జనాభా దామాషాలో అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలన్న బిఎస్పి పార్టీ సవాల్
దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల వర్గాలవారికి ఇతర సామాజిక వర్గాల మాదిరిగా రిజర్వేషన్ సౌకర్యం రాజ్యాంగంలో కల్పించని కారణంగా రాజ్యాధికారమే ఎజెండాగా వెనుకబడిన తరగతులు అనాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం గా జనాభాలో 52 శాతం గా ఉన్నటువంటి బీసీ వర్గాలు ఉన్నత వర్గాలు, ఆర్థికంగా బల వంతుల మధ్యన పోటీ ఎన్నికల ప్రపంచంలో నిలబడలేక పోవడం వలన రాజ్యాధికారానికి దూరంగా ఉండవలసి వస్తుంది. మరొక ప్రధానమైనటువంటి కారణం ఆయా రాజకీయ పార్టీల నాయకత్వం ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్న కారణంగా మెజారిటీ బీసీలు పార్టీ కార్యకర్తలుగా, జెండాలు మోసే వారిగా, అధినాయకత్వానికి విధేయులై మాత్రమే కొనసాగడం దారుణం. నిబద్ధత ,నిజాయితీ, ధైర్యసాహసాలు, ప్రతిభ, పోటీతత్వం వంటి విషయాలలో బీసీలు ముందంజలో ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేని కారణంగా సబ్సిడీలు అవకాశాల పేరుతో ప్రభుత్వాలను యాచించే పరిస్థితిలోనే ఉన్నారు.
బీసీల అధికారాన్ని ఆశించి ఆమోదించిన బిఎస్పి:-
*************
భారతదేశంలో పూలే ఆలోచనా పునాదులపై, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం మేరకు, కాన్షీరామ్ గారి ఆలోచన ఆచరణ పరంపర నుండి ఉద్భవించినదే బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ). మెజారిటీ సామాజిక వర్గాల చేతిలో పార్టీల అధినాయకత్వం ప్రభుత్వాలు ఉండాలి అనే ఆలోచనతో బహుజనుల లో భాగమైన రెడ్డి ఇతర అగ్రవర్ణాలకు కూడా టికెట్ ఇచ్చి తన విశాల హృదయాన్ని చాటుకున్న ది బి ఎస్ పి పార్టీ. కానీ ఇతర రాజకీయ పార్టీలు మెజారిటీ సామాజిక వర్గమైన బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు తదితర చట్టసభలకు సంబంధించిన ఎన్నికలలో అరకొర టిక్కెట్ కేటాయించిన కారణంగా చట్టసభలలో నామమాత్రపు సభ్యులు మాత్రమే ఉన్నార న్నది నగ్నసత్యం.
తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే స్వల్ప జనాభా ఉన్నటువంటి రెడ్డి వెలమ కులస్తులకు మెజార్టీ సీట్లు దక్కినవంటే కారణం ఆయా రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించి ఉన్నత వర్గాలకు ఇవ్వడం వల్లనే కదా! . “ఓట్లు మావి సీట్లు మీవా ఇంకానా ఇకపై సాగదు” అని బిఎస్పి పార్టీ గతంలోనే నినదించి ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూడా స్థాపించి బహుజనులకు ఆదర్శంగా నూ భరోసా గాను నిలిచింది.
బి ఎస్ పి పార్టీ ఇతర పార్టీలకు విసిరిన సవాల్:-
********
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర బి ఎస్ పి పార్టీ కి కోఆర్డినేటర్ గా ఎన్నికైన విషయం అందరికీ తెలిసినదే. ఇప్పుడున్న అవకాశాల మేరకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం లేదు. కనుక ఆ వైపుగా అన్ని రాజకీయ పార్టీలను కదిలించి చట్టసభలలో రిజర్వేషన్ సౌకర్యం కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నది.
మరొకవైపు జనాభా దామాషా ప్రకారం గా ఆయా సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం సహజ న్యాయ సూత్రానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర శాసన సభకు వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గానికి 50 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని ఇటీవల రాష్ట్ర కోఆర్డినేటర్ ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు. మిగతా రాజకీయ పార్టీలకు దమ్ముంటే ,నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే, సామాజిక బాధ్యత గనుక గుర్తిస్తే ఆయా పార్టీలలో 50 శాతం టికెట్లను బీసీ వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ సవాలును స్వీకరించి ఆచరణలో తమ నిజాయితీని చూపి మెజారిటీ బహుజనుల పట్ల తమ బాధ్యతను చాటు కోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నప్పటికీ బహుజనుల శక్తిని గనుక గుర్తించ కుంటే రాబోయే ఎన్నికలలో అన్ని పార్టీలను ఓడిస్తామని బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామని బహుజనులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.
ఇదే సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వంటి హామీలు వాగ్దానాలు గానీ మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రం 4,25,000కో.అప్పుల్లోకూరుకుపోవడంపట్ల ఆo దోళన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలోనే వివిధ పథకాలతో ప్రజలను పట్టించుకునే దుష్ట సంప్రదాయానికి స్వస్తి పలకాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతో ఉన్నది. బహుజనులను చిన్న చూపు చూసి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఆధిపథ్యం వహిస్తే ఆ పార్టీల పతనం ప్రారంభం కాక తప్పదని బీఎస్పీ హెచ్చరిక ద్వారా తెలుస్తున్నది.
అన్ని పార్టీలు వెంటనే ప్రకటించాలి:-
**((((******((((
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 119 నియోజకవర్గాల గాను 60కి పైగా స్థానాలను అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు కేటాయించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో కాకుండా ఇప్పుడే ప్రకటించడం ద్వారా బీసీ వర్గాల లో భరోసాను నింపాలి. అంతేకాని దాగుడుమూతలాడి, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేసి మోసగిస్తే మాత్రం ప్రతిసారి మోసపోవదానికి బీసీలు సిద్ధంగా లేరు. అంతేకాకుండా బీసీలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ బీసీ వర్గాల కోసమే కొనసాగిస్తున్న బిఎస్పి పార్టీ పట్ల ప్రజలు సుముఖంగా ఉంటే ఇతర పార్టీల సభ్యుల డిపాజిట్లు గల్లంతు కాక తప్పదు. బీసీ వర్గాల ప్రజలు, బుద్ధి జీవులు ,మేధావులు, ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఈ దేశంలో అనాదిగా రెండు బీసీ కమిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆ వర్గాలకు దక్కాల్సిన ప్రతిఫలము దక్కని విషయాన్ని ప్రజలకు అవగాహన చేయించి బీసీల కోసం పనిచేస్తున్న పార్టీల పట్ల నమ్మకాన్ని కలిగించాలి.
బీసీ సంక్షేమ సంఘాలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష అభ్యర్ధులు, వామపక్షాలతో సమన్వయము చేసుకొని బీసీలు సాధించుకోవాల్సిన డిమాండ్లను ప్రభుత్వం పై పెట్టి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. జనాభా దామాషాలో చట్టసభల్లో రిజర్వేషన్ సౌకర్యం కోసం పార్లమెంటు అసెంబ్లీ లలో చట్టాలను చేయడం తో పాటు తీర్మానాలను ఆమోదించడం జరిగితే ఇది ఒక జాతీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉన్నది. అందుకే అన్ని రాష్ట్ర చట్టసభలలో ఈ అంశంపైనా చర్చ జరిగేలా ప్రతిపక్షాలు పూనుకోవాలి. అందుకు ప్రజలు ప్రజా సంఘాలు బిసి వర్గాలు మిగతా వర్గాలు కూడా బీసీలకు మద్దతివ్వడం ద్వారా చట్టసభల దృష్టికి తీసుకువెళ్లాలి. బి ఎస్ పి పార్టీ విస్తరణ సవాలును స్వీకరించి అగ్రవర్ణ పార్టీలు అన్నీ కూడా తమ విధానాలను మానుకుని అధికారాన్ని కోరుకోవడం నుంచి తప్పుకొని బహుజనుల కే ముఖ్యమంత్రి పదవిని కట్ట పెడతామని హామీ ని ఇప్పుడే ప్రకటించాలి. ఆ రకంగా రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం అన్ని పార్టీల పైన ఉన్నది.
వడ్డెపల్లి మల్లేశం