దీపావళి.. అంబటి నారాయణ

ISBN NEWS

“దీపావళి వాస్తవికం”

అరుదెంచెనదిగో దీపావళి!!…
కొందరిలో వెలుగులు
మరికొందరిలో చీకట్లు…
అలనాటి చరిత్రను అర్థం చేసుకోవాలి..
ఏ పండుగ..ఏ చరిత్ర ప్రసాదమో!!??
ప్రతి పండుగలో మనమే!!..

రేపు మనదే..మాపు మనదే!!
రేపుకు రూపం మనమే!!….
మాపుకు వెలుగులం మనమే!!…
తగిలే దెబ్బలు మనకే!!…
ఎగిరే మెరుపుల తారలు మనవే!!…

వెలుగు మనదే..వేకువ మనదే!!…
ఎడారి మనదే..ఎదలోని ఎదారూ మనదే!!..
ఉన్నది పోగొట్టుకున్నాం..
లేనిది ప్రోగు చేసుకుంటున్నాం…
ఊహల్లో మొలకెత్తే ప్రశ్నలం!!..
నిజమైన జవాబుదారులం!!…
ఊపిరి మనమే..ఊతం మనమే!!
తెగిపోతున్న సమాజ పేగుబంధాలం..
తెగించి ముడి వేసుకుంటున్న సహవాసులం!!…
ఇప్పుడిప్పుడే అవయవాలను
సరిచేసుకుంటున్నాం..
పండుగల పూటైనా
ప్రశాంతంగా ఉండాలి…

నిత్యం ఊహించని ప్రయాణం…
ఎప్పటికీ గమ్యం చేరుకోలేని వారలం!!
అక్కడే కలిసినచోటే మనకు కాలం..
అడుగులతో ఆదర్శం…
ఆలోచనతో ఆశయం…
ఇది ఆగని బతుకు ఒరవడి!!…
మానవీయతతోనే ముడిపడి..
మానవత్వంతోనే జతగూడి..
జీవితాన్ని మోసుకుంటూ నడుస్తాం!!..

ఎప్పటికీ కలిసిరాని కాలం!!…
ఏ నక్షత్రంలో పుట్టామో తెలియదు..
ఎక్కడుందో మన మూలబిందువు!!??
ఎవరికీ అర్థంకాని ఓ వైరుధ్యమే!!
బరువు దిగింది..బాధలు పెరిగినవి..
ముక్కలైన హృదయం ముడుచుకోవాలి…
మాట,మనసు కలుషితం కావద్దు!!..

గత చరిత్రకు మనసును తగిలించకుండా
నడుస్తున్న చరిత్రతో దోస్తీ లేకుండా…
వర్తమాన ఒడిలో సాగిపోతున్నాం!!..
ఎవరి చూపుల చురకత్తులకో
మా జీవితం అక్కడక్కడా
చీరుకుపోతుంది…
అన్నిటినీ భరిస్తూ బాధలను మింగుతుంటాం…
తట్టుకోలేని పరిస్థితులు
గుండెను తడుతుంటాయి…
సిగ్గులేక..నిగ్గు తేల్చలేక
అస్థిత్వాన్ని వదలలేక…
మనస్తత్వాన్ని చంపుకోలేక…
బతుకుతున్న బతుకులం!!…
అంతరిస్తున్న అస్తికత్వం..
తెగిస్తున్న నాస్తికత్వం…
ఇదే నిజమైన దీపావళి!!
ఇదే వాస్తవిక వెలుగుదివ్వెల కేళి!!…

“ఆత్మీయులకు దీపావళి శుభకాంక్షలు ”

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Get real time updates directly on you device, subscribe now.