దర్పణం …. కీర్తి పూర్ణిమ

ఉపాధ్యాయులు

శీర్షిక: దర్పణం

ఇతివృత్తం :

తెలంగాణ ప్రాంతపు మాండలికం బాషా, వ్యవహారం, వారి అమాయకత్వం తెలిపే చిన్న సంఘటనలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయి ఉన్న జాతి, కుల, మత వ్యత్యాసాలు. కులపు పునాదులపై నిర్మించుకున్న వారి ఆలోచనలు తప్పు అని తెలుసుకొని మారిన ఒక వ్యక్తి కథ.

పాత్రలు :

మోహన్ రావు : ఊరి సర్పంచ్, కులం, జాతి పట్టింపులు ఎక్కువ
యీరన్న (యీరి) : మామూలు మధ్యతరగతి వ్యక్తి. ఎవరికి అపాయం కలిగినా తట్టుకోలేనీ మనస్తత్వం.
కాంతమ్మ : కుటుంబం అంటే ప్రాణంగా, లోకంగా భావించే యీరన్న బార్య.
సంధ్య : యీరన్న కాంతమ్మల ముద్దుల కూతురు.

మిగిలిన కొన్ని చిన్న పాత్రలు సందర్బాలకి అనుగుణంగా తీసుకోవడం జరిగింది.

************

మోహనరావు : ఏందిరో యీరిగా ఈ దినం పెద్ద బండకాడికి అందరినీ రమ్మని సెప్పినం గదా, నువ్వు ఎందుకు రాలేదు రా… నీకు పత్తేకంగా బొట్టు వెట్టి జెప్పాలా ఏంది. ఒక్క మారు దండోరా వేయించినం అంటే రావాలె అంతే… పతోడికి రోజు రోజుకీ నెత్తిమీద కొమ్ములు వత్తున్నయి.

అంటూ నోట్లోనే విసుగుకుంటూ యీరన్న సమాధానం చెప్పేలోపే నసుగుతూ తన ఇంటి మెట్లు ఎక్కడానికి అవస్థ పడుతూ గుండ్రాయి లాంటి తన శరీరం బరువుని బారంగా మోస్తూ లోపలికి వెళ్ళాడు మోహన్ రావు…

తన పిలుపుకి ఆగి సైకిల్ మీద నుంచి ఒక కాలు కిందపెట్టి ఆగిన యీరన్న రావుని అలా విసుగుకుంటు వెళ్ళడం చూసి తను మారే మనిషి కాదని తనలో తానే నవ్వుకొని మళ్ళీ తన సైకిల్ ఏసుకొని ఇంటికి బయల్దేరాడు…

యీరన్న : యెప్పుడు జూసినా తలుపులు దగ్గరికి యేసి ఉంచే కాంతమ్మ ఈ యేల ఎందుకో తలుపులు బార్లా తెరిచి పెట్టింది…

అని మనసులో అనుకుంటూ ఆరుబయట ఉన్న తొట్టిలో నుంచి నీళ్ళు తీసుకొని కాళ్ళు కడుగుతూ ఆలోచిస్తాడు. గుమ్మం నుంచే కాంతమ్మని పిలిస్తూ లోపలికి అడుగు పెడతాడు యీరన్న…

ఎప్పుడయినా తను రాగానే నీళ్ళ చెంబు పట్టుకొని వచ్చే కాంతమ్మ ఈ రోజు రాలేదు. తన కోసం వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తాడు. నిండా దుప్పటి కప్పుకొని ములుగుతూంది… గబా గబా వెళ్లి దుప్పటి జరిపి తల మీద చెయ్యి వేసి చూసాడు. తల నిప్పుల కుంపటి లా కాలిపోతుంది…

యీరన్న : ఏందే ఇంత జరం ఉంది… నేను పనికి పోయేటప్పుడు బాగానే ఉన్నావు గాదె ఇప్పుడు ఇలా అయిపోయావు…

కాంతమ్మ : (బారంగా కళ్ళు తెరిచి చూస్తూ) లేదయ్యా, నిన్న రాత్రి పూట నుంచే పానం సుస్తి చేసింది. పని హడావుడిలో పట్టించుకోలేదు. పొద్దున నువ్వు పనికి పోవాలె గాదె అందుకే లేచి డబ్బా కట్టిన…

యీరన్న : కాంతమ్మా… నువ్వు లేకుంటే నా జీవితానికి  కాంతి లేదే… లే ఏమయిన తిందువు.

కాంతమ్మ : నాది పక్కకి పెట్టయ్యా, పిళ్ళగాల్లు పొద్దటి నుంచి ముద్ద నోట్లో పెట్టలేదు. పండుగ కోసం పూలకని పొయ్యి ఇంకా జాడే లేదు…

అని కాంతమ్మ అంటుండగానే…

సంధ్య : అచ్చేసిననే అమ్మా, సూడు ఎన్ని పూలు తెచ్చిననో… పతీ ఏడు సూరమ్మ బతుకమ్మనే పెద్దగా ఉంటది గదా, ఈ సారి నేను తెచ్చిన పూలతో వాళ్ళ కంటే పెద్ద బతుకమ్మ సేయ్యే, ఆకలి ఘోరంగా అయితాందే జల్ది అన్నం పెట్టు…

యీరన్న: తల్లీ, అమ్మకి జరం అచ్చిందే

అంటూ కూతురి తల నిమిరాడు యిరన్న…

సంధ్య : అయ్యో! నాకు తెల్వదే, ఇప్పుడు ఎట్టుందే (అని తల్లి తల మీద చేయి పెట్టి చూస్తూ), గుడ్డు కొడితే ఆమ్లెట్ అయ్యేటట్టు ఉంది గాదె. నువ్వు పడుకో తమ్ముడూ నేనూ వంట చేత్తం…

అని, కాంతమ్మ వారిస్తున్నా వినకుండా వంట చేసి తల్లికి ప్రేమగా తినిపించారు పిల్లలు…

****************

సంధ్య : అమ్మా, నా బతుకమ్మ అందరికంటే పెద్దగా అయ్యిందే. నేను అందరి వాట్సాప్ స్టాటస్ లు చూసిన… యెంకి గాడి అమ్మ తంగేడి పూలతో నీలి రంగు పూలు గలిపి బతుకమ్మ చేసిందే. చిన్నగా ఉన్నా మస్తు ముద్దగా గొడుతుంది…

కాంతమ్మ : సరే కానీ ఇంత పెద్ద బతుకమ్మ మోసుడు నాతో గాదు బిడ్డ… ఇక్కడ ఎత్తింది మళ్ళీ గద్ద కాడికి పోయే దాకా దించేది లేదు…

సంధ్య : ఏం గాదె అమ్మా, నేను ఎత్తుతా, నా నెత్తి మీద పెట్టు…

అని తన చున్నీని గుండ్రంగా చుట్టి తల మీద పెట్టుకుంది…

“జాగ్రత్తనే బిడ్డ” అంటూ బతుకమ్మని తల మీదకి ఎత్తింది కాంతమ్మ. కాంతమ్మ పాట పాడుతూ ఉంటే తన బిడ్డ తనతో తాళం కలిపింది. బరువునీ దూరాన్నీ సులభతరం చేసేందుకు అది ఓ చక్కని ఉపాయం.

రమణీ బిందా తీసుక మంచీ నీళ్లకి పోతె
సోమవారం ఎదురాయనమ్మా ఆ సాంబశివుడు…
“ఆ సాంబశివుడు…”
రమణీ బిందా తీసుక మంచీ నీళ్ళకి పోతె
మంగలారం ఎదురాయనమ్మా ఆ అంజనెయుడు…
“ఆ ఆంజనెయుడు…”
రమణీ బిందా తీసుక మంచీ నీళ్లకి పోతే
బుదారం ఎదురాయనమ్మా ఆ బొజ్జగణపయ్యవాడు…
“గణపయ్య వాడు…”

***************

కాస్త ముందుకు వెళ్ళాక “నాతో గాదె అమ్మా” అని అక్కడే వున్న బండమీద కూర్చుండిపోయింది ఆ బక్క ప్రాణం. దూరంగా సైకిల్ వేసుకొని వస్తున్న యీరన్నని చూడగానే అమ్మ అటు సూడే అని చూపించింది కాంతమ్మకి. దూరం నుంచి చూసి వాళ్ళ వైపుగా వచ్చాడు యీరన్న…

యీరన్న :  ఏం అయింది కాంతం, జరం తగ్గిందానే బతుకమ్మ పట్టుకొని ఎళ్ళినావు…

కాంతమ్మ : (యీరన్న వైపు చూసి చిన్న నవ్వుతో) ఏం గాదులే అయ్యా… ఏడాదికి ఓ మారు అచ్చే పండుగ ఎట్లా పోనియ్యాలే సెప్పయ్యా. పండుగ ఎప్పుడు వస్తది అని, పండగ అయిపోయిన నాటి నుండి మళ్ళీ ఎప్పుడా వచ్చేది అని అనుకుంటా  ఎదురుచూస్తాది కదే బిడ్డ, అందుకే వచ్చిన…

యీరన్న : మంచిగున్నదిలే… లే లే కళ్ళు తిరిగి కిందపడితే ఎంకన్న సామి గుర్తు అత్తడు అప్పుడు. నీలాంటిది పక్షవాతం బోయి నాకు కాళ్ళు అత్తే నా చేతులు నీకు ఇత్తనయ్య అని మొక్కుకుంది అంట…

అంటూ పక్కనే చెట్టు కింద సైకిల్ స్టాండు వేసి పెట్టి బిడ్డ నెత్తి మీద ఉన్న బతుకమ్మని ఎత్తి తల మీద పెట్టుకొని గద్ద కాడికి పయనం అయ్యారు…

సంధ్య : అయ్యా… ఈ సారి గద్ద మస్తు ముస్తాబు చేసిల్లులే… దూరం నుంచే ఇంత ముద్దుగా కొడుతుంది అంటే దగ్గరికి పోతే ఇంక ఎంత ముద్దుగ కొడతదోనే…

యీరన్న : అవును బిడ్డా… ఆకాశంల కెళ్ళి నచ్చత్రాలు కిందికి దిగి గౌరమ్మ తల్లి కి హారతి పట్టినట్టు అగుపడుతుంది కదనే…

కాంతమ్మ :  ఎంత ముద్దుగా గొడతంది.

సంధ్యా : అమ్మా… గాల్లో తేలుతూ ఎర్రగా ఎంత ముద్దుగా ఉన్నాయో…

కాంతమ్మ : గాల్లో తేలడం ఏందే ఎర్రి దానా…

అంటూ బిడ్డ నెత్తి మీద నవ్వుతూ మొట్టికాయ వేసింది కాంతమ్మ…

సంధ్య : అదిగో అటు చూడు అమ్మా…

అని గాలితో కబుర్లు చెప్తున్నట్లు గాలితో పాటు చెంగు చెంగున తేలుతున్న గ్యాస్ బుగ్గల్ని చూపింది…

కాంతమ్మ : కొనిస్తా లేవే తల్లీ… (అంటూ తన పుట్టింటి వాళ్ళు పెట్టిన నేత పచ్చ చీర కొంగు చివరన వేసిన ముడిని విప్పుతూ) ఇదిగో బిడ్డా నువ్వు అల్లరి మానేసి నేను చెప్పేది ఇనాలే మరి…

సంధ్య : సరేనే అమ్మా…

అని అంటూ కాంతమ్మ ఇచ్చిన మడిచిన పది రూపాయల నోటుని కేరింతలు కొడుతూ తీసుకుంది సంధ్య..

కాంతమ్మ : తల్లీ మన బంటి గాడు ఏడి…?

సంధ్య : వాడు డప్పులతో బతుకమ్మని తోలుకపోయేటప్పుడే ఎల్లిపోయిండు గద్దె కాడికి…

కాంతమ్మ : వాడికి ఎప్పుడూ తొందరనే… తల్లీ, వాడికి ఒకటి కొనిచ్చి నువ్వు ఒకటి కొనుక్కో…

ఆ సరే సరే అంటూ తన మిత్రులు కోలాటాలు పట్టుకొని బతుకమ్మ చుట్టూ ఆడటం చూసి వాళ్ళ చెంతకి పరుగు తీసింది… గద్దె వద్ద రెండు గుంపులు: ఒకటి  పెద్ద కులం వాళ్ళది, ఒకటి చిన్న కులం వాళ్ళది… కాంతమ్మకి అంత దూరం నుంచి నడుస్తూ వచ్చే సరికి కళ్ళు బైర్లు కమ్మాయి అక్కడే కనిపించిన బండరాయి దగ్గర కూర్చుండి పోయింది… యీరన్నని తన ముందు ఉన్న గుంపు దగ్గర బతుకమ్మని పెట్టమని చెప్పింది… యీరన్న, బతుకమ్మని అక్కడ పెట్టి బండరాయి మీద కూర్చున్న కాంతమ్మకి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు… కాంతమ్మ గబ గబా నీళ్ళు తాగి అలిసిన శరీరంతో పెద్ద శ్వాస తీసుకుంది…

ఒక్కసారిగా యూరన్నకి వీపు మీద నెట్టినట్టు అయ్యింది… ధబేలున మోకాళ్ళ మీద వున్న యీరన్న బోర్లా పడ్డాడు. అప్పటి వరకు ఆటపాటలతో హడావుడిగా ఉన్న జనం అంతా తుఫాను ముందు ఉండే నిశబ్దంలా మారిపోయారు. కాంతమ్మ ఒక్క సారిగా లేచి పడిన యీరన్నని లేపే ప్రయత్నం చేసింది… బోర్లా పడటంతో అక్కడే ఉన్న రాయి చీరుకొని మోచేయి నుంచి రక్తం కారింది… వెంటనే కాంతమ్మ తన బతుకమ్మలో ఉన్న గౌరమ్మని మొక్కి పసుపుతో చేసిన గౌరమ్మ నుండి చిటికెడు పసుపు పట్టుకెళ్ళి యీరి చేయికి గాయం అయిన చోట రాసింది.

అప్పుడే అక్కడ ఉన్న ఒక పెద్ద కులం గుంపు నుంచి ఒక మహిళ ముందుకు వచ్చి… “ఒసేయ్ కాంతం! ఏం చేస్తున్నావో ఏమైనా అర్ధం అవుతుందా నీకు? గౌరమ్మని తీసి పసుపు పెడతావా? ఎంత అపచారం! గౌరమ్మకు కోపం అత్తే మనం కాలి బూడిద అవుతాం. నీ వల్ల ఊరు ఊరంతా నాశనం అవుతుందే! అర్థమయ్యిందా?” అని‌ కనుబొమ్మలు పైకెత్తి నోటి మీద చేయి వేసుకుంది…

కాంతమ్మ ; అయ్యో! అట్ట అనకు తల్లీ… నా వల్ల ఊరికి కట్టం రానియ్యను తల్లీ…

అని మాట్లాడుతుంటే అదే సమయంలో అదే గుంపులో నుంచి ఒక మహిళ అమ్మోరు వచ్చినట్టుగా ఊగడం మొదలెట్టింది. అందరూ తనని “శాంతించు తల్లీ” అంటూ వేడుకుంటున్నారు. తెచ్చిన ఫలహారాలు పెట్టిన అగరబస్తీలు తన ముందు పెట్టి హారతులు పడుతున్నారు ఆడబిడ్డలు… కాసేపటికి ఆ మహిళ మాట్లాడింది. “కాంతమ్మా!” అని పిలిచింది. చుట్టూ వున్న జనం దూరం జరిగారు. కాంతమ్మ వణుకుతూ ముందుకు వచ్చి “తల్లీ! తప్పయింది తల్లీ! సమించూ…” అంటూ మోకాళ్ళ మీద కూర్చుని వేడుకుంది. ఆ మహిళ, “నా బతుకమ్మకి వాడే పువ్వులే ఎంగిలి కాకుండా వుండే పూలతో సేత్తరు… అట్టాంటిది పసుపుతో చేసిన నన్నే ఎంగిలి సేత్తవా… నీకు ఎంత ధైర్యమే…”

కాంతమ్మ : లేదమ్మా తప్పయి పోయింది… (ఏడుస్తున్న స్వరంతో)

ఆ మాహిళ : చేసిందంతా చేసి తప్పయింది అని లెంపకేసుకుంటే అయిపోతుందా?

“అమ్మా! ఏం చెయ్యమని అంటారు చెప్పమ్మా…‌” అని అందరూ చేతులు పైకి లేపి దండాలు పెట్టారు.

ఆ మహిళ : నా పూల పండుగ అయ్యే వరకు, ఆ గంగమ్మ ఒడిలో నేను అడుగు పెట్టే వరకు నువ్వు ఆ నీళ్ళ మధ్య నిలబడాలి.

అని ఊగుతూ కింద పడిపోయింది. ఎవరూ ఏం మాట్లాడక పోయినా కాంతం వెళ్లి నీళ్ళ మధ్య నిల్చుంది. అందరి నోరుకి బయపడి యీరన్న కూడా ఏం మాట్లాడలేదు. అందరూ మళ్ళీ వెళ్లి బతుకమ్మ ఆడుతున్నారు. కాంతం నది నడుమ చల్లటి నీటిలో ఉంది…

అమ్మవారు వచ్చి కింద పడిన ఆ మహిళ కూడా లేచి మళ్ళీ ఆటలో పడింది. కాంతం వంక చూస్తూ “మంచి పనయింది దీనికి. లేక పోతే నాకు ఎదురు చెప్తుందా.” “ఏం అయింది అక్కా దానితో నీ గొడవ ఏమిటి? నీకు అమ్మవారు రాకున్నా ఎందుకు అలా నటించావు?”. “మరి లేకుంటే ఏమిటే దాని పొగరు దాని తల పొగరు దించడానికి ఇలా చేశాను. మొన్న మా ఇంట్లో ఇల్లు సర్ధుతుంటే పట్టు చీర కట్టుకొని పండుగ చేసుకో అని ఇస్తే అద్దు తల్లి అని వెనక్కి ఇచ్చింది. పోనీలే అని పాపం అని చూస్తే నాతోనే అలా ప్రవర్తిస్తుందా. అందుకే ఇప్పుడు ఇలా ప్రతీకారం తీర్చుకున్నా” అంటూ పొగరుగా ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ ఆటలో పడింది జోతి.

యీరి కాంతమ్మ దగ్గరికి పోయి గట్టు మీద కూర్చున్నాడు. నీళ్లలో ఉన్న కాంతమ్మని చూస్తూ…

యీరన్న : ఎందుకే, యీరి గాడి కోసం ఇదంతా అవసరమా? కులి పనిలో నాకు ఎన్ని దెబ్బలు తగులుతాయో తెలుసా? టిన్నేర్ రాసుకొని సప్పుడేక ఉంట. ఈ చిన్న దెబ్బ కోసం నువ్వు జరమచ్చి నీళ్లల్ల నిల్సున్నవు. రేపు పొద్దున లెత్తవా ఇగ…

కాంతమ్మ : ఎం గాదులే అయ్యా. నువ్వు అట్ట బాధ పడకు. అసలు ఈ పండుగ ఎవరి పండుగ అయ్యా?

యీరన్న : ఏమోనే. నాకు సక్కగా తెలవదు. ఎన్నో కథలు ఉన్నాయి దీని గురించి. కానీ గిరిజనుల నుండే మొదలు అయ్యింది అని మా తాత చెప్పే వాడు. పుట్టిన పిల్లలు చనిపోయి మళ్ళీ పిల్లలు కాక బాధపడే వారికీ,‌ పిల్లలు లేని వాళ్ళకీ పిల్లలు ఇచ్చే తల్లి అనీ, అలా పుట్టిన పిల్లలకి బతుకు అనీ, బతుకమ్మ అనీ బతుకయ్య అని పేర్లు కూడా పెట్టుకొనే వాళ్ళు. ఆ దుర్గమ్మ అవతారం అని ఎన్నో చరిత్రలు ఉన్నాయే ఏదో ఉత్తిగా అచ్చిన పబ్బం కాదే ఇది.

కాంతమ్మ : అవునయ్యా, రోజూ ఒకటి చేత్తం కదా, ఈ రోజు ఎందుకు రెండు బతుకమ్మలు చేయాలె?

యీరన్న : ఏంలేదే, మన సంప్రదాయం అది. నువ్వు చుసినవా, ఎప్పుడయినా బోజనాలు పెడితే, ఏ ఒక్క సారి తిని లేవద్దు రెండో సారి కూడా కాత్త నైన తినలే అని అంటాం. ఎందుకు? గౌరవం… మన పేమా ఆల్లకి అర్ధం కానీకి తిని లేవద్దు రెండో సారి పెట్టుకో అని మళ్ళీ అలా సేత్తం. అది మన పద్ధతి, అంతేకాదు పెళ్లి కూతురితో పాటు ఒకరిని తోడుగా పంపిస్తాం అలానే బతుకమ్మని కూడా ఒంటరిగా కాకుండా చిన్న బతుకమ్మ చేసి పంపుతాం. అవునే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు?

కాంతమ్మ : ఏం లేదులే అయ్యా. అదిగో బతుకమ్మ పండుగ అయినట్టు ఉంది అందరూ బతుకమ్మ  పట్టుకొని వస్తున్నారు అంటూ అటు వైపు చూసింది.

తన చూపుని చూస్తూ యీరన్న కూడా చూసాడు. అందరూ వస్తున్నారు. మోహన్ రావు ముందు వస్తున్నాడు. చీకటి కారణంగా సరిగ్గా కనిపించక అక్కడే ఉన్న బురదలో జారి పడ్డాడు. బతుకమ్మలు పట్టుకొని వచ్చే వాళ్ళు అంతా ఆగిపోయారు. ముందే గుండ్రాయి లాంటి శరీరం. కింద పడగానే అరిచిన అరుపు ఊరి పొలిమేర వరకు వినపడింది. అందరూ తను లేవడానికి పడుతున్న ప్రయాస చూస్తూ వుంటున్నారు కానీ ఎవరు వెళ్లి తనని లేపడానికి ప్రయత్నం చేయడం లేదు. యీరన్న చూస్తున్నాడు. వెళ్లి లేపుదాం అని ఆలోచించినా వాళ్ళ ఊరి కట్టుబాటు గుర్తు వచ్చింది. తక్కువ కులం వాళ్ళని పెద్ద కులం వాళ్ళు తాకరు పొరపాటున తాకినా వెళ్లి స్నానం చేస్తారు. కానీ పందులు అప్పటి వరకు ఆ బురదలో బోర్లి వెళ్ళడం చూసిన వాళ్లంతా మోహన్ రావుని లేపడానికి అడుగు వెనక్కి వేస్తున్నారు. లేవడానికి ప్రయత్నం చేసి మళ్లీ దబాలున పడిపోయాడు. ఈసారి నడుముకి దెబ్బ తగిలింది కాబోలు నడుము పట్టుకొని అమ్మా! అయ్యా! అంటూ వాళ్ళ కులం వాళ్ళ వైపు చూస్తున్నాడు. అసలు ఎవరూ మొహం కూడా చూడడం లేదు. అంతలో యీరన్న చెయ్యి ముందుకు చాపాడు. మోహన్ రావు అక్కడే నిలబడి చూస్తున్న వాళ్ళ వైపు చూస్తూ సూరన్నకి చెయ్యి అందించాడు. తనని చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తుండగా వెనక నుంచి ఒక అరుపు… “చిన్న కులం వాడితో చెయ్యి కలుపుతావా” అని. మోహన్ వెనక్కి తిరిగి చూసాడు. ఎవరూ నోరు మెదపలేదు. దెబ్బ తగిలిన కాలిని నేలకు ఈడుస్తు ఒక చేతిని నడుము మీద పట్టుకొని మరో చేయి సూరన్న మెడ మీద వేసి ముందుకు వెళ్తున్నాడు. వాళ్ళు చెరువు దగ్గరికి వెళ్ళడం చూసి “మేము బతుకమ్మని వదిలే చెరువులో ఈ బురద కలిపితే నీళ్ళు చెడిపోతాయి” వెనక నుంచి మరొకరి మాట ఈ సారి వెనక్కి కూడా చూడలేదు. ఆ నీళ్ళల్లో మోహన్ రావుని కడిగి యీరన్న బయటకి పట్టుకొని వచ్చాడు. మోహన్ రావుని యీరన్న ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు…

అని అందరికీ అర్ధం అయ్యింది .ఒక్క క్షణం వాళ్ళ ముందు ఆగి ఆ గంగమ్మకి మీలాగా మురీకిని దాచుకొనే తత్వం లేదు అని ముందుకు వెళ్ళిపోతాడు. ఆ గంగమ్మ గల గల పారుతూ దర్పణం ల స్వచ్ఛంగా ముందు కి కదిలిపోతుంది.అందరూ వెళ్లి బతుకమ్మ నీ సాగనంపి వెనుదిరిగి వెళ్తారు.మోహన్ రావు మనసులో ఎన్నో ఏళ్ల నుండి వున్న జాతి వివక్ష , కులపు గోడలు గాయాలు కడిగిన నీళ్లలో లోనే వదిలి స్వచ్ఛం గా ఇంటికి బయల్దేరాడు.యిరన్న వంక చూస్తూ డబ్బు కట్టకుండా వచ్చి గద్దె కాడ బతుకమ్మ నీ  పెట్టావు అని… వచ్చి నిన్ను నెట్టి నిచేశాను.నువ్వు నాకు అయ్యిన గాయం తుడిచావు నన్ను మన్నించు రా యీరన్న అని మనసులో అనుకుంటూ.ఇంటికి వెళ్తాడు మోహన్ రావు . ఆనాటి నుండి ఎవరిని తక్కువ చూడలేదు మోహన్ రావు.కాంతమ్మ నీ నీళ్లలో నిలబడేలా చేసిన ఆడవాళ్ళకి మోహన్ రావు మాట అర్ధం కాలేదు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.కాంతమ్మ తన పిల్లలని పట్టుకొని ఇంటికి బయల్దేరింది.తను తెచ్చిన సత్తూపిండి ప్రసాదం అందరికీ పంచుతూ.

శుభం….

Get real time updates directly on you device, subscribe now.