ఉపాధ్యాయ వృత్తి … కీర్తి పూర్ణిమ

ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తుల కంటే వేరుగా వుంటుంది.ఉన్నత స్థాయిలో వుండే వారు అయినా చిన్న స్థాయి ఉద్యోగులు అయిన ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని పాఠశాల నుండి ప్రారంభం చెయ్యాల్సిందే. వారి యొక్క జీవితం అనేది ఏ దిశగా ప్రయాణం చెయ్యాలి అనేది నిర్ణయించడంలో పాఠశాలది ప్రథమ పాత్ర… ఎందులో లభించని గౌరవం ఉపాధ్యాయ వృత్తిలో వుంటుంది.కరోనా మహమ్మారి కారణం చేత ఏడాది క్రితం పడవలసిన టెట్ ఆగిపోయింది. నోటిఫికేషన్ వచ్చింది అని తెలిసిన విద్యార్థులు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న తరుణంలో వారి కోసం కొన్ని సలహాలు సూచనలు మా పత్రిక అందిస్తున్నది.

ఉపాధ్యాయ ఉద్యోగానికి తొలి మెట్టు అయిన టెట్‌లో మెరుగైన మార్కులు ఎలా సాధించాలో తెలుసుకుందాం…  
ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలలు,మున్సిపల్ పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎన్‌సీటీఈ (జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి) నిబంధనల మేరకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. డి.ఇడి./ బి.ఇడి./ లాంగ్వేజి పండిట్‌ కోర్సుల్లో, దీనికి సమానమైన అర్హత కోర్సుల్లో ఉత్తీర్ణత పొందినవారు, గతంలో ఏపీటెట్‌ ఉత్తీర్ణత పొందినవారు కూడా తమ స్కోరును పెంచుకోవటానికి ఈ టెట్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి.
1 నుంచి 5 తరగతులకు బోధించటానికి అభ్యర్థులు పేపర్‌-1 రాయాల్సివుంటుంది.

6 నుంచి 8 తరగతులకు బోధించటానికి అర్హత పొందాలనే అభ్యర్థులు పేపర్‌-2 రాయాల్సివుంటుంది

*అవగాహన అవసరం*

వివిధ సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండటం టెట్‌ అభ్యర్థులకు అవసరం.
* విభాగాల వారీ ప్రాథమిక అంశాలతో సన్నద్ధత ప్రారంభించాలి.
* తర్వాత పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
* సరైన ప్రణాళిక, సమయపాలన అవసరం.
* గత ఏపీ టెట్, టీఎస్ టెట్‌, సెంట్రల్‌ టెట్‌లకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి.
* పరీక్షల్లో ఏయే భావనలపై ప్రశ్నలడగవచ్చో గుర్తించాలి.
* అర్థవంతంగా అవగాహన ఏర్పరచుకోవాలి.
* సాధారణ పరీక్షల్లో ఎక్కువగా జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు కనబడతాయి. అయితే టెట్‌లో జ్ఞాన సంబంధ ప్రశ్నలకేగాక అవగాహన, అనుప్రయుక్తం, నైపుణ్యానికి చెందిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చేలా సన్నద్ధత ఉండాలి.
* సిలబస్‌ చదవడం పూర్తయిన తర్వాత మాదిరి పరీక్షలు రాయాలి.
* నమూనా ప్రశ్నలను అధ్యాయాలవారీగా అభ్యాసం చేయాలి.
* పరీక్షకు కనీసం 10 రోజుల ముందు నుంచి మాదిరి ప్రశ్నపత్రాలను సమయాన్ని అనుసరించి సాధన చేయాలి. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుచున్నామో గమనించాలి. ఆ పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి.
* సొంతంగా నోట్సు తయారుచేసుకుంటే పరీక్షల ముందు సమయం ఆదా అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పునశ్చరణ సులువు అవుతుంది.
* కేవలం అకాడమీ పుస్తకాలనేగాక, నిర్ణీత సిలబస్‌ మేరకు పాఠ్యాంశాలనూ అధ్యయనం చేయాలి.
* అభ్యర్థులు సులువుగా భావించిన విషయాలకు తక్కువ వ్యవధినీ, కష్టంగా అనిపించే అంశాలకు ఎక్కువ వ్యవధిని కేటాయించుకోవాలి.
* సాధనకు తోడు సమయపాలన పాటిస్తే విజయం తథ్యం.
టెట్‌ సిలబస్‌ మొత్తాన్ని పరిశీలిస్తే పదో తరగతి వరకు అభ్యసించిన కంటెంట్‌, డి.ఇడి./బి.ఇడిలో అభ్యసించిన సైకాలజీ, మెథడాలజీ విభాగాల నుంచే ఎక్కువ అంశాలు గోచరిస్తాయి. కాబట్టి గతంలో అభ్యసించినవి పునరావలోకనం చేయాలి.
టెట్‌లో జ్ఞాన సంబంధ ప్రశ్నలకే కాకుండా అవగాహన, అనుప్రయుక్తం, నైపుణ్యానికి చెందిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చేలా సన్నద్ధమై ఉండటం అవసరం.
టెట్‌లో పేపర్‌-1 లేదా పేపర్‌-2లో జనరల్‌ అభ్యర్థులు 60%, బీసీ అభ్యర్థులు 50%, ఎస్‌సీ, ఎస్‌టీ 40% మార్కులు కనీసం పొందితేనే ఉత్తీర్ణత పొందినట్లు పరిగణిస్తారు.
ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించినవారికిలభించే టీఎస్‌-టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌… పరీక్ష తేదీ నుంచి ఏడు సంవత్సరాల వరకూ చెల్లుబాటుతో (వ్యాలిడిటీ) ఉంటుంది.
* టెట్‌ సిలబస్‌ మొత్తాన్ని పరిశీలిస్తే పదో తరగతి వరకు అభ్యసించిన కంటెంట్‌, డి.ఇడి./బి.ఇడి.లో అభ్యసించిన సైకాలజీ, మెథడాలజి విభాగాల నుంచే ఎక్కువ అంశాలు గోచరిస్తాయి. కాబట్టి గతంలో అభ్యసించిన విషయాలను పునరావలోకనం చేయాలి.

*పాస్ అయిపోతే సరిపోతుందా?*

* టెట్‌ స్కోరుకు టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ రాతపరీక్షలో 20% వెయిటేజి ఇస్తారు.
*వీలయినంత వరకు పాస్ అవ్వడానికి మాత్రమే కాకుండా స్కోర్ చేసేందుకు ప్రయత్నం చేయాలి.

*మౌలిక అంశాలే ముఖ్యం*

టెట్‌లో మెర‌వాలంటే పాఠ్యాంశాల‌పై ప‌ట్టుతోపాటు ప‌రీక్ష విధానంపై పూర్తి అవ‌గాహ‌న అవ‌స‌రం. మౌలిక అంశాల‌పై సాధ‌న చేయ‌డం ఎంతో ముఖ్యం. వీటిపై అవ‌గాహ‌న పెంచుకుంటే విజ‌యం మీదే.
* ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలించి, అవగాహన చేసుకోవాలి.
* మౌలిక అంశాలకూ, ప్రాథమిక భావనలకూ ప్రాధాన్యమిస్తూ అభ్యసించాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత ఏర్పరచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్‌ పూర్తి అధ్యయనానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకొని, సన్నద్ధత ప్రారంభించాలి.
* తెలుగు అకాడమీ డీఈడీ, బీఈడీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని, టెట్‌లో నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం అంశాలు, భావనలను అవగాహనతో అభ్యసించాలి. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున ప్రధాన అంశాలను మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది.
* పునశ్చరణ చాలా అవసరం. చదివిన అంశాలను పునశ్చరణ చేస్తే మంచి స్కోరుకు అవకాశం వుంది.
* సమయం తక్కువ ఉన్నందున పరీక్ష దృష్ట్యా ముఖ్య అంశాలనే అభ్యసించి, అభ్యాసం చేస్తూ స్కోరును మెరుగు పరచుకోవచ్చు.

*భయం వద్దు*

చాలా మంది 2 పేపర్ అంటే భయ పడుతూ వుంటారు.కానీ ప్రణాళిక తో చదివితే సరిపోతుంది.అని నిపుణులు సూచిస్తున్నారు.

టెట్‌ పేపర్‌-2లో గణితం, సైన్సు విభాగ అభ్యర్థులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించవలసిన ఆవశ్యకత ఉంది. డిగ్రీ స్థాయిలో గణితం అభ్యసించినవారు జీవశాస్త్ర విషయాలను, డిగ్రీస్థాయిలో సామాన్యశాస్త్రాన్ని అభ్యసించినవారు గణిత, భౌతికశాస్త్ర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. సులభంగా ఉండి ఇప్పటికే బాగా పట్టు సాధించిన అంశాలకు కాకుండా మిగతా విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
పేపర్‌-2లో కంటెంట్‌ పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప్రాథమిక, కీలక భావనలపై అవగాహన అవసరం. అందరు అభ్యర్థులూ పదో తరగతి వరకు గణితం అభ్యసించినవారే కాబట్టి ఆందోళన అనవసరం. ప్రశ్నలు కనీస సామర్థ్యాలను పరీక్షించేవిగా, అవగాహనను పరిశీలించేవిగా ఉంటాయి. తరచూ పునరావృతమయ్యే భావనలకు సంబంధించిన సమస్యలను ఎక్కువసార్లు సాధిస్తే మంచి మార్కులు పొందవచ్చు. బీజగణితం, క్షేత్రమితి, రేఖాగణితం, అంకగణితం అంశాలు ఉన్నత పాఠశాల స్థాయిలోనివే. ఆత్మవిశ్వాసంతో నిర్విరామ సాధన అవసరం.
ఇవి గమనించండి
‣ ఇప్పుడు మిగిలున్న కొద్ది రోజులూ నిరుత్సాహాన్ని వదిలి ఉత్సాహపూరిత వాతావరణంలో అభ్యసించాలి.
‣ ఈ నిర్ణీత సమయంలో సిలబస్‌లోని ప్రధాన అంశాలకే పరీక్ష దృష్ట్యా ప్రాధాన్యమివ్వాలి.
‣ ఇప్పటికే ప్రాథమిక భావనలపై పట్టు సాధించి ఉంటారు కాబట్టి అవగాహన, వినియోగస్థాయి ప్రశ్నలపై ప్రత్యేక దృష్టిసారించాలి.
‣ గత టెట్‌ ప్రశ్నపత్రాల పరిశీలన, విశ్లేషణ ఆధారంగా అధికశాతం ప్రశ్నలు అభ్యర్థి అవగాహనను, అనుప్రయుక్త సామర్థ్యాలను అంచనావేసే ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ విధమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసేలా మెలకువలు, నైపుణ్యం అత్యావశ్యకం.
‣ నూతన అంశాల జోలికి వెళ్లకుండా గతంలో అధ్యయనం చేసిన ప్రామాణిక మెటీరియల్‌నే పునరభ్యసం, పునశ్చరణ చేయాలి.
‣ వీలైనన్ని మాదిరి- ప్రామాణిక ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.
‣ ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఏకాగ్రత, ఓర్పు, క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష హాలులో సకాలంలో అన్నిటికీ జవాబులు రాసేలా మెలకువలు పాటించాలి.
‣ మెథడాలజీలో కామన్‌గా ఉండే అధ్యాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలావరకు ఇతర సబ్జెక్టు మెథడాలజీలో కూడా అవే అంశాలు పునరావృతమయ్యే అవకాశం ఎక్కువ. ఇలా సమయం ఆదా అవుతుంది. విషయంపై పునర్బలనం కలుగుతుంది. ఈ సమయం వేరొక సబ్జెక్టు అభ్యసనానికి దోహదపడుతుంది.
‣ శిశువికాసం- అధ్యాపనం, బోధన విధానాలు రెండు పేపర్లకూ ఒకే సన్నద్ధత ఉపయోగపడుతుంది.
‣ డిగ్రీలో తాము చదివిన ప్రధాన సబ్జెక్టు కాకుండా మిగతావాటిపైనా పట్టు సాధించాలి.
‣ విషయంపై జ్ఞానంతోపాటు అవగాహన, అనుప్రయుక్తం అవసరం.
‣ సమాధానం గుర్తించడంలో సరైన మెలకువలు పాటించాలి.
‣ కఠినతా స్థాయి ఎక్కువగా ఉండే ప్రశ్నలను సాధించే క్రమంలో సమయం వృథా కాకుండా జాగ్రత్త వహించి, ఒత్తిడికి దూరంగా ఉండాలి. వీటికి పరీక్ష చివరి సమయంలో సమాధానాలు రాయాలి.
‣ ఆత్మవిశ్వాసం, మనోబలం, నైపుణ్యం, మెలకువలు.. ఇవీ మీ విజయానికి పునాదులు అని మరిచిపోకండి.

కాబోయే ఉపాధ్యాయులు మీకో మనవి:
మీ చేతిలోనే దేశ భవిత వుంది.వారికి మార్గం చూపాలి అంటే ముందు మనం సరయిన మార్గం లో నడవాలి అని మరిచిపోకండి.

*కీర్తి పూర్ణిమ*
తెలుగు ఉపాధ్యాయురాలు

Get real time updates directly on you device, subscribe now.