అందె వేంకటరాజము సంగీత కళాతపస్వి

Oplus_131072

అందె వేంకటరాజము సంగీత కళాతపస్వి

అందె వేంకటరాజము అనేక పద్యాలు, పద్య ఖండికలు, పద్య కవితా సంకలనాలు రచించాడు. కళాతపస్వినిలో ప్రధాన కళ సంగీతం, పాట, గానానికి సంబంధించిన వర్ణన కవికి గల సంగీతాభిమానాన్ని రాగ తాళాల పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఏకాశ్వాస కలిగిన ఈ కావ్య రచనం కథా కథనం కోసం కాదు కవిత్వ ముఖాన మధుర సంగీత మహాత్వాన్ని ప్రదర్శించడం కోసం. కరుణ రస నిర్వహణం కోసం ఇందులోని వస్తువు సూక్ష్మమైనది. వస్తుగత వర్ణన సువిశాలమైంది. అందె వేంకటరాజము కలం నుండి వెలువడిన సంగీత ప్రధానమైన కళాతపస్విని ప్రాచీనాంధ్ర ప్రబంధ కావ్యాలకు తోబుట్టువు లాంటిది. అని సి. నారాయణ రెడ్డి లాంటి మహాకవి చేత ప్రశంసించబడినది వేంకటరాజము రాసిన కళాతపస్విని రచన. ఒక పట్టణాన్ని నందుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు పేరు లలిత ఆమెకు ప్రాణమైన కళ సంగీతం, ప్రత్యేకించి ఆమె వీణను వాయించడంలో నేర్పరి. ఆమె పాడుతూ ఉన్న స్థితిని అందె వేంకటరాజము వర్ణిస్తున్న పద్య మొకటి “కరపల్లవములు సింగారమై మీఱు బం గారు గాజులు తాళగతులు దెలుప

బొంగి రంగులు వాఱు దెలుప రంగత్తరంగిణీ

భంగమ్ములు మృదంగభంగి నెఱుప”

ఆమె సంగీతం, ప్రకృతి ఏకముఖంగా సాగటం గమనింపదగింది. కావ్యమంతా గానం విస్తరించి ఉంది. వెన్నెల వలె అలముకొంది. నిజంగా ఇంతటి సంగీత ప్రధానమైన కావ్యం ఇంతవరకు సాహిత్యంలో రాలేదు అది ఒక అందె వేంకటరాజముకే సాధ్యమైంది. “లలిత” గాన వీణావాదన సభకు ఒక ఉద్యానవనం వేదిక, వన్యప్రాణులు, శ్రోతలు సంగీత సభాసమయాలు ఉభయ సంధ్యా వేళలు. “లలిత” మాధుర్యంగా ఆలపించే సంగీతాన్ని పశు పక్ష్యాదులు, ప్రకృతి, తమని తాము మరిచిపోయి వింటున్నవట. అందె వేంకటరాజము లలిత కళాతపస్విని సంగీత సభా దృశ్యాన్ని ఎంతో రమణీయంగా వర్ణించాడు. అటుల సభచేసి వినుజంతు పటలినొక్క తరుణమృగ శాబకము లతాతన్వి మ్రోల భక్తిపూర్వ కాదికతరాసక్తి తవిలి, అన్నిటన్ ముందున గూరుచుండి అరమోడ్పు కనుంగవ నిక్కువీనులన్ చందుగ మోరసాచి విను సర్వమసర్పిత నాదబ్రహ్మమై అంటూ తెలియజేశాడు. పశుపక్షాదులు మధురమైన సంగీతము చెవిలో పడగా సగము తిన్న ఆహారము నోటిలోనే పెట్టుకొని ఆహారమును తీసుకొవడంను మరిచిపోయాయి. అలాగే నెమరు వేయుటను కూడా మరిచిపోయాయి అని అందె వేంకటరాజము “లలిత” యొక్క సంగీత ప్రావీణ్యంను తెలియజేశాడు.

“సగము గొరికిన గడ్డిపోచలు సగంబు నోట వ్రేలాడ మేసెడి మాటమరచు నెమరు వేయుట యింకెట్టులమరు సమర గానమే నిండుగా గుండె గదిసి నిముర” ఈ పద్యంను చూడగానే గుర్రం జాషువా గారి గిజిగాడులోని “తేలిక గడ్డిపోచలను తెచ్చి” (అంతర్జాలం) అనే పద్యం గుర్తుకు వస్తుంది. అందె వేంకటరాజము రచనలను పరిశీలిస్తే. కొన్ని పద్యాలు గుర్రం జాషువా పద్యాలను పోలి ఉన్నాయి. జాషువా వస్తువు వైవిధ్యం ఎలా ఉంటుందో వేంకటరాజము కూడా తన రచనలో వస్తువు వైవిధ్యంను ప్రదర్శించాడు. ఎప్పుడైన సంగీతం మీద విరకి చెంది విరమించుకొన్న సంగీతం మన నుండి ఎప్పటికి వీడి పోదు.
అప్రయత్నంగా అనుకోకుండా మనలోకి ప్రవేశిస్తుంది. లలిత వాద్య గానామృతము చేత సరస్వతీ దేవి తన నుదిట తిలకమును దిద్దుకొనుట మరిచిపోయింది. తన ప్రమోద బాష్పములతో నీరార్పకుండా మైమరిచిపోయింది. అందె వేంకటరాజము లలిత యొక్క సంగీత, వాయిద్యాలను గురించి తెలియజేశాడు. అలాగే ధ్యానాన్ని నేర్చుకునే బాలలకు ఉపాద్యాయుడు చెప్పే విషయములు వినకుండా “లలిత” యొక్క సంగీతము విద్యార్థులను ఎంతో ఆకర్షించినది అని తెలియజేశాడు కవి. కల్లాకపటం తెలియని పల్లె పడుచులు బంగారం చూసి మురిసిపోయేదరు కాని సంగీతమును తమ మనస్సుకు హత్తుకుని ఆచరిస్తారు. హరిణి పట్ల లలితకు ఉన్న వాత్సల్యంను కవి ఎంతో అత్మీయంగా తెలియజేశాడు.

“మగువ ప్రియంబెసంగ సుకుమార శరీరకరీరమల్ల లే జిగురులకన్న బ్రన్ననగు చిన్నరి వ్రేళులదువ్వి వెన్నయై మొగమును ముద్దుబెట్టుకొని మోమును మోమునజేర్చి అక్కునన్ బిగువుగ కౌగిలించుకొని విస్మృతిగాంచె క్షణమ్ము సర్వమున్” అపాత మధుర గాయని ‘లలిత’ గానం ప్రారంభించింది. ‘లలిత’ గళమే వీణనా, వీణనే లలిత గళమా కాదు కాదు వీణనే లలిత గళాన్ని అనుకరిస్తుంది అన్నట్లుగా ఉందట. పెదవులపైన చిరునవ్వు చిందిస్తూ సోగకనులు సభను ముస్తాబు చేసిట్లుగా అందె వేంకటరాజము ‘లలిత’ గాన ప్రాంగణమును మనోహారముగా వర్ణించాడు.

“అధర బింబమ్ముపై మందహాస రేఖ మొలచి మృదుగండ దర్పణమ్ముల దనర్ప సుప్రసన్నత లొలికెడు పోగకనుల సభను పద్మాకరముగ ముస్తాబు జేసి”

లలిత గానమును చేయునప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితులను అందె వేంకటరాజము

వర్ణించిన తీరు గమనిస్తే మనస్సుకు ఆనందమును ఆహ్లాదమును కలిగిస్తుంది. ప్రకృతికి ఆనందాన్ని కలిగించే పుష్పాలు లలిత గానమునకు నృత్యమును చేస్తున్నట్లుగా, నెమలులు ఫించెమును విప్పి నాట్యము చేస్తున్నట్లుగా కవి వర్ణించాడు. అలాగే లలిత గానము చేస్తుంటే కోయిలలు గొంతు సవరించుకొని ఆలాపన చేస్తూ లలితకు కోరసు (వంతపాడుట) ఇస్తున్నట్లుగా నేల మొత్తం ఆనందంతో హాయి హాయి చెందిందని అందె వేంకటరాజము వర్ణించాడు. అందె వేంకటరాజము గారిది అచ్చమైన తెలుగు వెలుగు గుండె. ఆ గుండెలకు సంగీత స్పర్శ ఉండేది అని గాదె శంకరకవి అన్నాడు. కావ్యంలోని సన్నివేశాలకు సరిపోయే రాగాలను ఎన్నుకోవడం చూస్తే శంకరవి మాటలు నిజమే అనిపిస్తుంది.

“సురభి శోభితమైన సుమవల్లికావళుల్ తల్లీన మగుచు నృత్తము లొనర్చె పింఛవీజనములన్ విప్పి ఒప్పులు మీఱు నెమిళులు హల్లీసకములు సల్పె” క్రొంజిగుళ్ల గొంతు కుదిరిన కోయిల ఆలపనము లంది యనుకరించే ఒక్కటనగ నేల యుర్విసర్వంబు తగ్గేయ మెనసి హాయి హాయిజెందె”

లలిత గానము చేయు నమయమున నెమలులు ఫించమును విడిచి సంగీతమును ఆస్వాదిస్తున్నాయి. జంతువులన్ని తమ తొకలను నేలకు ఆనించి వింటున్నాయి. సర్పములు బుసకొట్టుట ఆపి వింటున్నాయి. లిలిత ధరించిన మణిహారము శబ్దముతో ఆ ప్రాంతము అంతా సంగీతమయమై గీతమును ఆలపించు వేడుక అంటూ అందె వేంకటరాజము వర్ణించిన విధమును చూస్తే అతని సంగీత పరిజ్ఞానం అర్థమవుతుంది.

“అంచుల పిండుగూడె మనసారక తోకలు మాత్రనేల కా నించిన సర్పముల్ స్వరము నీటులు వేడె మదించి ఆమె చే లాంచల మూగియాడె మణిహారము లుల్లసమంది మించులన్ మించుల మేలమాడె జగమే ఒక గీతము పాడె వేడుకన్”

ఇలా అక్కడి ప్రాంత అంతా నాద బ్రహ్మంలో సంలీనమైన రసమయ సమయంలొ వేటగాడి బాణం లలిత శరీరంలోకి దూరింది అంతే అమ్మా అనే ఆర్తధ్వని నలుమూలలకు విస్తరించింది. వేడి నెత్తుటిలో కొట్టుకుంటూ నొప్పి బాధతో అయ్యో అయ్యో అంటూ బాధపడుతుంది. అనే విషయాన్ని విశాదాంతంగా వర్ణించిన విధమును పాఠకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ యొక్క విశాద వర్ణణలో కవి యొక్క రచనా విధానము ఎంత గొప్పగా ఉందో ఈ రచన ఒక ఉదాహారణగా చెప్పుకొవచ్చు

“జొట జోటని కారువేడినెత్తుటి కణాల నవని బురదగ బిట్టు పొర్లాడు దాని సంకమున జేర్చుకొని అయ్యొ అయ్యొ యనుచు”

లలిత భాదతో బాదుకొనుచుంది అప్పటికే ఆ ఘోర విపత్తును చూసి సంగీత ఆస్వాదనలో లీనమై ఉన్న వన్యప్రాణి సమూహం వేటగాని శబ్దముతో నలుమూలలకు పారిపోయినాయి. పక్షులు చెట్టుకొమ్మల యందు చల్లాచెదురుగా పారిపోయినాయి. అడవిలోని జంతువులన్ని పరిగెత్తి పొదళ్ల మాటున దాచుకున్నవి. ఆనందంతో గడుపుతున్న పశుపక్ష్యాదులను కలవరపెట్టి భయంతో పరిగెత్తెలాగ అక్కడి వాతావరణం అంతా మారిపోయింది. ఆ ప్రాంతంలోని అలజడి వాతావరణాన్ని రచయిత ఎంతో గొప్పగా వర్ణించాడు.

“కొలకొల మంచు పెద్ద కలగుండున పక్షులు చెట్టుకొమ్మలం చులబడె, సత్త్వముల్ బెదురుచున్ బరువెత్తి పొదళ్లమాటునన్ నిలిచె, భుజంగముల్ కినిసి నిల్వునగాల్చగ వేటకాని జా డల చనురీతి బారె నికటస్థ మహీరుహమూల పంక్తికిన్”

పచ్చపచ్చగా శోభిల్లుతున్న అక్కడి పరిసర ప్రాంతం ఒకే నిమిషంలో ఎడారిగా మారిపోయింది. కోటి ఖరాసు ఒక్కసారి గుచ్చుకున్న విధంగా తీవ్రమైన వేధన మాటి మాటికి కలుగుతుంది. కన్నీరు, నెత్తురు వరదలాగా కాల్వల పారుతుంది. అక్కడి పరిస్థితుల వర్ణనతో పాఠకుల హృదయాలను బరువెక్కించాడు రచయిత.

“కోటి ఖరాసులొక్కపరి గ్రుచ్చిన చందము తీవ్రవేదనన్ మాటికి మాటికిన్ బొరలిమ్బాయని ఆర్చుచు జాలిజాలి క న్నీటి కణాలతో నుడుకు నెత్తురు కాల్వలు గట్టనేడ్చు నా లేటి శిరంబు పట్టుకొని”

తలపట్టుకొని లలిత ఏడుస్తూ శరీరమునకు అయిన గాయమును చేతులతో మెల్లమెల్లగా తడుముతుంది. కన్నీరు తన శరీరమును తడుపుతుండగా ప్రకృతి అంతయును కరిగి, పొంగిన విధముగా కవి వర్ణించాడు. ఆ చిన్ని లేడి పడుతున్న వేధనను రచయిత వర్ణించిన తీరు హృదయ విధారకంగా ఉంటుంది.

“కెలకులనే ప్రవహించెడు సెలయేళ్లు శరీరమెల్ల జలజల రక్తం బులు స్రవియించిన గతి వల యేడ్చెను”….

తమతో తిరిగే లేడికెంత కీడు జరిగినది అని వనములోని జంతువులన్ని శోకంతో గుముకూడినవి. కోకిల గుంపులు తన అద్భుత కంఠ స్వరమును మరచి అరిచినవి. తమ మిత్రుడు అయిన లేడి కోసం పశుపక్షాదులు పడుతున్న భాదను కన్నులకు కట్టినట్లు వర్ణించాడు. అక్కడి వాతావరణం అంతా విశాదంలో మునిగి కన్నీరు కారుస్తుంది. ఏమి చేయలేని తోటి మిత్రుల వేధనను

రచయిత వర్ణించిన విధము అద్భుతం.

“తోడి లేడికెంత కీడుమూడినదని వగచె వనములోని మృగచయంబు శోకమాపలేక కోకిల గుంపులు స్వరము మరచి అరచె వశముదప్పి”

ఇలా అక్కడి వాతావరణమంతా దుఃఖపూరితమైంది. కింద పడిపోయిన జింక వద్దకు వేటగాడు వచ్చి తనివితీర చూచి కొట్టడానికి వచ్చిన అతన్ని చూచి నిస్సహాయక స్థితిలో గుండెలు అధిరేలాగ యున్మాదిలాగ జంతువులు, పక్షలు అన్ని నలు దిక్కులకు శబ్దము వినబడేలాగ అరిచినవి.

“తడవతడవకు జింకను తడవిచూచి కొట్టవచ్చెడు వట్టి దిక్కులను చూచి నిస్సహాయ స్థితికి గుండెప్రెస్సి యబల అదరి యున్మాదిని విధాన అరచింది”

అప్పుడు ఆ లేడి చివరి చూపులతో కన్నీరు కారుస్తూ కళాతపస్విని అయిన లలితను చూస్తూ పేద గొంతుకతో ఇలా పలికింది. నామీద కరుణతో ఒక మంచి సంగీత పాటను పాడమని ఆ పాటను వింటూ నా యొక్క దేహామును విడిచి చనిపోతాను. మళ్లి జన్మంటూ ఉంటె మళ్లీ పుట్టి నీ ఋణము తీర్చుకుంటాను. ఆర్తితో లేడి ‘లలిత’ ను అడిగింది. లేడి లలితను చివరి కోరిక తీర్చమని అడిగిన విధము దానిని రచయిత వర్ణించిన విధము పాఠకుల మనస్సును హత్తుకోవడమే కాదు కన్నీరు పెట్టిస్తుంది.

“నను కరిణించి ఒక్కశ్రవణ ప్రమదమ్మగు రమ్యగీతమున్

గొని యెనరించు గానమెద కూరిమితో అదివించు హాయిగా

చనగల, దేహమున్ విడిచి జాగొసరించకుమ్మ మళ్లి నీ

తనువున బుట్టి యూఋణము తప్పక దీర్తు ననుగ్రహింపవే”

అని అనగానే లలిత పాడటం ప్రారంభించింది. లలిత బాధతో స్వర గాత్రం గద్గదమై కంపించింది. తాళం తప్పింది. హరిణి గుండె నొచ్చింది. గమనించిన లలిత దురంత దుఃఖాన్ని నిగ్రహించుకొని మంజూలంగా గానం చేసింది. హరిణి సుప్త చేతనంగా చనిపోయింది. ఆ సమయంలో లలితకు కాలము ఆగిపోతే భాగుండు అనిపించింది. హారిని ప్రాణమును భిగపట్టి ఉన్నది అప్పుడు భయంకరమైన శాంతి ఆ ప్రాంతము అంతా ఆవరించినది. చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులు కన్నీరు కారుస్తూ ఉన్నవి. అక్కడి వాతావరణం అంతా నిశబ్దం అలుముకుంది.

“కాలమాగెను సకల లోకమ్ము నిశ్చ లముగ మ్రాన్పడె భూతమ్ములన్ని వణకి ప్రాణములు బిగబట్టె భయంకరముగ శాంతి ఆవరించెను మహాభ్రాంతి గ్రమ్మె” రాజకుమారి అంతఃపురమునకు ఇంకా చేరలేదు. దీపాలను తీసుకొని తన పరివారంతో వచ్చి చనిపోయిన లేడి స్నేహితులు దుఃఖంలో ఉండగా అది తెలియని రాజకుమారి వారిని కుశలమా అని అడిగింది. అప్పుడు వారి కళ్ళలో కన్నీరు చూస్తూ…

“నయంబుగా వెలంది గాయనం బొనర్చు చుండగా హయాగమంబు దెల్పు తతురా రవాళి విన్చెవి స్మయంబుగా హయాధి రూఢ్య మాన్య తేజుడల్లనన్ భయంబు దీర్చు వాడనంగ వచ్చినిల్చె నయ్యెడన్” రాజకుమారుడైన సుధాకరుడు వేదనతో లలిత వివరాలు తెలుసుకొని జరిగిన విషాదపూరిత విషయమంతా విన్నాడు. హరిణి (లేడి) వేటగాడి గాయంతో వనంలో ఎంత బాధపడిందో అని విచారించాడు.

“నీతపంబు ఫలించు తన్వీలలామ అఖిల తాపముల్ దీరి కళ్యాణమగును గాన మారంభ మొనరింతు పూనియిపుడె యేది వీణయ యిమ్మన్న నింతి యలరి”

మంజులా సంగీత మహిమచేత నిన్ను బ్రతికించడానికి రాజకుమారులు విచ్చేసినారు. అనగానే హారిణి కొంత శాంతించి ఆశగా చూసింది. అప్పుడు రాజకుమారులు వీణను సరాగముగా తిలకించి తంత్రులను మీటి, మనోహరముగా శ్రుతిని పలకించి ఈశ్వరిని, బ్రాహ్మినిని, సద్గురువులను స్మరించిన వ్యాజమనంబుతో అమృత వర్షిణి రాగములో స్మరింస్తూ ఉన్నారు.

“రాజసుతుండు వీణను సరాగముగా తిలకించి తంత్రులన్ మోజుగమీటి కర్వెలను పొల్పుగద్రిప్పి మనోహరశ్రుతిన్ రాజిలగూర్చి ఈశ్వరిని బ్రాహ్మిని సద్గురువునస్మరించి య వ్యాజమనంబుతో అమృతవర్షిణి రాగము”

లో సగమపనిస అంటూ స్వరాలను అరోహించగా సకల జగతి దివికి ఎగసింది. సనిపమగస అంటూ స్వరావరోహణం సాగించగా అమరగనం అవనికి దిగింది. ఆ మహానీయ గానం భువిన్ దివిన్ సలు దిక్కుల ఆపరించింది. దివ్య రాగామృత వర్షము అన్నిదిక్కుల హర్షముగా కురిసింది. ఆ మధుర గంభీర సంగీత దారలకు ఎక్కడో సుప్తమై ఉన్న శరీరము కదిలి కొంచెం కొంచెం కదులుతూ ప్రాణము ఎగిరి వచ్చి దివ్య మహాత్యమైన ఆ సుధాకర గానామృతం వలన లేడి మెల్లగా లేచింది. కళాతపస్విని కావ్యం శుభంగా ముగిసింది. అందె వేంకటరాజము

కవితా తపస్సు ఫలించింది.

“ఎక్కడో సుప్తమై ఉన్న యెదలుకదలి యించుకించుక కరగి ద్రవించె రాళ్లు ఎప్పుడోచన్న ప్రాణము లెగిరివచ్చి కెరలిపులకలు గ్రమ్మి చిగిర్చి మ్రోళ్లు”

సంగీత సభలో శ్రోతగా పాల్గొన్న హారిణి వ్యాధుని బాణంకు గురై మరణిస్తుందేమోనన్న భయానక పరిస్థితి ఏర్పడే దాకా వస్తుధ్వని విస్తరించి ఉంది. ఇంతటి భావనా మాధుమయ కావ్యంలో రసౌచిత్య దృష్ట్యా చేయబడిన వర్ణనలు అతి మధురంగా నూతనంగా, స్వచ్చంగా ఉన్నాయి. అందె వేంకటరాజము పద్య రచనా పాటవం తెలుపడానికి కావ్యమంతా సాక్ష్యం పలుకుతుంది. భవ్యమహత్వపూర్ణమైన ‘సుధాకర గానామృత పూరసేచనం’ లో సుస్వస్టమై లేడి మెల్లగా లేచింది. ‘విశ్వమున మోదాంబోధి’ ఉప్పొంగింది. కళాతపస్విని కావ్యం శుభంగా ముగిసింది. అందె వేంకటరాజము గారి కవితా తపస్సు ఫలించింది.

వ్యాస కర్త

దుర్గం వెంకన్న తెలుగు రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సీటి ໖໓: 6281624720

Get real time updates directly on you device, subscribe now.