అన్వేషణ.. తుమ్మల దేవరావు

అన్వేషణ

తప్పిపోయిన పదాలకోసం
శతాబ్దాలుగా వెతుకుతున్నాను
వాకిళ్ల నుండి; వంట గదులనుండి
వరి నాడుమళ్లనుండి; పసుల పానాదుల నుండి
ముసల్లవ్వల పదకోశం నుండి; మువ్వల శబ్ద సౌదర్యం నుండి..
రచ్చబండ నుండి; చాకిరేవు నుండి రాలిపడిన అసోయ్ పద ఖజానా నుండి.
డప్పుల జుగల్బంది నుండి; శారద -జంగమ కథకుల స్వరనిరాజనం నుండి
తప్పిపోయిన పదాల జాడకోసం నా తపన!!

పదాలకు పెదాలకు మధ్య పేగుబంధమే కాదు
హృదయ సంబంధం కూడా..
ఉట్టి భాష బంధమే కాదు మట్టి బంధం కూడా…
సమస్త ఉత్పత్తి క్షేత్రాలన్ని ఇపుడు
పదాలు దొరక్క బాషాహీనంగా పడిఉన్నాయి..
నాగలి;కర్రు; గొడ్డలి; కొడవలి; చేను; చాప
చూరు; వాకిలి లాంటి వేల పదాలు
పలుకరింపుకు నోచుకోక
పడిగాపులు పడుతున్నాయి..
నేనిప్పుడు….
నిప్పును రగిలించిన ఆదిమ మానవుడి
తొలి పదం కోసం అన్వేషిస్తున్నాను.
అవ్వ; బువ్వ లు ఉట్టి పదాలైతే కావచ్చు
మమకారం ఆత్మరూపం దాల్చిన ప్రాణదీపాలవి..
వాటికి బదులుగా ఏ పదాలు నన్ను ఊరడించ లేకపోయాయి..
నాన్న అంటూ పిలిచినప్పుడు..
నా ప్రాచీన వారసత్వమంతా
కదిలివచ్చి గుండెనిండుగా ద్రవీభవించేది
ఇప్పుడు అన్య బాష పదాలతో పలుకలేక
నా ఇంటి పలుకుల తీపి వదులుకోలేక
యుద్ధభూమిలో క్షతగాత్రునిల నిలబడ్డాను…
మనిషికి మనిషికి మధ్య
ఊట చెలిమల ఊరి
పదాల నదియై ప్రవహించిన తల్లి భాషని
ఎవరో బంధించి మ్యూజియం కు తరలిస్తుంటే..
కన్నీటి బాషారోధన మూగదయింది
చెల్లని పైసలు విలువచేయనట్లే;
మార్కెట్ బాషాధిపత్యం లో..
చెల్లని పదాలకు కూడా ఉండదు
ఆకలి; దుఃఖం; మట్టి; నాగలి
వేలిత పాటల పదాలు మార్చుకునేందుకు సిద్ధం కండి..
….
లేదంటారా!
భిన్నసంస్కృతుల; భిన్నజాతుల; భిన్నభాషల సమాహారం కై చేయి కలుపుతారా!! మీ ఇష్టం…
……
తప్పిపోయిన పదాల గర్భకోశాలు
తల్లడిల్లక ముందే తల్లి భాషను ఇంటి ముందు నిలబెడదాం సగర్వముగా!!

Drతుమ్మల దేవరావ్
నిర్మల్
8985742274

.

Get real time updates directly on you device, subscribe now.