నేలతల్లి ఒళ్ళంతా గాయాలయ్యే..

కొప్పుల ప్రసాద్ నంద్యాల 9885066235

నేలతల్లి ఒళ్ళంతా గాయాలయ్యే..

ధరణి మాత పచ్చని చీరకు చిల్లులు పడెను
సగము వస్త్రం కాలి అందం కోల్పోయే
మట్టికి విషం కలిపి తినిపిస్తే
తనువంతా క్షీణించి రోగిష్టి లా తయారయ్యే..

నేలమ్మ మెడలో హరిత హారము
బలవంతంగా లాగితే కన్నీరు కార్చే
గర్భాన దాగిన సంపద దోచుకుంటే
అవశేషము కోల్పోయి ఆకలితో అల్లాడే..

స్వచ్ఛమైన గాలిని పీల్చిన భూమి
కాలుష్యం కోరల్లో చిక్కి ఎముకల గూడయ్యె
తనకు పట్టిన నల్లటి ఆకారంతో
అంద హీనమై నింగి వైపు చూసే…

పవిత్రంగా ప్రవహించే స్వచ్ఛమైన నీరు
ప్రతినిత్యం పన్నీటి స్నానమాచరించిన నేలమ్మ
నిత్యం మురికి కాలువల కంపుతో
రసాయనాలు కలిసిన నీటితో విలవిలలాడే..

తగినంత వేడితో సేదతీరిన నేల
ఓజోన్ బొక్కలు పెరిగి ఎండకు మూర్చపోయే
రహదారులపై శబ్దాలు ఎక్కువై
రణగొణ ధ్వనులతో మూగబోయే…

నేలతల్లి ఒళ్ళంతా గాయాలయ్యే
పచ్చని చెట్టు మాయమై కన్నీరు వర్షించే
పంచభూతాలు మానవుడికి వశమై
పవిత్రమైన భూమి అపవిత్రమై పోయెను..

భూమిని వదలాలని చూస్తున్నాడు
మరో గ్రహము కోసం పాకులాడుతున్నాడు
ఉన్న భూమిని నాశనం చేసుకుంటూ
లేనిదానికి అర్రులు చూస్తున్నాడు…

భూమిపై ప్రాణుల మనుగడ సాగాలంటే
స్తన్యము ఇచ్చిన నేలతల్లిని కాపాడి
ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించి
చెట్టు పుట్ట మరల జీవం పోస్తే నిలుస్తాం..

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

Get real time updates directly on you device, subscribe now.