ఆత్రం వారి దండారి ఒక అద్భుతం

దండారి సుజాత, పుస్తక సమీక్ష

ఆత్రం వారి దండారి

ఆదివాసి కైతికాలలో అడవి తల్లి ఒడిన పెరిగే జానపదుల పార్శ్వాలను అక్షరీకరించడంలో కవి కృతకృత్యుడవడానికి అక్కడి గాలి, నీరు, మట్టి..గాఢంగా ఆకళింపుచేసుకోవడమే.
తామరతంపరగా /తండోప తండాలుగా / జనం, జనం విస్ఫోటనం అంటూ తెలియజేసి, చిన్న కుటుంబమే చింతలేనిదని అందించిన వైనం ఇప్పటి కాలమాన పరిస్థితులకు అత్యావశ్యకం.
గూడెంలో దండారి/ అడవంతా సంబరం..అడవినేల పులకరించే సంబరాల సంబంధాన్ని హృద్యంగా మలిచారు ‘దండారి’లో.
పదేళ్ళ ప్రాయంలోనే పచ్చబొట్టు అలంకారం కోలాం ఆచార సంప్రదాయం చూడచక్కని సింగారం. చంద్రబింబ మొఖానికి/ ఇంద్రజాలమై వెలిగే…పచ్చబొట్టు ఘనతను పచ్చని జ్ఞాపకాన్ని చేసిన అందమైన కైతికం ఇది.
పిచ్చుక ఉంటే మాకెలాంటి కరువు దరి చేరదంటూ పిచ్చుకల జాతి, ఖ్యాతిని పొగిడిన నిజమైన పక్షి ప్రియబాంధవుడు మోతీ మనసు ముత్యంలా మెరుస్తూ కనిపిస్తుంది ఈ కైతికంలో.
ఇప్ప పువ్వుల అందాలను అవని మేనంతా పరచి మన కళ్ళకు కట్టిన రీతి ముదావహం.
వేసవి కాలాన జరుగు కోలాంల పెండ్లిళ్ళు సంస్కృతి సంప్రదాయాలకు అనుభూతుల నెలవులు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో కైతికం హృదయాన్ని తడితడిగా స్పర్శించి ఓ వెచ్చని జ్ఞాపకంగా మిగిలిపోతుందనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
పట్నపు జీవన విధానానికి అలవాటు పడిన యాంత్రిక బతుకులకు పల్లెల్లోని పచ్చదనాన్ని అడవితో ఉన్న అనుబంధాన్ని సంప్రదాయ ముచ్చట్లను పరిచయం చేస్తుంటే మనిషిక్కడ..మనసక్కడ అయి తీరుతుంది ఖచ్ఛితంగా.
తమ్ముడు మోతీరామ్ జీ పదకొండు కైతికాలను ముగ్ధ మనోహరంగా పదాలమూటకట్టి *దండారి కైతికాలుగా*’ అందించిన తీరు వహ్వా..అనిపించక మానదు.
అన్నట్టు మరో ముఖ్యాంశం. ముఖచిత్రం కోలాం అంశాలకు పట్టం కడుతూ..వర్ణ విన్యాసంగా తీర్చిదిద్దిన ముఖచిత్ర రూపశిల్పికి జేజేలు చెప్పడం సముచితం.
*******
—–సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.

Get real time updates directly on you device, subscribe now.