బరితెగించి నటించే మహిళా కళాకారుల ఆరాటం బొడ్డు ప్రదర్శన కే నా? మహిళా సంఘాలు, చిత్ర, సీరియల్ నిర్మాత, దర్శకులు మిన్నకుండడంలో ఆంతర్యం ఏమిటి??? సమాజమే సిగ్గుతో తలదించుకునే స్థాయిలో అశ్లీల, అంగాంగ, అర్ధనగ్న ప్రదర్శన సబబేనా?
********************
“చేసే వాడికి లేకపోయినా చూసేవాడికి అయినా ఉండాలి “అనే సామెత మన గ్రామీణ ప్రాంతాల్లో సమాజంలో తరచుగా వినబడుతుంది. అంతగా అక్షరాస్యత లేని గ్రామీణ ప్రాంతాలలో కూడా సభ్యత, సంస్కారం, గౌరవం, మర్యాద, నాగరికతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో అసభ్యత, అశ్లీలత, అంగాంగ ప్రదర్శన(బొడ్డు ప్రదర్శన)
సర్వత్రా దర్శనమివ్వడం చాలా బాధాకరం. సినిమాలు, సీరియల్ లు, టీవీ ప్రసారాలు, కామెడీ తదితర ప్రదర్శనలలో బాధ్యత మరచి తన చెల్లి తల్లి ఆడవాళ్ళనే సోయి లేని దర్శకనిర్మాత నిర్వాహకులు బరితెగించి అలాంటి ప్రదర్శనలను ప్రోత్సహిస్తున్న వేళ “తెగించి” నేను ఈ వ్యాసం రాయక తప్పడం లేదు.
అరాచకాలు, అకృత్యాలు, అత్యాచారాలు బాలల నుండి పండు ముదుసలి వరకు అటు అత్యాచారాలలో పాల్గొన్నవారు ఇటు అత్యాచారాలకు బలైన వారే ఈ సమాజంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం కాదా? ఇలాంటి దౌర్భాగ్యపు సంఘటనలకు రెచ్చగొట్టే సన్నివేశాలు, సందర్భాలు, అంగాంగ ప్రదర్శన, అశ్లీల అర్ధనగ్న ప్రదర్శనలు కారణం కాదా?
సాహిత్యంతోపాటు సన్నివేశాలు దుర్మార్గమే:-
***********
అర్థం లేని మాటలు, సందర్భం లేని పాటలు, సామరస్యము సమన్వయము సైద్ధాంతికత లేనటువంటి పాటలు సినిమా టీవీ రచయితలు రాస్తూ ఉంటే యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టించే క్రమంలో భాగంగా నిర్వాహకులు మొత్తం సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ దశలో ప్రశ్నించ లేక, భరించలేక, చెప్పుకోవడానికి నాథుడు లేక, అదుపు చేసే ప్రభుత్వాల అడ్రస్ లేని కారణంగా సమాజమే సిగ్గుతో తలదించుకొని మౌనంగా వున్నది.
ప్రశ్నించే మనసున్న, తట్టుకోలేని తత్వమున్న, నిరసించే నిజాయితీ ఉన్న, వెలివేసే దైర్యం ఉన్న, నోరుoడి మూగ అయిన విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు, ముఖ్యంగా మహిళా సంఘాలు ఇందుకు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మహిళల హక్కుల కోసం వ్యక్తిగత సమస్యల పైన ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్న మహిళా సంఘాలు ఇలాంటి ఉమ్మడి సాంప్రదాయ నాగరికతకు సంబంధించి నటువంటి అశ్లీల, శరీరాలను ప్రదర్శన ద్వారా అమ్ముకునే స్థాయికి దిగజారిన టువంటి కళాకారులు, నటులు, నటీమణులకు ఏం శిక్ష వేస్తారు? ఎందుకు ప్రశ్నించకుండా మిన్నకున్నారు?
అందరూ మౌనంగా ఉంటే ఎలా?
*********((
ఉదాహరణకు” పుష్ప” సినిమాలో” ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ” అంటూ నటించే వెకిలి ప్రదర్శన పాటలోని రోత పుట్టించే లక్షణం నేటి సినిమాలకు ప్రదర్శనలకు అతిగా ఉంది అనడంలో సందేహం లేదు.ఇంకా కఠినంగా రాయాలని ఆశించినా సమాజం మీది గౌరవంతో తగ్గినానని వినమ్ర0గా మీకు నావిజ్ఞప్తి. ఏ అర్హత తోటి రచయితలు రాసిన ఈ పాటలను సెన్సార్ బోర్డు అంగీకరిస్తున్న ది? ఏ నాగరికత నైపుణ్యముతో సెన్సార్ బోర్డు బొడ్డు ప్రదర్శన ను ఆమోదిస్తుంది?. ఏ సామాజిక బాధ్యతతో ప్రభుత్వం మాటలు, పాటలు, చేష్టలు, అశ్లీలత, నగ్న అర్థనగ్న ప్రదర్శన లను చట్టబద్ధం చేస్తున్నదో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదా?
కొంత అటు ఇటుగా అన్ని భాషల్లో ఇదే తంతు;-
**********
ముఖ్యంగా తెలుగు భాష కు సంబంధించినటువంటి సినిమాలు, ప్రదర్శనల్లో, టీవీ ప్రసారాల లో అతి గా కనిపించే ఈ దౌర్భాగ్య కరమైన సన్నివేశాలు దేశంలోని మిగతా భాషా చిత్రాలు సీరియళ్లలో కూడా చోటుచేసుకోవడం సిగ్గుచేటైన విషయం. వేదికలెక్కి అతిగా మాట్లాడి, హామీలు, వాగ్దానాలు, ప్రలోభాలతో ప్రజలను వంచించే రాజకీయ నాయకులు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రధానులు ఏ అర్హతతో ఇలాంటి ప్రదర్శనకు అవకాశం ఇస్తున్నారో! సమాధానం ఇవ్వాలి. లేకుంటే తప్పును అంగీకరించి, తలవంచుకుని, మార్పు కోరే దిశగా మౌనంగా చర్యలు చేపట్టాలి.
ప్రశ్నించకుండా ఉండలేక ,భారత స్త్రీ ప్రతిష్టను నాశనం చేస్తుంటే సహించలేక, అంగాంగ ప్రదర్శన ద్వారా రెచ్చిపోతున్న యువతను అడ్డుకట్ట వేయటానికి ఆకృత్యాలు అత్యాచారాలను నిరోధించ టానికి నా అభిప్రాయాన్ని ప్రజలతో, మేధావులతో, సామాజిక కార్యకర్తలతో పంచుకోవడానికి ఉద్దేశించినదే ఈ వ్యాసం. మహిళా సంఘాలు, కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులు ఎక్కడ ఈ అంశాల పైన స్పృశించిన దాఖలాలు లేవు. ఏదో ఒక అంశం ఇస్తే రాసుకోవడం తప్ప ఏదో ఒక ప్రక్రియను ఎంచుకుని సాహిత్య రంగంలో నిలబడ్డామని చెప్పుకోవడానికే కానీ ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సామాజిక కార్యకర్తలు, బుద్ధిజీవులు, మహిళా నాయకులు, మహిళా కమిషన్ ఏనాడు కూడా పెదవి విప్పిన దాఖలాలు లేకపోవడం చాలా విచారకరం.
రాజ్యాంగబద్ధంగా ఇలాంటి అశ్లీల అసభ్యకరమైన సన్నివేశాల పైన ఉక్కు పాదం మోపడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఏనాడు కూడా చొరవ చూపలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ఉద్యమ కాలంలో ఆనాడు ఉన్నటువంటి సినిమా సాహిత్యం, సీరియల్, అశ్లీల ప్రదర్శనలు, అంగాంగ వర్ణనలపై ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అతిగా స్పందించి రాష్ట్రం ఏర్పడగానే పూర్తిస్థాయిలో కట్టడి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కూటిలో రాయితీ లేనివాడు ఏట్లో రాయి తీయడానికి సిద్ధ పడ్డట్టుగా రాష్ట్ర పాలనను సమర్థవంతంగా నిర్వహించని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కేంద్రానికి అడ్డుతగులుతూ అసభ్యకరమైన మాటలు చెత్త ఆరోపణలతో కాలయాపన చేయడం ప్రజలను వంచించడం కాదా?
తక్షణ కర్తవ్యం:-
*********
ప్రధానంగా పాఠశాల స్థాయి, ఉన్నత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ఈ అసభ్యకరమైన సన్నివేశాల పైన యువతలో ఉన్న తప్పుడు అభిప్రాయాలను ఛేదించడానికి ప్రయత్నాలు జరగాలి. సంస్కారము, సభ్యత, నాగరికత, మర్యాద, గౌరవాల పట్ల విద్యార్థి స్థాయిలోనే మెరుగైన శిక్షణ అందించాలి. ఒకవైపు సినిమా టీవీ ప్రసారాల నిర్మాతలు సామాజిక బాధ్యతగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపినప్పుడే స్త్రీని ఆటవస్తువుగా, అంగడి బొమ్మగా, వికృతంగా చూపే విధానంలో మార్పు వస్తుంది. ప్రేక్షకుల కోసం ఇలాంటి ప్రసారాలను ప్రసారం చేస్తున్నట్లా? లేక నటిస్తున్న టువంటి మహిళా కళాకారుల బ్రతుకు తెరువు సంపాదన కోసమా? తేలాల్సిన అటువంటి అవసరం ఉన్నది. యువత ప్రేక్షకులు ఇలాంటి వాటి కోసం ఆరాటపడుతున్నారా? లేక యువతను నిర్వీర్య పరచాలనే కుట్ర దీని వెనుక ఏమైనా దాగి ఉన్నదా? ఈ కుట్రలో ప్రభుత్వ శాతం ఎంత? పెట్టుబడిదారుల వాటా ఎంత? తేలాల్సినటువంటి అవసరం ఉన్నది.అలాంటి అధ్యయనాలు జరగాలి. ఏది ఏమైనా ప్రతి వ్యక్తిలో నిబద్ధత, చిత్తశుద్ధి, అంకితభావం, దృఢ సంకల్పము, సామాజిక బాధ్యత, మానవతావాదం పునాదిగా గల నైతిక విలువల కోసం ఆరాట పదేతత్వం పెరిగినప్పుడు మాత్రమే అంగడిబొమ్మ సంస్కృతి నాశనమవుతుంది . దాని స్థానంలో ప్రత్యామ్నాయ మానవతావాద సభ్య సమాజాన్ని మేలుకొలిపే కొత్త సంస్కృతి ఆవిష్కృతమవుతుంది. నాతో ఏమవుతుంది ?అనే నిర్వేదం, నిరాశ వెంటనే కట్టిపెట్టి ప్రశ్నించడానికి, బరితెగించిన వారిని బరిగీసి కొట్లాడడానికి, గుణపాఠం తో కళ్లు తెరిపించ డానికి ప్రతి వ్యక్తి సిద్ధపడ్డ ప్పుడే పాలకులు తోక ముడుచుకుని తమ వికృత ప్రవర్తనకు చరమగీతం పాడుతారు. పెట్టుబడిదారులు, నటులు, ప్రజా ఉద్యమాల ద్వారా తమ వికృత ప్రవర్తనకు ముగింపు పలుకుతారని లేకుంటే కొంత ఆలస్యంగానైనా ప్రజా పోరులో మాడి పోక తప్పదని ప్రజల పక్షాన ఈ హెచ్చరిక. ఈ హెచ్చరికను నిజం చేయాల్సిన బాధ్యత సంఘసంస్కర్తలదే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)