ఒక్కరోజు గుర్తిస్తే ఏమొస్తుంది…??
ఒక్కరోజు గుర్తిస్తే ఏమొస్తుంది
తరతరాల చరిత్రను చెరిపేస్తుందా
కామాందు ని కౌగిలిని విడిపిస్తుందా
వ్యత్యాసపు నీడలు తొలగిస్తుందా..
అవమానాలను ఆపేస్తుందా
పురుషాధిక్యం ని తగ్గిస్తుందా
ఒంటరి శిలలా కూర్చుంది
సమాజము చెక్కిన బొమ్మలా తయారయింది…
ఎరుపెక్కిన కన్నీటి సముద్రం ఆమె హృదయం
కను రెప్పల మధ్య దాచింది సహృదయంతో
ఈటెల లాంటి మాటలకు నిలువునా చీలింది
చెట్టులా తనువునంతా పంచి జీవిస్తుంది…
రాకెట్లు నడుపుతున్న నేటి సమాజంలో
జాకెట్ల పైనే ఎందరో చూపులు
అణువణువు సూదుల్లా కుచ్చు తూ
శల్య మైన శరీరాన్ని చేతులతో పిండేస్తున్నారు..
సమానత్వపు మాటలు వినసొంపుగా
పురుషాధిక్య ములో మధ్యస్త జీవితంలో తూకం
అర్ధనారి అంటూ అపహాస్యం
అన్నింట్లో పెత్తనం నీకు లేదంటూనే…
కంప్యూటర్ యుగంలో కాలం నడుస్తున్నా
అతివల మనసును ఎరుగక
అడుగడుగున అవమానపు బీజాలతో
ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్న సమాజం పోకడలు…
ఇకనైనా మారుదాం రండి
ప్రతిరోజు తల్లిలా గౌరవిస్తూ నిలుద్దాం
చెల్లిలా ఆత్మీయతను పంచి ఎదగనిద్దాం
భావితరాలకు బాసటగా ఉందాం..!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235