రామాయణం – ఆదికావ్యం

కొప్పుల ప్రసాద్

*రామాయణం – ఆదికావ్యం.*

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతం లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధం. సాహిత్య చరిత్ర పక్రారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. చాలా గొప్పనైనది రామాయణం.రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం.

24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో, హిందూ ధర్మం చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో తులసీదాసు రామచరిత మానసము (కడీ బోలీ), కంబ రామాయణము (తమిళం), రంగనాధరామాయణం, రామాయణ కల్పవృక్షము, మందరము (తెలుగు) వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యం పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వాలు అంతర్గతంగా నున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు.

రామాయణం పుట్టుక కారణము,మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త. ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు.

“కఃను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్
ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యో దృఢ వ్రతః”

ఈ కాలం లో, ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడయిన ఉన్నడా..? ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు.అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు… అలా 16 గుణములు చెప్పి అవన్ని ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మికి మహర్షి అడుగుతాడు.

అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు.

మహర్షీ, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..! కానీ అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.

“ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యో ధ్యుతిమాన్ ధృతిమాన్ వశీ.”

ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువయా అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను.సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మికి మహర్షికి చెప్పెను. అప్పుడు వాల్మికి మహర్షి అమితానందభరుతుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి వుంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను.ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.

“మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్”

“ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి”
శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని, అది రామాయణం వినుటవలన తటస్థించెనని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మ దేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపుమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.

సంస్కృతికి నిలువుటద్దం రామాయణం
ఆదికావ్యం రామాయణం భారతీయ సంస్కృతి నిలువుటద్దం యుగ యుగాల ఇతిహాసాల చరిత్రకు ప్రతీక
కోట్లాది హిందువులకు ఆరాధ్య దైవం,పుణ్య చరితము రామాయణం,అందులో పాత్రల స్వభావాలు కమనీయం.
ప్రవర్తనా విధానము నేటి సమాజానికి ఆదర్శం ప్రమాణముగా సాధిస్తే జీవితం ఎంతో సుఖమయం.
తల్లిపట్ల ప్రేమను తండ్రి మాటపై అభిమానం
అన్న అడుగుజాడలో నడవడం .భార్యాభర్తల పవిత్ర బంధం,గురువు పట్ల భక్తి ,ఉత్తమ మైత్రి ఉదాహరణలేన్నో.
ధర్మ సంస్థాపన లాంటి సద్గుణాలు,నేలపై ఆదికావ్య సారాంశము,ఇతిహాసములో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకం
ప్రతి పాత్ర మన జీవన గమనానికి దిక్సూచి.అంతిమంగా చెడుపై మంచి సాధించిన విజయం,ఈ కావ్యం మనకు బోధిస్తున్నా సత్యము,ధర్మ రక్షణార్థం రాముడికి కష్టాలు
ఇష్టంగా స్వీకరించిన విజయానికి గుర్తులు,రామాయణం రమణీయం మహా కావ్యం,ఇప్పటికీ విరాజిల్లుతోంది కవి చేత కమనీయంగా,ప్రతి చోట ప్రతినిత్యం వినబడుతుంది సారాంశం,తర తరాలకు ఆదర్శంగా నిలిచేందుకు…

కొప్పుల ప్రసాద్,
తెలుగు ఉపన్యాసకులు,
నంద్యాల.
9885066235

Get real time updates directly on you device, subscribe now.