునిలా సంసారమంతా చక్కబెట్టుకుని రాత్రి వేళ బెంగపడే వారిని ఓదార్చడానికి వస్తావు, నిష్కల్మషమైన మర్యాదను,గౌరవాన్ని స్వీకరించేందుకు నువ్వు అర్హురాల వని కవి చెప్పడంలో అంతరార్ధం
గమనిస్తే గౌరవాన్ని పుచ్చుకోవడానికి అర్హులు నిజంగా ఎవరో (సాటి వారి కన్నీరు తుడవ గలిగె దయార్ద్ర హృదయుులు)మనకు తెలుస్తుంది.
ఇలాంటి మానవీయ కోణాలెన్నో జాషువా ఈ రచనలో సుస్ప ష్టంగా
గోచరిస్తాయి.

B. రాణి లీలావతి.