ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కృషి. ఆన్‌లైన్‌లో వేతనాల చెల్లింపు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు. నిబంధనల మేరకు సెలవులు, ఆరోగ్య బీమా వర్తింపునకు నిర్ణయం. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు… స్వాగతిస్తున్న యాజమాన్యాలు.
ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, సదుపాయాలను వర్తింపజేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్–ఎయిడెడ్ (ప్రైవేటు) పాఠశాలల యాజమాన్య ప్రతినిధులతో ఇటీవల విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న విధాన నిర్ణయాలపై గత నెల అక్టోబర్ 22వ తేదీన విద్యాశాఖ సమగ్ర ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నిబంధనలు ఇకపై ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పకుండా అమలు చేయాల్సి ఉంది. అకడమిక్ క్యాలెండర్‌ను విధిగా పాటించాలి.