ఉగాది గొప్ప తనం
చైత్రమాసమచ్చే – మన యుగాదిని తెచ్చే
ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరాది . ఉగాది లేదా యుగాది సంవత్సరాది ( ” సంవత్సరం ప్రారంభం ” అని అర్థం) అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ” నూతన సంవత్సర ” దినం. హిందూ క్యాలెండర్ చాంద్రమానం అయితే చాలా పండుగ తేదీలు క్యాలెండర్ లోని చంద్రభాగాన్ని ఉపయోగించి పేర్కొనబడ్డాయి.
ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని అంటారు.
ఉగాది అనగా ” ఉగ ” అనగా నక్షత్ర గమనం- జన్మ – ఆయుష్షు అనే అర్థాలు . వీటికి ” ఆది ” అనగా మొదలు ఉగాది. అనగా ప్రపంచం జన్మ -ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది ఇంకొక విధంగా చెప్పాలంటే ” యుగం ” అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయన , దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం “యుగం” (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృ స్వరూపం. ఉగాది రోజు సృష్టి జరిగిందని భారతీయ సంప్రదాయ ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’.
తెలంగాణాలోని పండుగలు: బోనాల ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వును జారీచేసింది.
ఈ సంవత్సరం ఉగాది 2024 శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలు, కొత్త ఏడాదిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా క్రోధి అంటే అర్థం ఏంటి.. ? ఈ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయాల గురించి పండితులు ఏం చెబుతున్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
2024 హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. అంటే దీనర్థం క్రోధమును కలిగించేది. ఈ కాలంలో ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగడం, దేశంలో, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగడం, దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
తెలంగాణాలోని ప్రత్యేక పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి సిద్ధంగా ఉంటుంది. ఈ పచ్చడి మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలను సూచిస్తుంది. ఇందులోని రుచులలో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది.
ఉప్పు – మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు.
పులుపు – తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది.
వేప పువ్వు – బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది.
బెల్లం – ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు.
కారం – సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది.
వగరు – పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది.
ఉగాది పండుగ రోజు నుంచే ఛైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ‘గుడి పడ్వా’గా మళయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’ అని బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు.
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు. తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.తెలంగాణాలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.
— డాక్టర్ అంజనామూర్తి .