మూడు తరాల ఉద్యమాల ముద్దు బిడ్డ……
వయ్యా సామెల్
నిజాం నిరంకుశ పాలనలో విస్నూర్ దేశముఖ్ రాపాక రామచంద్రా రెడ్డి దౌర్జన్య పాలనకి నిర్భయంగా ఎదురునిల్చి తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి సమిదను వెలిగించిన షేక్ బందగి ప్రాణ త్యాగాన్ని తల్లి గర్భంలో నుండే ఆకలింపు చేసుకొని బందగి మరణించిన సంవత్సరం లోనే అదే గ్రామంలో 26-06-1940 లో వయ్యా ముత్తయ్య రామక్క అనే ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించాడు వయ్యా సామెల్ .
బందగి బలిదానాన్ని బాల్యం నుండే కథలు కథలుగా వింటూ వచ్చిన సామెల్ భూస్వాయ్య , రాచరిక వ్యవస్థను అవగాహన చేసుకున్నాడు. అప్పటికే తన అన్న వయ్యా రాజారాం ఆంధ్ర మహాసభ కార్యకర్తగా జనగామ తాలూకాలో తన పాటలతో ప్రజల్ని ఉర్రూతలూగిస్తున్నాడు. బందగి స్పూర్తి పోరాట పటిమను నేర్పిస్తే ,అన్న రాజారం పాటల ప్రభావం సామెల్ ని ప్రజా ఉద్యమ కవిగా మార్చింది. సామెల్ కుటుంబం మొత్తం ప్రజా పోరాటల్లోనే గడిపింది. 1946 లో నిజాం రజాకార్ సైన్యం దేవరుప్పుల గ్రామంపై దాడి చేసి 460 మందిని అరస్ట్ చేసారు అందులో సామెల్ తండ్రి ముత్తయ్యని అన్న రాజారాంని రాజద్రోహం నేరం కింద జైల్లో పెట్టారు. ఈ సంఘటన సామెల్ జీవితం లో ఒక పెను మార్పు తెచ్చింది నాన్న అన్న ఆశయ సాధనలో తన వంతు కృషిచేసి సఫలీకృతం అయ్యాడు సామెల్ . మొదట ఆంధ్రమహాసభలో తర్వత కంమ్యూనిస్ట్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసి కంమ్యూనిస్ట్ పార్టీల్లో వచ్చిన చీలికల తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరాడు. సామెల్ కుటుంబ నేపథ్యం కారణంగా చదువుకునే అవకాశం లేకపోయిన అన్న రాజారంతో కలిసి సంగం వాల్లు పెట్టిన రాత్రి బళ్ళో అక్షర జ్ఞానాన్ని పొంది పాటలు రాసేవాడు. తన 14 వ ఏటా తంౠర పట్టిన సామెల్ కి నీరటి మల్లయ్య ,బొజ్జా ఎల్లయ్య లు వంతలుగా చెరో పక్క చేరారు. మొదట్లో ప్రజాకవులు తిరునగరి రామాంజనేయులు , వయ్యా రాజారాం , సుంకరి సత్యనారాయణ వంటి వారు రచించిన బుర్రకథలు చెప్పడంతో తన సాహిత్య రథాన్ని ప్రారంభించిన సామెల్ అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నాడు. వామపక్ష విప్లవోద్యమ భావజాలాన్ని పునికిపుచ్చుకుని నక్సల్ బరి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని చాలా కాలం అజ్ఞాన జీవితాన్ని గడిపాడు . అటు ఆయుధంతో ఇటు అక్షరాయుధంతో ప్రజా సమస్యలతో పొరాటం చేశారు సామెల్ . తన కవితల్లో , పాటల్లో తను స్పృశించని అంశం లేదు తెలంగాణ సాయుధ పోరాటం ,అభ్యుదయ వాదం , వామపక్ష భావజాలం , ప్రత్యేక తెలంగాణ ఉద్యమం , రాజకీయ నాయకుల దౌర్జన్యాలు , దేశ భక్తి , దళిత వాదం , స్త్రీ వాదం , బహుజన వాదం , సామాజిక చైతన్యం , పర్యావరణ పరిరక్షణ , అక్షరాస్యత , నిరుద్యోగ సమస్యలు , మూడనమ్మకాల నిర్మూలన , ఇలా అనేక సమస్యలపై తన కలాన్ని గళన్నీ విపించారు సామెల్ గారు . అలతి అలతి పదాల కూర్పుతో పాటలు కవితలు రాస్తూ సామాన్య ప్రజానీకానికి సులభంగా అర్దం అయ్యే విధంగా రచనలు చేయడం ఈయన ప్రత్యేకత . నిజాం రాజు నుండి నేటి వలస పాలకుల వరకు తెలంగాణ ప్రజల పక్షాణ నిలబడ్డాడు సామెల్ . “నా పాటలు / పదిమంది గొంతు నుండి పాడి / ప్రజలను ఉత్తేజ పరుచుట కొరకు/ విశ్వంలోని చీకటిని తొలగించి / వెళుతురుని ప్రసరింపజేయుట కొరకు / అని మన దోసిలళ్ళలో అనేక జానపద గేయాల ముత్యాలను గుమ్మరించాడు. “అగ్గి పుల్ల – కుక్క పిల్ల” కాదేదీ కవితకనర్హం అని మహా కవి శ్రీశ్రీ అంటే “మట్టి ముద్ద / పచ్చ చెట్టు / పదును గొడ్డలి / పడక గది / దూప బుడ్డి / ఈత చాప / నేత గుడ్డ” అన్నీ కవిత వస్తువులే అంటాడు సామెల్ . “కోటి వీణ తెలంగాణ / కూటికి గతిలేని వీణ /లక్షల ఎకరాల భూమి / బీడులుగా మారిపోయే” అంటూ కోట్లాది తెలంగాణ ప్రజల ఘోషను అక్షర బద్దం చేశాడు. “ఉంది లేని అన్నము తింటూ / ఊరికొక రోజు ఉంటూ / ఎత్తిన తుపాకి దించకుండా / ప్రజల కొరకు పోరాడుతున్నారు అని విప్లవయోదుల త్యాగాలకి అక్షర నీరాజనం చేశాడు . సామల్ తన బాణీలను ప్రజా ఉద్యమాలకే పరిమితం చేయకుండ సామాజిక స్పృహ , పర్యావరణ పరిరక్షణ , వంటి అంశాలపై కూడా రాయడం విశేషం “అడవులను పెంచండి ” అనే బుర్రకథను రాసి అనేక గ్రామాల్లో ప్రదర్శించాడు . విప్లవోద్యమ అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టాక పోలీసు వారి నిర్భందాలకి తట్టుకోలేక తన నివాసాన్ని రాజధాని హైద్రబాద్ కి మార్చాడు అభ్యుదయ రచయితల సంఘం (అరసం)లో చేరి అరసం కార్యవర్గ సభ్యులుగా పనిచేసి పూర్తి స్థాయి కవిగా పరిణతి చెందాడు . స్వేచ్చగా పూర్తి స్థాయీ లోప్రజా సమస్యలపై రాజకీయ నాయకుల వైఫల్యాలను ఎండగట్టె విధంగా పాటలు , కవితలు రాశాడు. “అవినీతి అదరగొట్టే / అక్రమాల తరిమి కొట్టి / అన్యాయం ఎదిరించిన వాడే / అసలైన నాయకుడు” అని “వస్తరు మల్లోస్తారు అవినీతి నాయకులు / ఓట్లకు మల్లోస్తారు ప్రజలదోచే పాలకులు” నేటి స్వార్ధ రాజకీయ నాయకుల స్వభావాన్ని తెలిపి ప్రజలకి తన పాటల ద్వారా హితభోద చేసిండు. “ మన శ్రమను దోచుకొని మరిగి బలిసిన వాళ్ళను / మంచ కాడి మడుగులో తొక్కాలిరా అన్న” అని శ్రామికులని చైతన్యపరిచాడు. “అక్షరాలు నేర్చుకో” అడవులను పెంచండి” అనే బుర్రకథ లని ఆకాశవాణి లో చెప్పాడు .సామెల్ గారికి దేశమన్న దేశసమైక్యతన్న మమకారం ఎక్కువ అన్నీ మతాల వారు కులాల వారు కలిసి వుండాలని కాంక్షిస్తూ “ఎగసిపడే కేరటమ / వెనకబడకు మిత్రమా / దేశమూ కోసము నీవు / యోచనలు చేయుమా / యువకులారా యువతులారా / భరత మాత బిడ్డలారా / మతాలన్నీఒక్కటై / శత్రువులను తరిమేయరా” అంటూ దేశంపై మేలుకొలుపు గీతాన్ని ఆలపించాడు సామెల్ .అన్న రాజారం మరణం ఒక రకంగా కలిచివేసిన తన ఆలోచన దృక్పధం మాత్రం మారలేదు అన్న పై కూడా ఒక స్మృతి గీతాన్ని రాసి ఆలపించాడు సామల్ దోపిడి రాజ్యం తీరుతెన్నులణు కళ్ళకి కట్టినట్లు అనేక పాటలల్లారు. అవినీతి పాలనపై ఆగ్రహం . వరకట్న దురాచంపై నిరసన , సారా నిషేధం సందర్భంగా నాయకుల రెండునాల్కల ధోరణిపై కోపం , రైతుల ఈతిబాదలపై సానుభూతి , అధికార దుర్వినియోగం పై అసహనం , దొంగ బాబాల మోసలపై ప్రతిఘటన , ప్రజా పోరాటలతో మమేకం అవుతూ అనేక పాటలు రాశారు శ్రవ్యమైన జానపద బాణీలు , స్వచ్చమైన జానపద భాష , కమ్మని వినసొంపైన స్వరం మేలు కలయికగా సాగే సామెల్ పాటలు ప్రజానీకాన్ని ఉర్రూతలుగిస్తాయి . తన జీవిత పర్యంతం ప్రజల కొసమే తన కవిత్వాన్ని అంకితం చేసిన సామెల్ గారు వయ్యారి పాటలు(1998) , జానపద గేయాలు(1999) , జనగర్జన(1999) , గళ గర్జన (2000) , వయ్యా సామెల్ పాటలు (2003) , నలుగుతున్న గేయాలు (2004) , స్వర్ణాంనదకార గేయాలు (2005) , ఇదీ సంగతి గేయాలు (2006), ప్రజావాణి నా బాణీ పాటలు (2007) , అడవులను పెంచండి (బుర్రకథ 2007),అక్రమార్కం కవితలు (2007) పిట్టలదొర ఏకపాత్రాభీనయం(2008), పాటల తోట గేయాలు (2011) , పొరుగీతం పాటలు (2013), మానవుడా గేయాలు (2014), పాటల చెరువు గేయాలు (2015) , హరిత హారం గేయాలు (2016) , ప్రజాకంటకులు గేయాలు (2017) మొత్తం 15 పాటల సంకలనాలు , 2 కవిత సంపుటాలు ఒక బుర్రకథ , ఏకపత్రాబినయం వంటివి సామెల్ కలం నుండి వెలువడ్డాయి.
హైద్రాబాద్ నగర అరసం అద్యక్షులుగా సేవలు అందించాడు ఈయన సేవలకి గుర్తుగా సాహితి రత్న బిరుదుతో గౌరవించారు . తన జీవిత పర్యంతం ప్రజల కొసమే తన కవిత్వాన్ని అంకితం చేసిన సామెల్ గారు 09/01/2019 నాడు స్వర్గస్తులైనారు .
రేషపల్లి భానుచందర్
పరిశోధక విద్యార్థి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
9160381693