*ఎందుకో మనసు వేదన..!!*
నాలుగు మాటలు రాద్దామంటే
కవిత్వపు మాటలు దొరకలేదు
నాలుగు వాక్యాలు రాస్తేనే
కవుల మై పోతున్నాం ఈ రోజుల్లో…
కొన్ని పేరాలు రాస్తే ప్రశంశా పత్రాలు
మరి కొన్ని వాక్యాలు రాస్తే బిరుదులు
అక్షరం కన్నీరు కార్చే లా సత్కారాలు
ఎగబడి రాస్తున్నాము నాణ్యత లేని కవిత్వం..
భావానికి కనీసం అలంకారం చూపం
వాక్యం రసాత్మకం గాలికొదిలేసి
నాలుగు మాటలే కవిత్వమైతే
అక్షర శిల్ప సౌందర్యం ఎక్కడుంటుంది…
అందరం సాహిత్య ప్రియులం
ఎంతవరకు ప్రాచీనం ఆస్వాదించాం
నవీన కవిత్వాన్ని రుచి చూసినాం
కవిత్వము లోని మర్మాలు తెలుసుకున్నాం..
భావ కవిత్వపు రసమయం ఎక్కడ?
అభ్యుదయ ఆలోచనల ఆనవాళ్లు కనబడవు
పద విన్యాసాల లావణ్యం లేదు
పదాల కూర్పులో భాషా సొగసులు కానరావు..
ప్రాస ఉంటేనే కవిత్వం కాదు
వాక్య నిర్మాణ శైలి సొగసుగా కావాలి
అందరి మాదిరిగా రాస్తే ఏముంది
రచయిత అయితే వైవిధ్యం ప్రదర్శించు..
వాక్యము లో కొత్తదనం చూపించు
కొత్త పోలికలతో అభివర్ణించు
వస్తువు నీ చూపులో ఎలా కనిపిస్తుందో
సగము కొరికిన చంద్రుడు ఇడ్లీ అయినట్లు..
మహాప్రస్థానం ఒక్కసారి చదవండి
నయాగరా జలపాత అక్షర సొగసులు గమనించండి
పిడుగు లాంటి మాటలు వినండి
మరిగిన రక్తపు బీజాక్షరాల ఆవేశం చూడండి…
పెద్దల కవిత్వం పరిశీలించండి
నాలుగు కవితా పుస్తకాలు శోధించండి
భావ శిల్ప సౌందర్యం సొగసులు చూసి
కవిత్వం రాయడానికి ప్రయత్నం చేద్దాం..
అందరం ఓనమాలు నేర్చుకుంటున్నాము
నిత్య విద్యార్థిలా ముందుకు సాగుతూ
కవితకు కవిత్వపు సొగసులు కల్పించి
మహానుభావుల దారిలో నడక సాగిద్దాం…
నేను రాసిన ఇందులో కవిత్వం లేదు
నేర్చుకునేందుకు నిత్య ప్రయత్నం
అందుకే రోజు రాస్తూ ఉంటాను
ఏదో ఒకరోజు ఫలితం కనిపిస్తుందని..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235