వ్యాధి నిరోధక టీకాలు… బంగారు బాల్యానికి పునాదులు

*వ్యాధి నిరోధక టీకాలు… బంగారు బాల్యానికి పునాదులు..!*:
“””””””””””””””””””””‘”‘”””””‘”””””””””””””””””””””””””‘”‘””””””””‘”””
*10 నవంబర్ .. ప్రపంచ రోగ నిరోధక దినోత్సవం (వరల్డ్ ఇమ్యునైజేషన్ డే):*

అమ్మ చేతి గోరు ముద్ద రుచి మరువక ముందే, బుగ్గ మీద నాన్న పెట్టిన ముద్దు తడి ఆరక ముందే… మొగ్గలోనే రాలిపోయే చిన్నారి సుమాలను రక్షించడం మన తక్షణ కర్తవ్యం. శిశువు పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వయస్సు లోపల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధుల బారిన పడటం, మరణించడం కూడా జరుగుతుంది. ఎక్కువగా టీకాల ద్వారా నివారించదగ్గ వ్యాధుల నుంచి శిశుమరణాలు సంభవిస్తున్నాయి. పుట్టిన ప్రతి శిశువుకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు సంపూర్ణంగా, క్రమం తప్పకుండా ఇప్పించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులైన క్షయ (టిబి), పోలియో, కామెర్లు (హెపటైటిస్-బి), కంఠ సర్పి (డిఫ్టీరియా), కోరింత దగ్గు, ధనుర్వాతం, హిమోపిల్లస్ ఇన్ఫ్లుఎంజా-బి, మెదడు వాపు, న్యూమోనియా, తట్టు (మీజిల్స్), రూబెల్లా, రోటా వైరస్ నీళ్ళ విరేచనాలు (డయేరియా) మొదలైన 12 రకాల వ్యాధుల నుంచి చిన్నారులను టీకాలు వేయించడం ద్వారా కాపాడుకోవచ్చు. కానీ తల్లిదండ్రుల అశ్రద్ధ, అవగాహన లేని కారణంగా తమ పిల్లలకు క్రమం తప్పకుండా సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించక పోవడం వల్ల శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల సకాలంలో టీకాలు వేయడం ద్వారా వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత మరియు అంటువ్యాధుల వ్యాప్తి నివారించి, సమాజాన్ని రోగాల నుంచి రక్షించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ఇమ్యునైజేషన్ గురించి ఆరోగ్య అవగాహన పెంచడానికి ప్రతీ ఏటా నవంబర్ 10వ తేదీన ప్రపంచ రోగ నిరోధక దినోత్సవం (వరల్డ్ ఇమ్యునైజేషన్ డే) నిర్వహించుకుంటాము.


*ఆరోగ్యకర ప్రపంచ పయనానికి అద్భుతమైన మార్గం ఇమ్యునైజేషన్*: ఆరోగ్య శాఖ అందించే అన్ని సేవలలో టీకాలిచ్చే కార్యక్రమానికి (ఇమ్యునైజేషన్) ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. నేడు ప్రపంచంలో లభ్యమయ్యే అన్ని ఆరోగ్య సేవలలో ఇమ్యునైజేషన్ ఎంతో సురక్షితమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావము కలిగిస్తుంది. వ్యాధి రాకముందే నివారించడం వల్ల డబ్బు అరికట్టడమే కాకుండా మరణము నుంచి కాపాడుకోవచ్చు. పటిష్టమైన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థకు ఇమ్యునైజేషన్ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కార్యక్రమం. వ్యాధి లేని ఆరోగ్యవంతమైన బాల్యాన్ని ఇమ్యునైజేషన్ ప్రసాదిస్తుంది. చిన్నారులకు, వారి కుటుంబాలకు
ప్రాణాంతకమైన వ్యాధుల నుండి రక్షణ అందిస్తుంది.

*వ్యాధి నిరోధక టీకాల ప్రాధాన్యత:* పుట్టిన శిశువు తల్లి నుంచి పొందిన సహజ ప్రతిరోధకాలు ఎక్కువ కాలం ఉండవు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఆ రోగనిరోధక శక్తి పెంపొందించు కోవడానికి మనం కొత్తగా ఏర్పరచే అదనపు రక్షణ వ్యవస్థనే ఇమ్యు నైజేషన్ (వ్యాధి నిరోధక టీకాకరణ) అంటారు. వైరస్‌లు మరియు బాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకు శిశువు శరీరం యొక్క సహజ రోగనిరోధక ప్రతిస్పందనను పెంచడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో టీకాలు సమర్థవంతమైన సాధనం. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు వ్యాధి వ్యాప్తి, శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం మరియు శిశు మరణాలను తగ్గించడం ద్వారా మన జనాభా యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దారితీశాయి. సరైన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా వ్యాక్సిన్‌లు సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి అని నిరూపించబడినవి. పిల్లవాడు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాడు, రోగ నిరోధక టీకాలు వేయించుకోవడం అవసరమా? అనే సందేహం కొందరిలో ఉండవచ్చు. కానీ శిశువులో వ్యాధి అభివృద్ధి చెందక ముందే వ్యాక్సినేషన్ (టీకాలిచ్చుట) వ్యాధి రాకుండా రక్షణ కవచాన్ని అందిస్తుంది. వ్యాధి తర్వాత టీకాలు వేయించు కోవడానికి వేచి ఉంటే, అంతలోపు జరిగే అనర్థం జరుగవచ్చు. చికిత్స కంటే నివారణ ఉత్తమం.
దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎంతో మంది ఏ.ఎన్.ఎం.లు మహోన్నతమైన సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారు. మన దేశంలో 1950 సం.లో ఏడాదికి1000 మంది శిశువులు జన్మిస్తే వారిలో దాదాపు189 మంది శిశువులు వ్యాధులతో మరణించేవారు. కానీ శిశు మరణాల రేటు ప్రస్తుతం 25 కి తగ్గింది. రాష్ట్రంలో 2014 లో శిశుమరణాల రేటు 39 నుండి ప్రస్తుతం 21 కి తగ్గింది. దీనికి ముఖ్య కారణం వ్యాధి నిరోధకత టీకాల కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించడమే అని చెప్పవచ్చు.

*ప్రపంచ వ్యాధి నిరోధక టీకాల గత చరిత్ర:* వ్యాధి నిరోధక టీకాల సంప్రదాయం వేల సంవత్సరాల నాటిది. 11వ శతాబ్దానికి పూర్వం, చైనాలోని బౌద్ధ సన్యాసులు పాము కాటుకు రోగనిరోధక శక్తిని పొందడానికి పాము విషాన్ని తాగేవారు. ఎడ్వర్డ్ జెన్నర్ మొదటి మశూచి వ్యాక్సిన్ 1796లో అభివృద్ధి చేశాడు. ఎడ్వర్డ్ జెన్నర్ టీకా శాస్త్ర స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అతను 13 ఏళ్ల బాలుడికి వ్యాక్సినియా వైరస్ (కౌపాక్స్)తో టీకాలు వేయించి మశూచికి రోగనిరోధక శక్తిని ఎలా పొందాలో చూపించాడు. తరువాత మశూచి టీకా 18 – 19వ శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడింది. దీని ఫలితంగా 1979లో మశూచి విశ్వవ్యాప్తంగా నిర్మూలించబడింది.
1897లో, మరొక వైద్యుడు, లూయిస్ పాశ్చర్, కలరా వైరస్‌తో పనిచేసే, నిష్క్రియం చేయబడిన ఆంత్రాక్స్ వ్యాక్సిన్‌తో మానవులకు టీకాలు వేయగలిగాడు. ఫలితంగా కలరా టీకా అభివృద్ధి చేయబడింది. 20వ శతాబ్దంలో టీకా పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో గొప్ప పెరుగుదల కనిపించింది. ఒకప్పుడు ప్రాణాంతకమయ్యే వ్యాధులకు చాలా మంది రోగనిరోధక శక్తిని పొందుతున్నారు. ప్రయోగశాలలో వైరస్‌లను పెంచే పద్ధతులు పోలియో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం వంటి వేగవంతమైన ఆవిష్కరణలకు దారితీశాయి. మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వంటి పిల్లలను ప్రభావితం చేసే ఇతర వ్యాధులకు కూడా పరిశోధకులు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశారు. వ్యాధి నిరోధక టీకాలు ప్రపంచంలో ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ల కంటే ఎక్కువ మరణాలను నివారిస్తున్నాయి. టీకాలు “మంద రోగనిరోధక శక్తిని”(హెర్డ్ ఇమ్యూనిటీ) కలిగిస్తాయి. అనగా మెజారిటీ వ్యక్తులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లయితే, వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తికి వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యాధి వ్యాప్తి చెందదు.
2000 మరియు 2008 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ కారణంగా మరణాలను 78% తగ్గించడంలో టీకాలు సహాయపడ్డాయి. 1988లో టీకా వేసినప్పటి నుంచి, బాక్టీరియల్ మెనింజైటిస్ వ్యాధి ప్రభావం 99% తగ్గింది. ఒకప్పుడు వేలాది మంది పిల్లలను చంపిన కొన్ని వ్యాధులు పూర్తిగా తొలగించబడ్డాయి.

*భారత్ లో టీకా వ్యవస్థ:* భారతదేశం మొదటి సారి 1978 సం.లో విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంగా (EPI) ప్రారంభించింది. ఆ తరువాత సమాజమునకు అందించే టీకాల కవరేజ్ ని పెంచుటకు 1985లో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంగా (UIP) మార్పు చేసింది. మన దేశంలో మశూచి (స్మాల్ పాక్స్) టీకాలు పకడ్బందీగా నిర్వహించి మశూచి వ్యాధి లేని భారత్ గా WHO. ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాం. భారత్ లో వ్యాక్సిన్‌ల ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి పోలియో ఒక చక్కని ఉదాహరణ. పోలియో ఒకప్పుడు భారతదేశం యొక్క అత్యంత భయానక వ్యాధి. ఇది దేశవ్యాప్తంగా మరణాలు మరియు పక్షవాతం కలిగించింది. కానీ 1995 నుండి “ఉదృత పల్స్ పోలియో కార్యక్రమం (PPI )” ప్రారంభించబడింది. ఊరూర, వాడ వాడలా, బడి, గుడి, పంట పొలాల వద్ద, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లలో, వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు యితర శాఖల సిబ్బంది సహకారం, సమన్వయంతో ఎంతో శ్రమించి అంతటా గాలించి ఎవరినీ వదలకుండా ఐదేండ్ల వయస్సు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా 2011 సం. తర్వాత నుండి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవటం మనందరికీ గర్వ కారణం. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పోలియో రహిత భారత్ గా ప్రకటించింది. కానీ మన చుట్టు పక్కల దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతుండటం వల్ల ముందస్తు అప్రమత్తత కోసం ఇప్పటికీ పోలియో టీకా వేస్తునే వున్నాం. 2015 సం.లో WHO. ధనుర్వాత రహిత భారత్ గా గుర్తింపునిచ్చింది. నియోనేటల్ టెటానస్ (నవజాత శిశు ధనుర్వాతం) లేకుండా పోయింది. ఈ విధంగా ఆరోగ్య రంగంలో ప్రజలందరి సహకారంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. టిబి, డిప్తిరియా, కోరింత దగ్గు, న్యూమోనియా, కామెర్లు, మెదడువాపు, తట్టు (మీజిల్స్), రుబెల్లా మొదలైన ప్రాణాంతక వ్యాధుల నివారణ లక్ష్య సాధన కోసం ప్రభుత్వంతో కలసి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉంది. నేటికీ ప్రపంచంలో టీకాలు వేయని మరియు తక్కువ టీకాలు వేయబడిన పిల్లలు ఉన్నారు.

*మిషన్ ఇంద్రధనుష్:* భారత దేశం 25 డిసెంబర్ 2014 సం.లో రెండేళ్ల లోపు చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు రొటీన్ ఇమ్యునైజేషన్ లో మొత్తమే టీకాలు వేయించుకోని లేదా కొన్ని తీసుకొని మరికొన్ని టీకాలు మధ్యలో వదిలేసిన పిల్లలను గుర్తించి, అర్హులైన చిన్నారులందరికీ తొంబై శాతానికి పైగా పూర్తి వ్యాధి నిరోధక టీకాలు అమలు పరిచే లక్ష్యంతో మిషన్ ఇంద్రధనుష్ టీకా కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మిషన్ ఇంద్రధనుష్ లో భాగంగా ఆషా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం.లు మొదలగు క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, పూర్తిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని రెండేళ్ళ లోపు చిన్నారులను గుర్తించి ప్రత్యేక టీకా శిబిరముల ద్వారా టీకాలు వేయడం జరుగుతుంది.

*టీకాలు ఎప్పుడు ఎక్కడ వేస్తారు?:* అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆరోగ్య ఉప కేంద్రాలలో ప్రతీ బుధ, శని వారం రోజులలో జాతీయ వ్యాధినిరోధక టీకాల షెడ్యూల్ ప్రకారం, మాతా శిశువుల పూర్తి సమాచారం ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేసి, శిక్షణ పొందిన ఏ.ఎన్.ఎం.లు ఉచితంగా అన్ని రకాల టీకాలు వేయడం జరుగుతుంది. అన్ని టీకాలు షాట్‌లు(ఇంజెక్షన్) గా ఇవ్వబడవు. కొన్ని చుక్కల రూపంలో నోటి ద్వారా కూడా వేయబడతాయి. గుర్తింపు పొందిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా టీకాలు వేస్తారు.

*వ్యాధినిరోధక టీకాలు- వివరాలు:* శిశువు పుట్టినప్పుడు 24 గంటల లోపు బి.సి.జి.(టిబి నివారణకు), ఓపివి-0 డోస్ (పోలియో నివారణకు), హెపటైటిస్ బర్త్ డోస్ (కామెర్ల నివారణకు) టీకాలు వేయించుకోవాలి. 6 వారాలకు(1 1/2 నెలలు) ఓపివి-1(పోలియో నివారణకు), ఆర్.వి.వి.-1(తీవ్ర నీళ్ళవిరేచనాల నివారణకు), ఎఫ్.ఐ.పి.వి.-1 (పోలియో నివారణకు), పెంటా-1 (కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు &న్యూమోనియా నివారణకు),పి.సి. వి.-1 (న్యూమోనియా నివారణకు) టీకాలు వేయించుకోవాలి. 10 వారాలకు (2 1/2 నెలలు) ఓపివి-2 (పోలియో నివారణకు), ఆర్.వి.వి.-2 (తీవ్ర నీళ్ళవిరేచనాల నివారణకు), పెంటా-2 (కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం,కామెర్లు, మెదడువాపు & న్యూమోనియా నివారణకు) టీకాలు వేయించుకోవాలి. 14వారాలకు (3 1/2 నెలలు) ఓపివి-3 (పోలియో నివారణకు), ఆర్.వి.వి.-3 (తీవ్ర నీళ్ళవిరేచనాల నివారణకు), ఎఫ్.ఐ.పి.వి.-2 (పోలియో నివారణకు), పెంటా-3 (కంఠసర్పి, కోరింతదగ్గు, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు &న్యూమోనియా నివారణకు), పి.సి. వి.-2 (న్యూమోనియా నివారణకు) టీకాలు వేయించుకోవాలి. 9-12 నెలలకు యం.ఆర్.-1 (తట్టు, రూబెల్లా నివారణకు), జె.ఈ.-1 ( మెదడువాపు నివారణకు), ఎఫ్.ఐ.పి.వి.-3 (పోలియో నివారణకు), పి.సి. వి.-బి. (న్యూమోనియా నివారణకు) టీకాలు వేయించుకోవాలి. 16-24 నెలలకు యం.ఆర్.-2 (తట్టు,రూబెల్లా నివారణకు), జె.ఈ.-2 (మెదడు వాపు నివారణకు), ఓపివి-బూస్టర్ (పోలియో నివారణకు), డి.పి.టి.-1 (కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు), 5-6సం.లకు డి.పి.టి.-2 (కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు), 10సం.లకు మరియు 16 సం. లకు టి.డి.-1 &2 (కంఠసర్పి, ధనుర్వాతం నివారణకు) టీకాలు వేయించుకోవాలి.

*టికాలపై అపోహలు వద్దు, ఆరోగ్య అవగాహనే ముద్దు :* వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం కవరేజ్ అయ్యేవిదంగా అమలు చేయడమే లక్ష్యంగా కృషిచేయాలి. టీకాల కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు, టీకాలు వేయించుటకు తల్లిదండ్రులు ఎందుకు నిరాకరిస్తున్నారో తెలుసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి. టీకాలు పిల్లలకు ఎంత వరకు అందుతున్నాయో సమీక్ష నిర్వహించాలి. టీకాలపై మూఢ విశ్వాసాలు, ఆందోళనలు, అపోహలు, భయాలను తొలగించి ప్రజల్లో చైతన్యం పెంపొందేలా చర్యలు చేపట్టాలి. వ్యాక్సిన్ ఇచ్చే, పర్యవేక్షించే, అమలు పరిచే సిబ్బందికి దానికి సంబంధించిన శీతలీకరణ పద్ధతుల నిర్వహణ (కోల్డ్ చైన్ సిస్టమ్), టీకాలు వేయబడే అర్హులైన పిల్లల జాబితా తయారీ, టీకాలు ఇచ్చుటలో విషయ పరిజ్ఞానం పెంచుటకు నైపుణ్యత పెంపొందించుటకు తరచుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.

*తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:* బిడ్డకు సకాలంలో, సక్రమంగా అన్ని రకాల టీకాలు పూర్తిగా ఇప్పిస్తేనే, వ్యాధుల నుంచి పూర్తి రక్షణ కలుగుతుంది. కొద్దిపాటి జ్వరం, జలుబు,దగ్గు, నీళ్ళ విరేచనాలు వంటి చిన్న అనారోగ్యాలు ఉన్నా టీకాలు నిర్ణీత దినాన తప్పనిసరిగా ఇప్పించాలి. ఇచ్చిన టీకా ఏమిటి? ఏ వ్యాధి రాకుండా నివారిస్తుంది? తెలుసు కోవాలి. టీకాలు వేసిన తర్వాత జ్వరం, దద్దుర్లు, గడ్డకట్టడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలి. మళ్ళీ వ్యాక్సిన్ కోసం ఎప్పుడు, ఎక్కడికి రావాలో తెలుసుకోవాలి. టీకా కార్డును జాగ్రత్తగా భద్రపరిచి, తదుపరి సందర్శనలో తప్పక తీసుకు వెళ్ళాలి. వ్యాధినిరోధక టీకాలు బంగారు బాల్యానికి పునాదులని మరవొద్దు.
-నాశబోయిన నరసింహ (నాన), కవి, రచయిత, ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108

Comments (0)
Add Comment