పిడికెడు మట్టి…! కొప్పుల ప్రసాద్

పిడికెడు మట్టి...! కొప్పుల ప్రసాద్

శీర్షిక: పిడికెడు మట్టి…!!

నా మట్టే నాకు సింధూరం
లలాట భాగం తిలకధారణం
కన్నతల్లి నవ మాసాలు మోస్తే
నేలతల్లి తనలో విలీనం అయ్యేవరకు భరించే..!!

పిడికెడు మన్ను చేతిలో ఉంటే
పచ్చని బంగారమై సిరులు కురిపించే
విత్తుకు ప్రాణం పోసి వృక్షాన్నే సృష్టించే
సమస్త జీవులకు ఆహారాన్ని అందించే…

అపురూప మందిరాలు నిర్మించే
రెండు రాళ్ల మధ్య చేరి వాటికి బలాన్ని నింపే
అద్భుత నిర్మాణం గావించే
మట్టితో అందమైన నిర్మాణాలు కావించే..!!

మట్టిని ఏలిన వాడే మహారాజు
మట్టిని తవ్విన వాడే కార్మికుడు
మట్టిని నమ్మిన వాడే అన్నదాత
మట్టిని అమ్మినవాడే కుబేరుడు…!!

మట్టి వాసనలు పీల్చినప్పుడు
పరిమళాలు చిన్నబోయే ఏడ్చే
తొలకరి చినుకులు బుర్ర బుర్ర పొంగి
రైతన్నలకు ఆశలెన్నో నింపే…!!

మట్టిలో కలిసే మానవునికి
వ్యామోహం అంతా నేలపైనే నిలిచే
మట్టి పైనే వేదాంతమంతా పుట్టే
అందులోనే జీర్ణమై కలిసిపోయే..!!

అందుకే అంటారేమో
మట్టికి వాడికి రుణానుబంధం తీరిందని
అదే మట్టి పైనే కక్షలు కార్పణ్యాలు
అన్నదమ్ముల పైనే శత్రుత్వం పెరిగే..!!

మందులు పెట్టి నేలను నిస్సారం చేస్తూ
జీవకోటికి ప్రాణహాని కలిగిస్తూ
నేలను మల మల మాడుస్తే
సృష్టి నిలుస్తుందా! మన జీవనం సాగుతుందా..!!

కొప్పుల ప్రసాద్,
నంద్యాల
సెల్:9885066235

Get real time updates directly on you device, subscribe now.