కొన్ని సార్లు నోరు జారటము మంచిదే

*స్కాలర్*

*కొన్ని సార్లు నోరు జారటము మంచిదే*
*(షరతులు* *వర్తిస్తాయి )*

గత రెండు సంవత్సరాలుగా మా ఆంధ్రా యూనివర్సిటీ సోషియాలజి డిపార్ట్మెంట్ విద్యార్థులు విశాఖపట్నం వదిలి, ఏజెన్సీ ప్రాంతమైన అరకు,అనంతగిరిని ఫిల్డ్ విజిట్ కోసం ఎంచుకోవడం,అక్కడకు వెళ్ళి విద్యార్థులు తమ టాపిక్ కి అనుగుణంగా స్థానిక గిరిజనులతొ మాట్లాడి వాళ్ళకి కావాలసిన సమాచారం సేకరించుకుని,తర్వాత విశ్లేషించి,ప్రాజెక్టు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇదంతా ఎం.ఏ కోర్స్ లొ తప్పనిసరైన ఓ భాగం. రెండు రోజుల ఈ ఫీల్డ్ విజిట్ కోసం విద్యార్థులతొ పాటు స్కాలర్లు, టీచర్లు కూడ వెళ్ళటం పరిపాటి. అలా ఆ రెండు రోజుల ఫీల్డ్ విజిట్ లొ స్థానికుల సహకారం తప్పనిసరి అలాంటి స్థానిక సహకారం కోసం మేం ఆధారపడింది అనంతగిరిలొ నివాసం ఉంటున్న మా సోషియాలజి పూర్వ విద్యార్ధి, నన్ను అభిమానంగా గురువుగారు అంటూ సంభోదించే డాక్టర్ పుచ్చపుండి రామకృష్ణ. నేను(అభిమానంగా) పిలుచుకునే పేరు *స్కాలర్* …

అనంతగిరిలొ ఉంటున్న రామకృష్ణతొ ముందుగానే మాట్లాడుకుని ఈనెల 19,20 తారీఖుల్లో ఫీల్డ్ విజిట్ కి వెళ్ళి మొదటి రోజు భీసుపురం, సుంకరిమెట్ట గ్రామాల్లోని స్థానిక ప్రజలతొ విద్యార్థులు మాట్లాడి వాళ్ళకి కావాలసిన సమాచారం సేకరించుకున్న తర్వాత, 19 రాత్రికి అరకు రిసార్ట్స్ కి చేరుకున్నాం. ఇక రెండవ రోజు 20 న ఉదయాన్నే 8:30 కల్లా బయలుదేరి దగ్గరలో ఉన్న పద్మాపురం గ్రామంలో సమాచారం సేకరించి పది గంటలకు టిఫిన్ చేస్తున్న సమయంలో మాతో జాయిన్ అయిన రామకృష్ణ గురించి కొంత చెప్పటం కోసమే ఈ పోస్ట్ .

రామకృష్ణ 2005–2007 బ్యాచ్ ఎం.ఏ సోషియాలజి విద్యార్ధి. .నేను యూనివర్సిటీ ఉద్యోగంలొ (2005 అక్టోబర్) చేరేనాటికి మొదటి సెమిస్టర్ సిలబస్ పూర్తి అవటం వల్ల, నాకు సోషియాలజి డిపార్ట్మెంట్ లోనే మరో కోర్స్ అయిన హ్యూమన్ రైట్స్& డ్యూటీస్ లొ క్లాస్ వర్క్ ఇవ్వటం వల్ల, ఎప్పుడైనా ఇతర టీచర్లు లీవ్ పెడ్తే వీళ్ళ క్లాస్ ఎంగేజ్ చేసేవాడిని.వీళ్ళకి నేను ఎప్పుడూ సిలబస్ చెప్పలేదు. అంటే ఓ రకంగా వీళ్ళకి నేను స్టెప్ టీచర్ ని. ఎం.ఏ తర్వాత ఇతను 2008–2010 లొ ఎం.ఫిల్ చేసి 2010–2014 మధ్యలొ పి.హెచ్.డి పూర్తి చేశాడు. మేము ఒక తల్లి బిడ్డలం ఎందుకంటే మేమిద్దరం ఒకే మేడమ్ దగ్గర పి.హెచ్.డి చేశాం.(మా ఇద్దరి గైడ్ ఒకరే) ఆ కారణంగా కానీ,ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల పట్ల స్వతహాగా టీచర్లకు ఉండే కన్సర్న్ వల్ల కానీ అతనితో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే వాడిని. మేమిద్దరం చాల సరదాగా, చనువుగా అభిమానంగా మాట్లాడుకునే వాతావరణం. అతను పి.హెచ్.డి చేస్తున్నప్పుడు,ఓరోజు మేమిద్దరం డిపార్ట్మెంట్ వరండాలో నిలబడి యధాలాపంగా మాట్లాడుకుంటున్న మాటలు చాలా యాదృచ్చికంగా సంస్కృతి, నాగరికత వైపు వెళ్ళాయి. సంస్కృతి, నాగరికత గురించి రామకృష్ణ ఏదో చెప్పబోతున్న తరుణంలో, ఆగవయ్యా…. అడవుల్లో నుంచి వచ్చినవాళ్ళు కూడా సంస్కృతి, నాగరికత గురించి మాకు చెప్తే ఎలా అని నేను కొంచం చనువుగా గాని, ఆటపట్టించటానికో అన్నాను.( ఇది చదివేవాళ్ళలొ కొందరు దయచేసి మీ మనోభావాల్ని తడుముకోకండి. ఎందుకంటే అప్పటికే మా ఇద్దరి మధ్యా సామాజిక వర్గాలకు,భౌగోళిక ప్రాంతాలకు అతీతమైన అవగాహన ఉంది)

*ప్రతిగా అతను స్పందించిన విధానం జరిగింది జరిగినట్టుగా చెప్పటానికి ప్రయత్నిస్తా.*

గురువు గారు అసలు సంస్కృతి ఎక్కడ మొదలైంది, దానికి ఆద్యులు ఎవరు? అంటూ మొదలుపెట్టి… మానవజాతి జీవనం,గమనం మొదలైంది అడవుల్లో, సమాజాన్ని ఏర్పరచింది గిరిజనులు, వేట ద్వారా జీవికను నేర్పింది గిరిజనులు, కౄర జంతువుల దాడి నుండి, తమని తాము రక్షించుకోవటం ద్వారా రక్షిత జీవితాన్ని నేర్పింది గిరిజనులు, సంచార జీవితం నుండి స్థిర నివాసాన్ని పరిచయం చేసింది గిరిజనులు, ఆహార సేకరణ,వినియోగం నుంచి ఆహార ఉత్పత్తి చేసే వ్యవసాయం మొదలు పెట్టింది గిరిజనులు, కడుపు నిండిన తర్వాత మనుషులు దృష్టి పెట్టే వినోదానికి ఆద్యులు గిరిజనులు, శబ్దాన్ని సృష్టించటం ద్వారా మనిషి ఉనికిని, సమాచారాన్ని ఇతరులకు తెలియచేసే పద్దతిని కనుక్కుంది గిరిజనులు,చెక్క వస్తువుల ద్వారా తొలిగా సంగీతాన్ని సృష్టించింది గిరిజనులు, జాన పదాల ద్వారా తొలి సాహిత్యకారులం మేము అని సంస్కృతిని ముగిస్తూ… నాగరికత గురించి చెప్పటం మొదలెట్టాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చే ఆవిష్కరణల ద్వారా మానవ జీవితంలో కలిగే మార్పులే నాగరికత అని చెప్తూ…. గురువుగారు, ఈ ఆధునిక నాగరికతని మనం ఎక్కడ, (ఎవరిలో) చూడగలం అన్న అతని ప్రశ్నకి, పట్టణ యువత అని నా సమాధానం. పట్టణ యువత అత్యంత అధునాతన, ఆధునిక నాగరికతకు పరాకాష్టగా భావించే జీవనాన్ని (పొరపాటు కాదు, రెండు విశేషణాలు ఉపయోగించాను) ఎలా ఆస్వాదిస్తున్నారో చెప్తూ హద్దులు లేని స్వేచ్ఛను, పాశ్చాత్యతను ప్రతిబింబించే పబ్ కల్చర్, రేవ్ పార్టీలలో తల్లిదండ్రులకు, పోలీసులకు, చట్టానికి తెలియకుండా మద్యం, మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తూ, ఆడ మగ నృత్యాలు చేస్తూ,అందులో తమ ఆధునిక నాగరికతను వెతుక్కుంటూన్నారు. ఇలాంటి ఈ ఆధునిక నాగరికత దశకు కేవలం ముప్పై సంవత్సరాల క్రితం మాత్రమే మీరు చేరుకోగలిగారు. అదే మద్యం, మత్తు పదార్థాలతొ వ్యసనంగా కాకుండా,సమాజ ఆమోదంతో, జనావాసాలలో, కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సాంకేతికత లేని ప్రకృతి ఒడిలో,పండు వెన్నెల్లో జానపదాలు పాడుకుంటూ మా గిరిజన స్త్రీ, పురుషులు కూడా నృత్యం చేస్తున్నారు…… అదీ కొన్ని వందల ఏళ్ళుగా…. మా స్త్రీలకు వివాహ,విడాకుల స్వేచ్ఛ ఉంది, అలాంటి స్వేచ్ఛ మీకు ఇప్పటికైనా ఉందా…. ఎవరిది సంస్కృతి,ఎవరిది ఆధునిక నాగరికత….ఈ ప్రపంచానికి సంస్కృతి నేర్పింది మేము,నాగరికత నేర్పింది మేము,దీనికి ఆద్యులం మేము,వ్యాపింపచేసింది మేము.ఎవరి నాగరికతని ఎవరు అనుకరిస్తున్నారో ఇప్పుడు చెప్పండి గురువుగారు… అన్నమాట నాకు సూటిగా గుచ్చుకుంది. తమ గిరిజన జీవితాలపై ఎంత సాధికారత, ఎంత ఆత్మాభిమానం,తనను తన జాతి ప్రజల జీవితాలను ఆవిష్కరించుకున్న తీరుకి ముగ్ధుడ్నై పోయాను, పొరపాటున నేను నోరు జారకపోయి ఉంటే ఇంత విషయం ఖచ్చితంగా మిస్ అయి ఉండేవాడిని.

ఈ సంఘటన వల్ల అతని పట్ల నా అభిమానం మరింత గాఢమయ్యింది. అతన్ని గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలనే నా ప్రయత్నంలొ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఉమ్మడి విశాఖ జిల్లా పెదబయలు మండలానికి చెందిన రామకృష్ణ అతి సాధారణ గిరిజన దంపతులకు ఏకైక సంతానం. ప్రాధమిక విద్య మెరకచింత, సీకరి గ్రామాల్లో , ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అరకు, డిగ్రీ సెయింట్ గ్జేవియర్ కాలేజ్ చినముషిరివాడ, విశాఖపట్నంలో చదివి ఎం.ఏ సోషియాలజికి యూనివర్సిటీకి వచ్చాడు. కేవలం ఒక్క కొడుకు ఉండటం నామోషి అనుకున్నాడేమో ఇంకా ఎక్కువ మంది పిల్లల కోసం వీళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుని మరో ముగ్గురు మగపిల్లలకి తండ్రయ్యాడు. రామకృష్ణ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంటికి పెద్ద కొడుకుగా ఇద్దరు తల్లులు,ముగ్గురు తమ్ముళ్ల బాధ్యత మోయాల్సిన పరిస్థితి. ఓ పక్క తను విశాఖలో చదువుకుంటూ, తమ్ముళ్లను చదివిస్తూ ,వర్షాకాలంలో ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేశాడు. ఇంతటి అననుకూల వాతవరణంలో ఇంకెవరైనా అయితే కేవలం చదువుకు గాని, కుటుంబానికి గాని పరిమితమయ్యే వాళ్ళు. ఇక్కడ రామకృష్ణ గురించి ఇంకో మాట చెప్పాలి . చదువుకుంటున్నప్పటి నుండి ఇతను ఓ మంచి విద్యార్ధి నాయకుడు. తమ ప్రాంతంలో గిరిజన విద్యార్థులను విద్య వైపు ప్రోత్సహించడం, వాళ్ళకు కాలేజ్ సీట్లు, హాస్టల్ సీట్ల విషయంలో సహకరించటం చేసేవాడు. యూనివర్సిటీలొ SFI నాయకుడిగా గుర్తించబడ్డాడు. గిరిజన విద్యార్ధుల కాలేజ్, హస్టల్ అడ్మిషన్లు, హక్కులు, అవసరాల కోసం పోరాడాడు,కేసులు పెట్టించుకున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతూ కూడా “Role of NGO’s in tribal development in Paderu Division” అనే సిద్దాంతం గ్రంథం సమర్పించి ఆంధ్రా యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి. పట్టా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మా సోషియాలజి డిపార్ట్మెంట్ లొ కొంతకాలం గెస్ట్ ఫ్యాకల్టీ గా,కొంతకాలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేశాడు. (బహుశా కేసులన్నీ కొట్టేసేవరకు ఉద్యోగం పేరుతో విశాఖలో ఉన్నాడేమో అని నా అనుమానం)ఎక్కడ పనిచేసిన అతని దృష్టి తన ప్రజలపైనే. పి.హెచ్.డి. చేస్తున్నప్పుడే ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి, అమ్మాయి తరపు వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని ఇప్పుడు తన భార్య పనిచేస్తున్న అనంతగిరి రామకృష్ణ ప్రస్తుత నివాసం.

ఫీల్డ్ విజిట్ రెండవ రోజు ఉదయం స్టూడెంట్స్ టిఫిన్ చేస్తుండగా వచ్చిన రామకృష్ణ,గురువు గారు అనంతగిరిలొ వర్షం పడింది ఉదయాన్నే రావటానికి అవలేదు అని ఆలస్యానికి కారణం చెప్పాడు. మేమిద్దరం మాట్లాడుకోవటానికి కొంచెం టైం దొరకటంతో, ఏం చేస్తున్నావ్ స్కాలర్ అన్న నా మాటకు సమాధానంగా అతను చెప్పిన సమాధానం నన్ను మళ్ళీ ఆలోచింపచేసింది. వైజాగ్ వదిలేశాక JJ Metta Memorial Foundation, Hyderabad బేస్డ్ అమెరికన్ సంస్థ సహకారంతో సుమారు 15 లక్షలతో శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మెషినరీ తెప్పించి, స్థానిక మహిళలకు శిక్షణ ఇప్పించి వాళ్ళే ఉత్పత్తి చేసుకునే విధంగా రెండు సంవత్సరాలు నడిపించి ఉపాధి కల్పించి, ప్రస్థుతం ఆ యూనిట్ ని ఐ.టి.డి.ఏ. కి అప్పచెప్పి ఇంకో బరువైన, దీర్ఘకాలిక బాధ్యత నెత్తికెత్తుకున్నాను సార్ అన్నాడు. ఎంటది అన్నట్టుగా చూసిన నాకు మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ గిరిజనుల విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.అవి దృష్టి కేంద్రికరించాల్సిన అనేక మంది ప్రజల్లో మేము ఒకళ్ళం మాత్రమే. గిరిజనులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పార్టీలు కేవలం తమ పార్టీలొ ఎస్.టి. సెల్ అని ఒక నిర్ణాయాధికారం లేని సెల్ ఏర్పాటు చేసి మమ్మల్ని మభ్య పెడ్తున్నాయి…దీనికి ఏ పార్టీ అతీతం కాదు అని చెప్తూ… గిరిజన ఎజెండా మాత్రమే కలిగి కేవలం గిరిజనులు కోసం మాత్రమే పనిచేస్తున్న *భారత్ ఆదివాసీ పార్టీ* అనే జాతీయ పార్టీ,ఆంధ్రప్రదేశ్ యూనిట్ కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను గురువుగారు అని అంటూ, మా సమస్యల్ని మేమే చట్టసభల్లో ప్రస్థావించాలి, మేమే పరిష్కరించుకోవాలన్నాడు. దీనికోసం మీ కార్యాచరణ , మ్యానిఫెస్టో,బ్లూ ప్రింట్ ఏంటి అన్న నా మాటకు బదులుగా, మా పార్టీకి ఇతర రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులు ఉన్నారు, గిరిజనుల విషయంలో జాతీయ అజెండా తొ పాటు, స్థానిక అజెండా కూడా ఉంటుంది,స్థానిక అజెండా మీద వర్క్ చేస్తున్నాం అన్నాడు. నీ పరిస్థితి ఏంటీ ఎక్కడైనా *తెల్లచొక్కా* వేసుకోవాలనుకుంటున్నావా అన్న నా ప్రశ్నకు తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం చెప్పాడు… ఏంటి ఆ నియోజకవర్గం పరిస్థితి అంటే కుల (సామాజిక) సమీకరణాలు చెప్పాడు. నేను కొంచెం ఇబ్బందిగా ఆలోచించాల్సిన పరిస్థితి. సమాజశాస్త్రంలో డాక్టరేట్ చేసిన వ్యక్తి ఎన్నికల్ని కులం కోణంలో చూసి గెలవాలనుకోవటం ఆ ఇబ్బందికి కారణం. కొన్నిసార్లు గమ్యం మార్గాన్ని సమర్ధిస్తుందేమో!(Some times End justifies means)కానీ ఈదేశంలో కులం విస్మరించలే(కూడ)ని ఒక వాస్తవం. వాస్తవాలను విస్మరించ కూడదు కదా. సిద్దాంతాలు ఆదర్శలు, వాస్తవాల చేతిలో క్రూరంగా హత్య చేయబడ్తాయన్న (Theories are brutally killed by facts) ఓ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మాటలు గుర్తొచ్చాయి. ఇంకా మాట్లాడుతూ మా ఈ ప్రయత్నం దీర్ఘకాలికమైంది, మేమేమి తక్షణ ఫలితాలు ఆశించడం లేదన్నాడు.

స్కాలర్ నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావో లేదో తెలియదు గెలుస్తావో లేదో తెలియదు, నువ్వు వేసుకోవాలనుకుంటున్న తెల్లచొక్కా కి మరకలు అంటుకోకుండా చూసుకుంటావో లేదో తెలియదు కానీ,

ఆకలి,అన్నం విలువ తెలిసిన అతి సాధారణ జీవితం, యవ్వనం నుండే కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉన్నత చదువులు చదువుకున్న వైనం,చదువుకుంటూ తమ జాతి విద్యార్థుల కోసం పోరాడే క్రమంలో కేసులకు సైతం వెరవని ధైర్యం,తమ గిరిజన ప్రజల చరిత్ర, సంస్కృతి, జీవనవిధానాన్ని ఆత్మగౌరవంతొ ఆవిష్కరించుకునే తత్వం, ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకున్న ఆదర్శం, చదువు తర్వాత తన ప్రజలకు ఉపాధి కల్పించిన ఆచరణాత్మకత, గెలుపుకు అవసరమైన వ్యూహాలు,తన ప్రజల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు, ఇవి కదా ఏ ప్రజలైనా కోరుకునే నాయకత్వ లక్షణాలు. ప్రజలకు అవసరమైన ఇన్ని లక్షణాలు ఉన్న నిన్ను నీ ప్రజలు త్వరలోనే గుర్తించాలని కోరుకుంటూ…..అభినందనలు

*People bless you*

*గన్ మెన్ లతొ వైజాగ్ బీచ్ లొ నువ్వు చేసే వాకింగ్ కోసం ఎదురుచూస్తూ….*

మీ గురువుగారు…

డాక్టర్ శామ్యూల్ జాన్ ఆదూరి
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజి,
ఆంధ్రా యూనివర్సిటీ,
8317563725

Get real time updates directly on you device, subscribe now.