గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల పాత్ర

*గురుకుల ఉపాధ్యాయులు*
———————
సూర్యుని కంటే ముందే ఉదయించి
వెలుగులు పంచే దీపశిఖలు,
కాంతిజనక విధినిర్వాహకులై
వ్యక్తిత్వ గమనమే పాఠ్యముగా చేసే
జ్ఞానచక్షువులు – గురుకుల ఉపాధ్యాయులు.

తనకోసం తీరిక లేకున్నా
పరుల పిల్లలకే జీవన పునాదులై,
తల్లిదండ్రుల మమతలతో
ధ్యేయ మార్గంలో నడిపించే
దీపికలు – గురుకుల ఉపాధ్యాయులు.

పీడిత పనుల ప్రవాహంలో
స్వీయగతం కోల్పోయినవారు,
నాలుగు గోడల గమనాన్ని గమనించి
గడియార లోలకంలా తిరిగే
శ్రమ పునాదులు – గురుకుల ఉపాధ్యాయులు.

ఇన్‌ఛార్జ్‌ల శిలువల తలపాట్లలో
వేలిముకులు వంగినా వెనుతిరగని,
బాధ్యతల బరువుతో తల నలిగినా
విద్యా సేద్యం సాగించే
విరోధ జేతలు – గురుకుల ఉపాధ్యాయులు.

అశ్రువులే అర్హతలు,
స్నేహాలకు దూరమైన ఉద్యోగం,
అయినా అక్షరమే ఆశ్రయం,
బాలల ఆలనపాలే దినచర్యగా మలిచే
త్యాగధనులు – గురుకుల ఉపాధ్యాయులు.

నిఘాగూడాచార తంత్రసహచరులై
ఉదయపు నైట్ స్టడీల ప్రవాహంలో
జీవన సౌఖ్యాన్ని త్యాగం చేసినా
కట్టడి తుఫానుల్ని శాంతింపజేసే
ధైర్యమూర్తులు – గురుకుల ఉపాధ్యాయులు.

బడి భవంతులే తమ భూగోళమై
సొంత పనులనెలా వెనకేసి,
పనుల పటిష్ఠతను కుటుంబమై మార్చి
పోటేత్తిన తరంగాలతో ప్రయాణించే
నిత్యనావికులు – గురుకుల ఉపాధ్యాయులు.

ఆదివారాలు సెలవులై పోయినా
పర్వదినాలు పిల్లల మధ్యే గడిపే,
ఏళ్ల తరబడి గడిపిన పాత ఖైదీలా
జీవన గమనాన్ని తలదన్నే
కాలరేఖలు – గురుకుల ఉపాధ్యాయులు.

వారి స్వప్నాలు నిద్రలో పలకరించే
వారి జీవిత పల్లకీకి తీరం కానరాని,
శుక్ల పక్ష చంద్రునిలా తరుగుతున్నా
చదువునకు దీపారాధన చేసే
తిమిరసూర్యులు – గురుకుల ఉపాధ్యాయులు.

గ్రీష్మమవితే మండింపు మధ్యన
వర్షమైతే తడిపే తీపి వేదనలలో
శిశిరమైతే కృశించినా,
రుధిరంలో కర్తవ్యాన్ని మానని
కర్మవీరులు – గురుకుల ఉపాధ్యాయులు.

శిశువుల కన్నులలో వెలుగులు నింపే
ఈ జీవన యాత్ర – కర్మఫలమా?
కర్మయోగమా? మారుపేరేమైనా
అక్షర నామానికీ శిల్పంగా నిలిచే
జడపదార్థాలే – గురుకుల ఉపాధ్యాయులు

ఐ. చిదానందం

Comments (0)
Add Comment