క్రిమి కీటకాల మధ్య మనిషి ….. నాశబోయిన నరసింహ (నాన)
నాశబోయిన నరసింహ (నాన),కవి,రచయిత,ఆరోగ్య పర్యవేక్షకులు,జాతీయ కీటక జనిత నియంత్రణ కేంద్రం, సికింద్రాబాద్
*క్రిమి…, కీటకం…, మద్య మనిషి..!* : (దోమ కాటు వ్యాధులపై అవగాహన):
మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం.అందుకే కాలానుగుణ (సీజనల్)వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అంటు వ్యాధులని నిర్మూలించాలి, నివారించాలి.ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు తమ ఆదాయంలో సగానికి పైగా ఖర్చు పెడుతున్నా రన్నది నగ్న సత్యం.ప్రతి ఐదుగురిలో ఒకరు దోమకాటుకు గురవుతున్న నేటి స్థితిలో దోమల నిర్మూలనకు ప్రభుత్వ కృషితో పాటు ప్రజా ఉద్యమంగా చేపట్టాలి.ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఒక్క గ్రేటర్ హైద్రాబాద్ నగరంలోనే దాదాపు రెండు వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడం పట్ల దోమకాటు వ్యాధుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
*పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత:*
సమాజంలో 80% అంటువ్యాధులు ప్రబలుటకు కారణం పరిసరాల పారిశుద్ధ్యం లేకపోవడం, కలుషితమైన నీరు,గాలి,ఆహారం తీసుకోవడం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం,సూక్ష్మ క్రిములు మరియు కీటకాలు.చరిత్ర మొత్తం మీద యుద్ధాల వల్ల ఎంతమంది చంపబడ్డారో వారి కంటే ఎక్కువ మంది కీటకాలైన దోమలు వ్యాపింప జేసే వ్యాధుల వల్ల చంపబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షలకు పైగా మరణాలకు దోమలే కారణమట.ఒక్క 2018 సం.లోనే ఏడు లక్షల 25 వేల మంది మరణానికి కారణం కేవలం దోమలే. 2020లో 6లక్షల 25వేల మంది మరణాలకు దోమకాటు వ్యాధులే కారణమయ్యాయి.ఈ పరిస్థితి వల్ల ఆందోళన చెందిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గ్లోబల్ వెక్టర్ కంట్రోల్ రెస్పాన్స్ (జీవిసిఆర్) 2017 -2030 ని ఆమోదించింది.మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వాహకాల(దోమల) నియంత్రణను బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా దేశాలకు మార్గనిర్దేశం చేసే ప్రణాళిక అది.
*దోమలపై దండయాత్ర*: దోమలు ప్రజారోగ్యాన్ని పట్టి పీడించే ప్రధాన శత్రువులు.అందువల్ల వాటిపై యుద్ధము కొనసాగిస్తేనే ఈ వ్యవస్థకు పట్టిన చిరకాల దురవస్థ తొలగిపోతుంది.వ్యాధుల కంటే ముందు ప్రస్తుత సమాజానికి చికిత్స జరగాలన్నది మేధావుల అభిప్రాయం.ఇప్పటి వరకు భూమి మీద దాదాపు సగం మంది చావుకి కారణం దోమ లేనని పరిశోధకులు చెబుతున్నారు.దోమలు 10 డిగ్రీల సెల్సియస్ (50 డిగ్రీల ఫారెన్ హీట్) ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్నప్పుడు బతకలేవు లేదా వృద్ది చెందలేవు.15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో చాలా క్రియాశీలకంగా ఉంటాయి.నిలువ నీరు దోమలకు నిలయం.ఇంటి చుట్టూ పరిసరాలలో నీరు నిల్వ ఉండటం వల్ల కీటకాలైన దోమలు పుట్టి పెరుగుతాయి.ఆడ దోమలు నిల్వ నీటిలో వంద నుంచి మూడు వందల గుడ్లు పెడతాయి.గుడ్డు నుంచి లార్వా,ప్యూపా,దోమగా పెరగడానికి రెండు వారాలు పడుతుంది.మగ దోమలు సగటున 6లేదా 7రోజులు మాత్రమే బతుకుతాయి.ఆడ దోమలు 6 నుంచి 8వారాల వరకు జీవిస్తాయి.
ప్రపంచంలో దాదాపు 35 వందల రకాల దోమలు ఉంటే అందులో నాలుగు వందల రకాలు మన దేశంలో ఉన్నాయి.కానీ కొన్ని రకాలు మాత్రమే మనుషుల్ని కుడతాయి.వాటిలో ప్రధానంగా మూడు రకాల జాతులకు చెందిన దోమలే వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.దోమలు చాలా వరకు శాకాహారులే.పువ్వులోని మకరందాన్ని,పండ్లు,ఆకుల్లోని రసాన్ని పీలుస్తూ బతుకుతాయి. మనుషుల్ని కుట్టేది ఆడ దోమలు మాత్రమే.ఆడదోమ గుడ్డు పెట్టాలంటే రక్తంలోని ప్రోటీన్ అవసరం అందుకే అది మనుషుల, పశువుల,పక్షులను కుట్టి రక్తాన్ని పీలుస్తుంది.వాసన గ్రహించే వాసన గ్రాహకం (ఐఆర్8A) అనేది దోమల యాంటిన్నాపై ఉంటుంది అది మనిషి శరీరం నుంచి వెలువడే వాసన గుర్తించి వారిని కుడతాయి. దోమ కుట్టినప్పుడు తన రెండు గొట్టాలను చర్మం లోపలికి గుచ్చుతుంది.మన రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ఒక దాని ద్వారా ఎంజైమ్ పంపించి రెండో గొట్టంతో రక్తాన్ని పీలుస్తుంది.దోమ ఎంజైమ్ రక్తంలోకి చేరడాన్ని గుర్తించిన మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందించడం వల్ల అక్కడ ఎర్రగా దద్దుర్లు వస్తాయి.దురద పెడుతుంది.దోమ రక్తాన్ని పీల్చే ముందు మానవ శరీరంలోకి సూక్ష్మక్రిములను ప్రవేశపెట్టి అంటువ్యాధులకు వాహకంగా పనిచేస్తుంది.
*మూడు దోమలు ఆరు జబ్బులు :*
దోమ బహు చిన్నదైన మనిషి ఆరోగ్యానికి అది కలిగించే ముప్పు అతిపెద్దది.దోమకాటు పాముకాటు కన్నా ప్రమాదకరమైనది.మూడు పూలు ఆరు కాయలు అవుతాయో కావో చెప్పలేము కానీ మూడు రకాల దోమలు ఆరు రకాల జబ్బులను కలుగ జేస్తాయని ఘంటా పథంగా చెప్పవచ్చు. ఎనాఫిలిస్ దోమ మంచి నీటి నిల్వల్లో పెరిగి మలేరియా జ్వరం వ్యాప్తి చేస్తుంది.క్యూలెక్స్ దోమ మురుగు నీటి నిల్వల్లో పెరిగి బోధవ్యాధి(పైలేరియా),మెదడు వాపు జ్వరం వ్యాప్తి చేస్తుంది.ఏడీస్ దోమ ఇంటి పరిసరాల్లో చిన్న చిన్న నీటి నిల్వల్లో పెరిగి డెంగ్యూ,చికెన్ గున్యా,జికా వైరస్ వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.
*మలేరియా*: ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్, ప్లాస్మోడియం వైవాక్స్ రకానికి చెందిన రెండు రకాల క్రిముల వల్ల మన ప్రాంతాల్లో మలేరియా వస్తుంది.ఆడఎనాఫిలిస్ దోమకాటు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది.చలి,వణుకుతో కూడిన జ్వరం,చెమటలు పట్టడం మరియు రోజు విడిచి రోజు జ్వరం రావటం ఈ వ్యాధి లక్షణాలు.
*మలేరియా నియంత్రణ*: జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొని నిర్ధారణ తర్వాత మలేరియా రకాన్ని బట్టి పూర్తి మోతాదులో చికిత్స పొందాలి.
*డెంగ్యూ*: అకస్మాత్తుగా వచ్చే ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన తీవ్ర జ్వరం, తలనొప్పి,వాంతులు,విరేచనాలు, శరీరంపై చిన్నపాటి దద్దుర్లు (తీవ్రమైన కేసుల్లో) రావడం డెంగ్యూ జ్వరం లక్షణాలు.చిగుళ్లు,ముక్కు, మలం నుంచి రక్తం పోవడం డెంగ్యూ హెమరేజిక్ లక్షణాలు.అయితే డెంగ్యూ వైరస్ సోకిన అందరికీ వ్యాధి రాదు.ఏడీస్ ఈజిప్ప్టై దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి డెంగ్యూ వైరస్ (ప్లావి వైరస్) వల్ల వస్తుంది.ఈ వ్యాధికి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేస్తారు.
*బోధవ్యాధి (ఫైలేరియా, ఎలిఫెంటియాసిస్)*: తరచూ వచ్చే జ్వరం,చంకల్లో గజ్జల్లో బిళ్లలు కట్టడం,కాళ్లు,చేతులు,స్తనాలు,ముష్కం మొదలైన అవయవాలు బాగా వాపు రావడం(వరిబీజం/బుడ్డ) మొదలైన లక్షణాలు ఉంటాయి. కూలెక్స్ దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి “ఉకలేరియా బ్రాంక్రాఫ్ట్” అనే హెల్మింథిస్ పరాన్న జీవి వల్ల వస్తుంది.వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించిన కొన్ని ఏళ్లకు ఈ వ్యాధి లక్షణాలు బయట పడతాయి.వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఉన్న ఇబ్బందులు,సరైన చికిత్స లేకపోవడం వల్ల వ్యాధి నివారణే శరణ్యం.యేడాదికి ఒక మోతాదు డి.ఇ.సి.,ఆల్బెండజోల్ మాత్రలు మింగడం వల్ల వ్యాధిని నివారించవచ్చు.
*చికున్ గున్యా:* ఏడిస్ దోమ కాటు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే జ్వరం, తలనొప్పి,ఒళ్లు నొప్పులు,ప్రత్యేకించి చిన్న చిన్న కీళ్ల దగ్గర నొప్పి ఎక్కువగా బాధిస్తుంది.లక్షణాలను బట్టి చికిత్స నిర్వహిస్తారు.
*జికా వైరస్ వ్యాధి:* ఈ వైరస్ సోకిన వారికి జ్వరం,తలనొప్పి, ఒంటి మీద దద్దుర్లు,కండ్లు ఎర్రబారడం వంటి సాధారణ లక్షణాలుంటాయి.ఒక్కో సారి రోగికి మెదడు కుంచించుకు పోయే (గులియన్ బ్యారీ సిండ్రోమ్) మైక్రో సెఫాలి వంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు.ఏడిస్ ఈజిప్టై దోమ కాటుతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.జికా ఫీవర్ కు నిర్దిష్ట చికిత్స లేదు.
*మెదడువాపు జ్వరం*: హఠాత్తుగా వచ్చే విపరీతమైన జ్వరంతో కూడిన ఈ వ్యాధి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరణాలు సంభవించడం గాని అంగవైకల్యం కలగడం గాని జరుగుతుంది.మురికి నీటి నిల్వల్లో పెరిగే క్యూలెక్స్ రకానికి చెందిన (క్యూలెక్స్ పిపియన్స్, క్యూలెక్స్ టొరెంటియం) దోమల ద్వారా ‘జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్’ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.ఈ వ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించటం కష్టం.నివారణే సరైన మార్గం. పందులను,కొంగలను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. వ్యాధి గ్రస్తులను గుర్తించి సత్వర వైద్య సేవలు అందించాలి.రెండేళ్ల లోపు పిల్లలకు జే.ఈ.టీకా రెండు డోసులు ఇప్పించాలి.
*దోమల నియంత్రణ ప్రభుత్వ పాత్ర:*
పట్టణాలలో మరియు పల్లెలలో జి.హెచ్.ఎం.సి., లేదా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య సిబ్బంది వీధులలో దోమపిల్లల నియంత్రణకు 5 మి.లీ.టెమిఫాస్ 50 శాతం ఈసీ.మందును పది లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని నీటి నిల్వల్లో నాప్ సాక్ స్ప్రేయర్ ద్వారా స్ప్రే చేస్తారు.ప్రస్తుతం డి.డి.టీ.50 శాతం మలాథియాన్ 25 శాతం వివిధ రకాల పైరిత్రాయిడ్ మందులను నీటితో కలిపి స్టిర్రస్ పంపు ద్వారా గోడల మీద, తలుపుల వెనుక దోమల నివాస ప్రదేశంలో స్ప్రే చేస్తున్నారు. పెద్ద దోమల నియంత్రణకు 500 మిల్లీ లీటర్ల మలాథియాన్ మందును పది లీటర్ల డీజిల్ లో కలిపి రాత్రి వేళల్లో దోమలు బయట తిరిగే సమయాల్లో ఫాగింగ్ యంత్రం ద్వారా పొగ వదులుతారు.చెరువులు,పెద్ద పెద్ద నీటి మడుగుల్లో గంబూసియా చేపలు పెంచడం జరుగుతుంది. జాతీయ కీటక జనిత నియంత్రణ కేంద్రాలలోని సిబ్బంది ద్వారా ప్రతి శుక్రవారం పొడి దినం (డ్రైడే ఫ్రైడే) కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా నిర్వహిస్తూ,ఐ.ఈ.సి. కార్యక్రమాల ద్వారా (కరపత్రాలు, స్టిక్కర్లు,వాల్ పోస్టర్లు,గ్రూప్ మీటింగులు) ప్రచార కార్యక్రమాలతో ఆరోగ్య అవగాహన కల్పించడం జరుగుతుంది.
*దోమల నియంత్రణ ప్రజల పాత్ర:* పనికిరాని గుంతలను, పల్లపు ప్రాంతాలను,వాడని బావులను పూడ్చి వేసి నీరు నిల్వ లేకుండా చూడాలి.చెత్తాచెదారం మురుగు కాలువల్లో వేయకుండా మురికి నీరు పారునట్లుగా ఏర్పాటు చేసుకోవాలి.కిటికీలకు జాలీలు బిగించాలి.ఇంట్లోకి వెలుతురు ధారాళంగా రావాలి.సెప్టిక్ ట్యాంక్ (మరుగు దొడ్డి) గాలి పైపులకు జాలీలు (మెష్) బిగించాలి.నీళ్ల ట్యాంకులు,డ్రమ్ములు,మంచి నీటి పాత్రలపై మూతలు అమర్చాలి. ఇండ్లలో నీరు నింపుకునే పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి ఆరబెట్టి,మళ్ళీ నీరు నింపుకుని ప్రతి శుక్రవారం పొడి దినం (ఫ్రైడే -డ్రై డే) విధానం పాటించాలి.కొబ్బరి చిప్పలు,ప్లాస్టిక్ గ్లాసులు,పూల కుండీలలో,ఇంటి లోపల,టెర్రస్ ల మీద,ఇంటి చుట్టు ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శరీరం పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.దోమతెరలు,దోమలను చంపే క్రిమి సంహారిణి మందులను వాడి దోమకాటు నుండి రక్షించుకోవాలి.
_✍️ *నాశబోయిన నరసింహ (నాన),కవి,రచయిత,ఆరోగ్య పర్యవేక్షకులు,జాతీయ కీటక జనిత నియంత్రణ కేంద్రం, సికింద్రాబాద్*,8555010108.