శశిశర్మ_అవధాని_బొల్లాప్రగడ. తేటగీతి పద్యాలు

శశి_శర్మ_అవధాని_బొల్లాప్రగడ

#శశి_శర్మ_అవధాని_బొల్లాప్రగడ #తేటగీతి #శ్రీ_మాత్రే_నమః

తేట గీతి:
దేవతా మణి వీవు నీ సేవ చేసి
ఐహి కాముష్కిక సుఖంబు లంద వచ్చు
కనడు లేమిని నిన్ను గొల్చిన నరుండు
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేట గీతి:
ఒక నిగూఢ తేజోమయ ప్రకృతి వీవు
భాగ్య లక్ష్మివి , సద్భక్తి భాజనులకు
కామగని వీవు సద్వజ్ర కవచ మీవు
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేట గీతి:
సౌఖ్యమిడు వేల్పు, మొక్షమొసంగ లేడు
ముక్తినిడు వేల్పు , కూర్చడు, భోగబలము
నుబయ మొసగు, మహా శక్తి యుక్తి వీవు
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేట గీతి:
ధనమొ , కులమో , బలమ్మొ , పెద్దరికమిచ్చు
నదియు , నీ కృప వల్లనే , ప్రాప్తమగును
నీ కనికరమ్ముననె , క్రియా నిపుణుడగును
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేట గీతి:
అమ్మ! నీ నామ రుచి ముందు, నమృత సార
మెల్ల చప్పన నా మాట, పొల్లు గాదు
బ్రహ్మ వేత్తలు దెలిపిన వచన మిద్ది
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేట గీతి:
వాణిగా, లక్ష్మిగా, గౌరివలె వెలుగుచు
కాల చక్రము నడిపించు బాల వీవు
దైవ భావన కిదియె నిదర్శనమ్ము
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేటగీతి:
శివుని యానతి లేనిదే చీమ యైన
కుట్టదని యందు రది, వట్టి మాట
కదల జాలడు, నీ యూత వదిలి, శివుడు
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేటగీతి:
సృష్టికిని, మూల కారణ శ్రీవి, నీవు
సృజన శక్తి త్వదీయ సంస్కృతి ఫలమ్ము
కొలుతు, జగదాది శక్తిగా దలచి, నిన్నె
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేటగీతి:
నిను త్రిశుద్దిగ నమ్మి సందేహ పడక
జీవ యాత్ర సాగించిన శ్రేయమొదవు
కొదవ యొదవదు నిను సదా మదిని నిలుప
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

తేటగీతి:
నీ పదార్చన హీనుడై, నిక్కు నరుడు
సంతరించగ జాలడీ జన్మమందు
నభిమతార్ధమ్ము సర్వధా, వ్యర్ధుడెయగు
తల్లి! జగదంబ! శారద! దయను జూపు!!

Get real time updates directly on you device, subscribe now.