డిగ్రీలో బీఏ.. పీజీలో ఎమ్మెస్సీ మల్టీ డిసిప్లినరీ విధానానికి ఓయూ సన్నాహాలు

ఓయూ

డిగ్రీలో బీఏ.. పీజీలో ఎమ్మెస్సీ

మల్టీ డిసిప్లినరీ విధానానికి ఓయూ సన్నాహాలు

హైదరాబాద్‌:డిగ్రీలో బీఏ చదివి.. పీజీలో ఎమ్మెస్సీ చేసే అవకాశం ఉంటుందా? ఇక నుంచి సాధ్యం కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ స్థాయిలో మల్టీ డిసిప్లినరీ విధానం అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డిగ్రీ స్థాయిలో బకెట్‌ విధానంలో ఆర్ట్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను కలిపి ఉన్నత విద్యామండలి అందిస్తోంది. దీంతో విద్యార్థులు వేర్వేరు బ్రాంచీల సబ్జెక్టులు చదివేందుకు వీలవుతోంది. తాజాగా డిగ్రీలో ఒక బ్రాంచి, పీజీలో వేరొక బ్రాంచీని ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఓయూ భావిస్తోంది. డిగ్రీలో బీఏ చదివిన విద్యార్థి పీజీలో ఎమ్మెస్సీ కోర్సులను ఎంచుకునే వీలు కలుగుతుంది. డిగ్రీలో సైన్స్‌ సబ్జెక్టులు చదివిన విద్యార్థులు పీజీలో ఎంఏ కోర్సులు ఎంచుకోవచ్చు. ఇలా ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టులు ఎంచుకునే వీలుంటుంది. విద్యార్థుల ఎంపిక ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) ఆధారంగా జరుగనుంది. అధ్యయనానికి కమిటీ ఏర్పాటు ఈ విధానంపై అధ్యయనానికి ఓయూ ఓఎస్డీ రెడ్యానాయక్‌ నేతృత్వంలో వర్సిటీలోని వివిధ విభాగాల డీన్స్‌తో ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ కమిటీ వేశారు. ఎలా అమలు చేయాలి? ఏయే కోర్సులు.. ఎంపిక విధానం ఎలా.. విద్యార్థులు, ఆచార్యుల అభిప్రాయం ఏమిటి..? ఇలా సమగ్ర అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీ ఇచ్చిన నివేదికను స్టాండింగ్‌ కమిటీ, పాలకమండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఈ తరహా విధానం దిల్లీలోని జేఎన్‌యూ అమలు చేస్తోంది. అక్కడి పద్ధతులను కమిటీ సభ్యులు అధ్యయనం చేసే వీలుంది. ‘‘విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా మల్టీ డిసిప్లినరీ విధానం కింద డిగ్రీలో ఒక బ్రాంచి.. పీజీలో మరో బ్రాంచి చదివేందుకు అవకాశం ఇచ్చే విషయంపై అధ్యయనం చేస్తున్నాం.’’ అని ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌  వివరించారు

Get real time updates directly on you device, subscribe now.