ఎల్లలు దాటిన కీర్తి కిరీటం ఉస్మానియా

ఉద్యమాలకు ఆలవాలం

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమాల ఖిల్లా నే కాదు. విద్యారంగంలో ఎల్లలు దాటిన కీర్తి కిరీటం. శతవసంతాల ఓయు ప్రాశస్త్యాన్ని నినదిద్దాం.ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉమ్మడికృషితోభవిష్యత్ తరా లకు అంకితం చేద్దాం!!! *******************************
ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలొనే కాకుండా ప్రపంచంలోనే ఒక స్థాయిని అందుకున్న అత్యున్నత విద్యా కేంద్రం. గతం పునాది మీద వర్తమానాన్ని నిర్మించినప్పుడు భవిష్యత్తుకు దారి చూపే విధంగా ఉండాలంటే గతం గొప్పగా ఉండాలి . ఆ రకంగా భారత దేశంలోనే పేరెన్నికగన్న విద్యాలయం గా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అనగానే ఉద్యమాలకు నిలయమని పోరాటాలకు ఆలవాల మని సామాజిక సమస్యల పరిష్కారం ఆర్ట్స్ కళాశాల సాక్షిగా జరుగుతుందని అందరూ అనుకుంటారు. దానికి పూర్వ నేపథ్యం కూడా ఉన్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా విద్యనభ్యసించి ప్రస్తుతము తెలుగుశాఖ ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కాశీం గారి ప్రసంగం ఈ వ్యాసానికి నేపథ్యం. ఉద్యమాలను సమర్థించుకుంటూ నే ఆ విశ్వవిద్యాలయము నుండి ఉన్నత స్థాయికి ఎదిగి అంతర్జాతీయ పరిశోధనలకు ఆలవాలమైన టువంటి ప్రగతిని ముచ్చటించు కోవడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో బడ్జెట్లో నిధుల కేటాయింపు భారీగా కొనసాగితే విద్యా రంగం లోనే అగ్రగామిగా నిలబడుతుంది అని కాసీం గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ మార్చి 24 నుండి 26వ తేదీ వరకు జరిగిన కార్యక్రమాల పైన చేసిన ప్రసంగం విద్యారంగాన్ని అభిమానించే వారందరికీ స్ఫూర్తిదాయకం.

ఉస్మానియా గురించి కొన్ని ముచ్చట్లు:-
***********
1917 లో నిజాం రాజ్యంలో ప్రారంభించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 2017 నాటికి ముచ్చటగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఆ సందర్భంగా విశ్వవిద్యాలయంలో వందేళ్ల ఓయూ పైన ప్రత్యేక సంచికలు, సదస్సులు, సెమినార్లు, పరిశీలనలు, పరిశోధనలు, సభలు భారీగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు, అధ్యాపక బృందం, అభిమానులు పెద్ద మొత్తంలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసి ఉస్మానియా కీర్తి పతాకను అంతర్జాతీయ గగన వీధులలో రెపరెపలాడించారు. సామాజిక సమస్యలు, అసమానతలు, అంతరాలు, వివక్షత వంటి సందర్భాలు సమాజంలో చోటు చేసుకున్నప్పుడు ఓయూ ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల చర్చలకు సంప్రదింపులకు పరిష్కారాలకు ఉద్యమాలకు వేదికయినటువంటి అనుభవాలను ప్రసంగంలో కొనియాడడం జరిగినది. 1995 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రెండవ దశ కార్యక్రమాలు అనేక పట్టణాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న సందర్భంలో ఓయూ కూడా ఉద్యమాలకు వేదికగా మారినది.
విద్యార్థులు అధ్యాపకులు ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే తమ సామాజిక బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తమవంతు పాత్ర నిర్వహించి ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. 2009 లో కేంద్రం లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించి వెంటనే ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు గా తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు మరింత బలం చేకూరింది. 2010 జనవరి 3వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన భారీ బహిరంగ సభ అనేక సంస్థల సహకారంతో విజయవంతమై రాష్ట్ర సాధనకు చుక్కానిగా నిలబడ్డది. అప్పటినుండి తెలంగాణ ఆవిర్భవించే 2014 వరకు ప్రతి ఉద్యమంలోనూ ప్రతి సంఘటన లోనూ ప్రతి అనుభవము లోనూ ఉస్మానియా తనవంతు పాత్ర పోషిస్తూనే విద్యార్థులకు విద్యను అందజేసినది.

ఉద్యమంలో పరిశోధక విద్యార్థుల భాగస్వామ్యం మనం మరిచిపోలేము విద్యాలయం లోపల నిరంతర పరిశోధనలు ఆవరణలో ఉదృత ఉద్యమం జరుగుతున్న రోజులవి, ఇదే సమయంలో ఎందరో కవులుగా,పరిశోధకులుగా, సినీ రచయితలుగా 150 మందిని తెలుగు విభాగం అందించింది. జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పరిశోధనలకు బీజం పడింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర మొదటగా వెలుగు చూసింది. తెలంగాణ వచ్చిన తరువాత అన్నీ జిల్లాల సాహిత్య చరిత్రలు తెలుగు అకాడమి ఆధ్వర్యంలో రాయించ గలిగింది. కానీ ఉస్మానియా పరిశోధకులు అవకాశాలు ఇవ్వకుండానే సాహిత్య చరిత్రలు రాయించడం సమగ్రతను కోల్పోయి లోపాలకు తావిస్తోంది.

ఉద్యమాల ఖిల్లానే కాదు విద్యను ఎల్లలు దాటి వ్యాపింపజేసిన విద్యాలయం కూడా:-
*******************
క్రమంగా ప్రభుత్వాలు విశ్వవిద్యాలయానికి అందజేయాల్సిన నిధులలో కోతలు విధిస్తున్న కారణంగా మౌలిక సౌకర్యాలు క్రమంగా నీరు కారుతూ ప్రభుత్వ రంగంలో విద్య వెనుకడుగు వేస్తున్న సందర్భంలో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం తలెత్తుకొని నిలబడడానికి కృషిచేసిన ది. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపక సిబ్బంది కూడా చేసిన కృషి అనితర సాధ్యం అనినా తప్పులేదు. వందేళ్ల అనుభవాలను ఒకసారి మమనం చేసుకున్నప్పుడు ఇక్కడ పురుడుపోసుకున్న ఆవిష్కరణలు, పరిశోధనలు, ఫలితాలు సమాజంలోని కి వెళ్లి సమాజాన్ని ప్రభావితం చేసినవి అనడంలో సందేహం లేదు. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఐఏఎస్లు, ఐపిఎస్లు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, కళాకారులు, రచయితలు, కవులు, గాయకులు, పండితులు అంతేకాదు ఎన్నో రంగాలలో ఎదిగిన వారు సమాజం నిండా వ్యాపించి విస్తృతంగా వారి ప్రతిభను సమాజానికి అందిస్తూనే ఉన్నారు.

ఓయూ కృషిని గుర్తించాలి- అందుకు తలపెట్టిన3 రోజుల కార్యక్రమాన్ని పరిశీలిద్దాం:-
************
ఉద్యమాలకు వేదికగా నిలబడుతూ నే విద్యారంగాన్ని బలోపేతం చేసే కృషిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ప్పటికీ జాతీయ స్థాయిలో తనకంటూ ఓ స్థానాన్ని పదిల పరచుకొని ఉన్నది. అంటే విద్యార్థులు అధ్యాపక బృందము కృషి ఎంతో ఉన్నది అని సమాజం గుర్తించాలి. ఉద్యమ కాలంలో ఎంతోకొంత విద్యారంగానికి నష్టము జరిగినప్పటికీ ఆ నష్టాన్ని భరిస్తూనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే యువకులు, విద్యార్థులు ,నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయనే ఆశయంతో త్యాగం చేసిన విద్యార్థుల ఘనత ఈ విశ్వవిద్యాలయానికి దక్కినది.

ఇటీవలికాలంలో ప్రభుత్వం గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కాకుండా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి ప్రైవేటుకు కట్టబెట్ట డం దేనికి సంకేతం? విజ్ఞులు ఆలోచించాలి. పేరెన్నికగన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వేతనాలకు మినహా నిధుల లేమి కారణంగా పరిశోధనలు ఆవిష్కరణలు కుంటు పడుతున్నప్పటికీ ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చినది?

అందుకే కసితో, ధైర్యంతో, త్యాగంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క బోధన అభ్యసన అధ్యయన సత్తాను ప్రజానీకానికి సమాజానికి తెలియజేయడం కోసం ఇటీవల 2021 మే నెలలో నియామకం అయినటువంటి వీసీ గారి నాయకత్వంలో 2022 మార్చి 24 నుండి 26 వరకు విశ్వవిద్యాలయ ఉన్నతిని గురించి తెలియజెప్పే మూడురోజుల కార్యక్రమాన్ని విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది సంయుక్తంగా నిర్వహించి ప్రజానీకాన్ని సమాజాన్ని విద్యావంతులను చివరికి ప్రభుత్వాన్ని కూడా ఆలోచింప చేసినట్లుగా ప్రొఫెసర్ కాశీం గారి ప్రసంగం ద్వారా తెలుస్తున్నది.

1) 24వ తేదీ మొదటి రోజున నిర్వహించినటువంటి కార్యక్రమానికి” ఓపెన్ డే” అని నామకరణము చేస్తూ విద్యారంగంపై అభిమానము ఇష్టము ప్రేమతో విశ్వవిద్యాలయాన్ని సందర్శించి పరిశీలించడం కోసం ఆ రోజున కేటాయించడం జరిగింది. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, వివిధ రంగాల నుండి వచ్చిన వారితో విశ్వవిద్యాలయము సందడిగా మారినట్లుగా తెలుస్తున్నది. పరిధిలోని కళాశాలలు విభాగాలు ఆవిష్కరణలు పరిశోధనలు ప్రయోగాలు డిపార్ట్మెంట్ లను తెలుసుకొని విశ్వవిద్యాలయం అంటే ఇన్ని వసతులతో ఇంత పెద్ద మొత్తంలో నిర్వహణ ఉంటుందా? అనే రీతిలో ప్రజలు పరిశీలించిన వారు ఆశ్చర్యము ప్రకటించి తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

2) ఇక 25 మార్చి 2022 అంటే రెండవ రోజున విశ్వవిద్యాలయంలో గతంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమావేశం ,సమ్మేళనము ,సభలు, సదస్సులు, చర్చలు వేదికగా కొనసాగిన టువంటి పరిచయాలు అనుభూతులు ఆత్మీయతతో పులకరించి పోయిన పాత విద్యార్థుల జ్ఞాపకాలతో విశ్వవిద్యాలయము సంతోషాన్ని నింపుకున్న ది. విద్యార్థులుగా ఈ నేలపై నడయాడిన, చదువుకున్న ధోరణి, అనుభవాలను, అనుభూతులను నెమరు వేసుకున్న తీరు అమోఘం అద్భుతం. ఆ అనుభూతులను మోసుకెళ్లి సమాజము నిండా కుమ్మరించిన విధం అమితానంద భరితం.

3) ఇక మూడవ రోజు అంటే 26 మార్చి 2022 రోజున చివరి కార్యక్రమంలో భాగంగా “కల్చరల్ డే “గా నిర్వహించినట్లు గా తెలుస్తున్నది. ఈ విశ్వవిద్యాలయం నుండి ఎదిగిన టువంటి సాహిత్య సాంస్కృతిక చారిత్రక సామాజిక నిపుణులు అయినటువంటి కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు పత్రికా సంపాదకులు కళాకారులు గాయకులు తమ ప్రతిభను విశ్వవిద్యాలయం వేదికగా ప్రదర్శించి మన్ననలు పొందడమే కాకుండా మరొక్కమారు ఓయు ద్వారా సమాజానికి చైతన్య కిరణాలను ప్రసరింపజేసి నారు.

ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించడం ద్వారా దాని సత్తా ఏమిటో బోధనా సిబ్బంది విద్యార్థుల ప్రతిభ ఏమిటో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ రంగం యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గత వైభవాన్ని అర్థం చేసుకుని ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించడం కాకుండా ఉస్మానియా తో పాటు ప్రభుత్వ రంగంలోని అన్ని విద్యాసంస్థలు విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి కృషి చేయవలసి ఉన్నదని ఈ మూడు రోజుల విశ్వవిద్యాలయ చైతన్య కార్యక్రమం ప్రభుత్వానికి సూచన చేస్తున్నది.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల విద్యార్థులకు వేదిక అయినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి ఆస్తిగా కాపాడుకుందాం. గత వైభవాన్ని మరింత ఇనుమడింప చేస్తూ తరతరాలకు తరగని ఆస్తి గా దీనిని ప్రపంచానికి అంకితం చేద్దాం. ఆ వైపుగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు ,బుద్ధిజీవులు, విశ్లేషకులు, చరిత్రకారులు, పరిశోధకుల తోపాటు ప్రభుత్వము దీని ఉన్నతికి కృషి చేయవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది అని గుర్తించాలి. అప్పుడే ఈ విద్యాలయం భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడగలదు. భవితకు యువతకు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం పక్షాన మనమిచ్చే సందేశం అదే.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయులు ఉద్యమనేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Get real time updates directly on you device, subscribe now.