“భాషను మరవద్దు”
అమ్మ భాష అమృతం
పరభాష పదాలలో పరువు లేదు…
పవిత్రత లేదు…ఆర్ద్రత లేదు…
అమ్మ పిలుపుతో
పదాలలో వచ్చే ప్రేమతడి
గుండె గుడి మనసు వడి
నిండుగా కనిపిస్తుంది…
తప్పుడు పదాలలో
తప్పటడుగులే తప్ప
ఆత్మీయతకు తావు లేదు
అమ్మ భాషలోనే అమృతం
ఇప్పుడు మూగ బోయిన మన మాతృభాష
చిగురు తొడగాల్సిన తేనెతెలుగు…
పరభాషా కాలుష్యంతో మైల పడిపోతోంది..
కాలం కప్పేస్తోంది…
పరభాషా వ్యామోహంలో
జనం కొట్టుకుపోతున్నారు…
అమ్మను వదిలేస్తున్నారు
పరభాష వగలాడి వంపుసొంపులో
ఎందరో పడిపోతున్నారు…
అసలైన విలువల్ని కోల్పోయి
నిజమైన విలువలకు
ఎసరు పెడుతున్నారు
అమ్మ భాషను కసురుకుంటున్నారు
పరభాష చుట్టూ ముసురుకుంటున్నారు
నిత్యం మనలో ఉదయిస్తున్న
తెలుగు ఉషోదయం
తెలుగు మాట సుకుమారం
తెలుగు మనసు సురుచిరం
అందుకే తెలుగు లోనే మాట్లాడుకుందాం…
హృద్యంగా పలుకుదాం
తెలుగుపదాలను పదిలంగా నిలుపుదాం
అపురూపమైన మేధాసంపద
ప్రపంచాన్ని పలికించిన తెలుగు
తరతరాల సంస్కారం నింపుకున్న తెలుగు
తెలుగుభాషలో చైతన్యం పల్లవిస్తుంది
అమ్మ అనే పిలుపు
అమ్మతనాన్ని నిద్రలేపుతుంది
మనసును ఒరుసుకుంటు
మమతని నిలుపుకుంటూ
మమకారం చుట్టుకుంది…
ఆంటీ అంకుల్ పదాలలో ఆర్ద్రత లేదు
ఆత్మీయత అసలే లేదు
అత్తమ్మ మావయ్యల్లో
మమతానురాగాలు
మనసులో పొంగి పొర్లుతాయి..
ఇప్పుడు అణువణువునా
పరభాష అలుముకుంది
అచ్చమైన అమ్మ బాషను వదిలి
పరభాష రొచ్చులోపడి పొర్లుతున్నాం
మమ్మీలో ప్రాణంలేదు
అమ్మలో ప్రాణం ఉంది
అమ్మ తనాన్ని తట్టి లేపుతుంది
ఇదే నిజమైన తెలుగుతనం
అందుకే మన భాషను కాపాడు కుందాం
మాతృభాషకు ప్రాధాన్యతను ఇద్దాం!!..
అంబటి నారాయణ
9849326801
నిర్మల్