రహీం పాషా… దేశభక్తి

జనగణమన
—————
స్వాతంత్ర్యమా నీవెక్కడ స్వారాజ్యమా నీ జాడెక్కడ

ఆకాశమంత వెతికి వెతికి వేసారాను…..
లోకమంతా కాళ్ళు అరిగేలా తిరిగాను…..
కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను…..

ఎక్కడ చూసిన హింసే
ఎటు చూసిన అసత్యమే ఎంత వెతికిన అదర్మమే అన్యాయమే…..

చెడు చూడకు
చెడు వినకు
చెడు కనకు
అనేవి చెప్పుకోవడానికే మిగిలాయి…..

కాని నేడు సమాజం
చెడు చూస్తోంది
చెడు వింటోంది
చెడు కంటోంది

హత్యలు అత్యాచారాలు అన్యాయాలు అవినీతులు
దోపిడీలు
కుల చిచ్చులు
మత ఉచ్చులు
మరణ శాశనాలు మారణ హోమాలు

ఆడది అర్థరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని
నీవు చెప్పిన మాటలు …
నీటి మీద రాతల్లా మిగిలాయి
అహింసతో తెచ్చి పెట్టిన
స్వాతంత్య్రం….
ఉప్పుసత్యగ్రహం చేపట్టి సాధించిన స్వరాజ్యం….
నేడు కానరావడం లేదు

ఓ మహాత్మా…..
మీ కల ఛిద్రమైంది
మీ కాంక్ష వసివాడింది
మీ ఆశయం మసక బారింది
మూడు రంగుల జెండా రంగు వెలిసిపోయింది
జాతీయ గీతం లయ తప్పింది

ఓ మహాత్మా
నీవు మళ్ళీ పుట్టాలి
భరతమాత కడుపులో పురుడు పోసుకోవాలి
హింసను ఆచరించి హింసే మార్గమంటూ
పాటిస్తున్న దుర్మార్గులను
నీ చేతికర్రను ఆయుధం గా మలుచుకొని
తరిమి కొట్టాలి
మళ్ళీ కొత్తగా మరో సంగ్రామం సాగించాలి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టాలి సరికొత్త త్రివర్ణాన్ని ఆవిష్కరించాలి
అవినీతి తిమింగళాన్ని వీపు పగల గొట్టాలి

జనగణమన గీతాన్ని
పాడిపోవాలి దేశాన్ని రక్షించాలి

2/10/2022 న జాతిపీత
మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా

తేదీ :-2/10/2022
రహీంపాషా
8008748426

నెత్తుటి సింధూరం
————————
ఆకాశం ఎరుపెక్కినా….
మేఘాలు కరుకెక్కినా….
ప్రకృతి కన్నెర్ర చేసినా…
మూడవ ప్రపంచ యుద్ధమే వచ్చినా…

కొండలు కూలినా….
బండలు పిండయినా….
భూమి కంపించినా…..
తుఫాను చెలరేగినా….

రక్తం ఏరులై పారినా….
గుండెల్లో గుండ్లు దిగబడినా…..
తనువులు బూట్ల కింద నలిగినా…..
వెన్నుపై లాఠీలు విరిగినా……
కటకటాల పాలు చేసినా…
కఠిన శిక్షలకు గురి చేసినా…..
నరకాన్ని చూపించినా….
వేటాడి వేటాడి చంపినా….
ఉరికంబాలెక్కించినా….

ఎత్తిన పిడికిలి దించక
నినాదాలు మరువక
గుండెల్లో దేశ భక్తిని నింపుకుని
భరత మాత రూపం కళ్ళల్లో నిలుపుకొని
ఆశయాలు వదలక
పోరుబాట విడువక

ఎన్నో తెగింపులు
ఎన్నెన్నో విప్లవాలు
మరెన్నో త్యాగాలు
చేసి…..
తెల్లవాడు వేసిన సంకెళ్లు
విడిపించుకుని
సంపాదించాం స్వేచ్ఛను
నవభారతాన్ని నిర్మించుకుని
ఉషోదయాన్ని చవిచూసి
సరికొత్త కాంతికి స్వాగతం పలికి
భరత మాత నుదుటన
వీరుల రక్త సింధూరం దిద్ది
డెబ్బై అయిదు సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుమటున్నాం

తేదీ.. 15/08/2022
రహీం పాషా
8008748426

స్వాతంత్ర్యమా నీవెక్కడ
———————————-
నాడు ఆంగ్లేయులతో
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోరి
ఎన్నో ఏళ్లు పోరాడి
ప్రాణాలర్పించి
బానిస సంకెళ్ళు తెంపుకుని
స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం
కానీ…. ఏది…

ఎక్కడుంది
గాంధీ కలగన్న రాజ్యమేది…..
కన్న కలలు, ఊహలు, ఆశలు…
గాలికెగిరిపోయాయి
ఆడదానికి అర్థ రాత్రి కాదు…..
పగలే రక్షణ లేదు
ఎక్కడ చూసినా.
ఎటు చూసినా.
కుల చిచ్చులు, మతపు మంటలతో
శాంతి కపోతానికి గాయాలు…….
ఒకవైపు
రెక్కాడితేగాని డొక్కాడక
ఆకలితో అలమటించే
పేద వాని ఆకలి కడుపులు……
మరో వైపు
నీచ రాజకీయాలు….
హత్యలు, మానభంగాలు, దోపిడీలు,
కుంభకోణాలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు
నిరుద్యోగుల, రైతుల ఆత్మ హత్యలు…..
ఎక్కడుందీ స్వాతంత్ర్యం

నడిరోడ్డులో బేరమాడి
ఓటును అమ్ముకుని
ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేస్తుంటే
అవినీతి అందలాలెక్కి
రాజ్యమేలుతుంటే
అన్యాయాలను ప్రశ్నించక
మౌనం పాటిస్తుంటే
ఎక్కడుందీ స్వాతంత్ర్యం

నేటి స్థితిలో
స్వాతంత్ర్యం కనుమరుగై
స్వేచ్ఛ మాయమై
మళ్లీ స్వాతంత్ర్యమా నీవెక్కడ అని
వెతక వలసి వస్తుంది
మరో పోరాటానికి
సిద్ధంకావలసి వస్తుంది

తేదీ.. 28/08/2022
రహీం పాషా
8008748426

Get real time updates directly on you device, subscribe now.