ప్రజా ప్రత్యామ్నాయల్లో నూరేళ్ల కాళోజీ’- ఒక పరిశీలన

ప్రజా ప్రత్యామ్నాయల్లో నూరేళ్ల కాళోజీ’- ఒక పరిశీలన

‘కవిత్వమూ, జీవితమూ కడుపు చెరువై పొంగింది. గుండె మంటై రగిలింది మనిషి కోసం…… ఆ కవిత్వమూ, జీవితమూ కాళోజీ ది’_ అని వ్యాఖ్యానించింది విరసం. అక్షరాల ఈ మాటలకు సాక్షీభూతమే కాళోజీ జీవితం, సాహిత్యం. మాన’కవిత్వమూ, జీవితమూ కడుపు చెరువై పొంగింది. గుండె మంటై రగిలింది మనిషి కోసంవీయతకు, నిజాయితీ నిర్భీతికి నమూనాగా నిలిచిన వ్యక్తి కాళోజీ. ఆ ప్రజాయోధుని స్మరిస్తూ… ప్రజా సంస్కృతిని, ప్రజా ఉద్యమాలను, వారి సాహిత్యాన్ని ఎత్తి పట్టవలసిన తక్షణ అవసరం ప్రస్తుత సమాజానిది. ఆ తరుణంలోనే సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధకులు కాళోజీ సాహిత్యాన్ని అనుశీలించి, పరిశీలించి వివిధ ప్రక్రియల్లో నూతన సాహిత్యాన్ని వెలువరుస్తూనే ఉన్నారు. సుప్రసిద్ధ రచయిత, విమర్శకుడు, తాత్వికుడైన వరవరరావు ను అచ్చంగా ఆ వరుస ప్రముఖుల్లో ఒకరిగా పేర్కొనవచ్చు. వారి హస్తభూషణం నుండి వెలువడిన విశిష్ట గ్రంథమే ఈ ‘ప్రజా ప్రత్యామ్నయాల్లో నూరేళ్ల కాళోజీ’.
ఈ పుస్తకంలోని వ్యాసాలు 1971 నుంచి వేరు వేరు సందర్భాలలో చేసినవి. ఒకటి ఇంటర్వ్యూ ఆధారంగా, మరోటి ప్రసంగ పాఠం. ఈ రచనలు సృజన, స్వేఛ్చాసాహితీ, కాళోజీ ఫౌండేషన్, ప్రజాతంత్ర, వార్త, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణా మొదలైన పత్రికలలో అచ్చైనాయి. వీటన్నిటినీ గుదిగుచ్చి ఓ దండగా మలిచి కాళోజీ కంఠాభరణాన ధరింప చేసారు విరసం వారు. వరవరరావుగారు విరసం సభలను పురస్కరించుకుని కాళోజీ పై పుస్తకం వేయాలనే తపనతో సాహిత్యలోకానికి అందించిన వ్యాస సంకలనమే ఈ ‘ప్రజా ప్రత్యామ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ’ పుస్తకం.
పాఠకుల పఠన సౌలభ్యం కోసం ఈ పుస్తకంలోని విషయాలను 12 వ్యాసాలుగా విభజించారు రచయిత వరవరరావుగారు. అవి:
1. కాళోజీ ప్రాసంగికత
2. సర్వోదయమా? చారు మజుందార్ మార్గమా?
3. మనిషి కథ
4. కాళోజీ కథ
5. కాళోజీ జీవన నది.
6. ధిక్కార వారసత్వానికి ఆయన ఎత్తి పట్టిన జెండా
7. కాళోజీ కాహళి ‘నా గొడవ’ గా మోగుతూనే ఉంటుంది.
8. కన్నీళ్ళు లేని లోకానికి కాళోజీ వెళ్ళిపోగలడా?
9. తెలంగాణ – మాండలిక భాష – కాళోజీ
10. కాళోజీ (అను)వాదం
11. కాళోజీ ఉద్యమ జీవితం
12. కాళోజీ కలగన్న తెలంగాణ
ఏ రచయిత, విశ్లేషకుడు, విమర్శకుడు కాళోజీ కవిత్వాన్ని కదిపిన ‘నా గొడవ’తో మొదలౌతుంది. అదే ఆయన సిగ్నేచర్. ఈ పుస్తకం మొదటి ముద్రణ అలంపురం సారస్వత సభల్లో సరిగ్గా(ప్రజా ప్రత్యామ్నయాల్లో నూరేళ్ల కాళోజీ- 2014 లో వెలువడే నాటికి) అరవై ఒక్క సంవత్సరాల క్రితం 1953 జనవరి 12 న శ్రీశ్రీ ఆవిష్కరించిన పదకొండు నెలలకే రెండో ముద్రణ కొన్ని కొత్త గేయాల కూర్పుతో ప్రచురింపబడటం అంటే … కాళోజీకి సాహిత్యలోకంలో ఉన్న ఆదరణ, అభిమానం అవగతమౌతుంది. అది మొదలు ఎన్నో సాహితీ సంస్థలు, సాహిత్యాభిమానులు ముఖ్యంగా కాళోజీ వీరాభిమానులు ఆయన సాహిత్య జీవితంలోకి అడుగు పెట్టడం జరిగింది. “నా గొడవ కాళోజీ గొడవ కాక యావత్ ప్రపంచం గొడవ అని శ్రీశ్రీ ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ అలంపురం సభల్లో అన్న మాట దీని పునః ముద్రణావసరాన్ని చెప్పడానికి చాలును” (ప్రజాప్రత్యామ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ – వరవరరావు ; పేజీ – 5)
అని రెండవ ముద్రణ ముందు మాటలో దాశరథి రాయడం చూస్తే ఆయన కవితలకు కైతలెత్తక మానము. “మానవ ప్రవృత్తుల మీద ఆయన పరిశీలన ఆయనను క్రమంగా జీవితం పట్ల బతుకు పట్ల గౌరవాన్ని (రివరెన్స్) కలిగించే తాత్త్వికత వైపు తీసుకుపోయినవి”. (ప్రజా ప్రత్యామ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ – వరవరరావు ; పేజీ – 6)
“బతుకు బతికి బతుకుల బతికిస్తూ
బతకమ్మా బతుకు……………….” (కాళోజీ నా గొడవ కవితలు ; పేజీ – 109)
కాళోజీ ప్రాణుల పట్లనే కాదు, బతుకు పట్ల ఇంత మమత, విలువ, గౌరవం ఉన్నవాడు. అందుకే ఆయన ఓ పోరాట యోధుడు (క్రూసేడర్). ఈ దృక్పథమే కాళోజీని ప్రజల హృదయాల్లో మా కాళన్నను చేసింది. అదే విషయాన్ని వరవరరావుగారు ప్రాసంగికతలో కాళోజీ కవిత్వ తత్త్వంలో కనపడే భాష ‘బడిపలుకుల భాష కాదు పలుకుబడుల భాష’… అంటూ ‘మనిషికీ మనిషికీ మధ్య మాటే వంతెన. భాషే దానికి ప్రాతిపదిక’. అని వివరించడం బాగుంది. అదే కమ్యూనికేషన్…
“కేక పెట్టినా కేబులిచ్చినా
ఆపదాపదని అరుచుటకే కద
పోయి చెప్పినా ఫోను చేసినా
తలచినదేదో తెలుపటకే కద (కాళోజీ- నా గొడవ కవితలు ; పేజీ – 14)
అనే కవిత కాళోజీ మనసులోని మాటకు, ఇచ్చే వ్యక్తీకరణ రూపాల గురించి చెప్పినది. అసలు కాళోజీ గొడవ అంతా నాగరికత, మానవ ప్రవృత్తులు, వాటి ప్రభావాల గురించి కాదు. ‘మార్పు’ కోసం.
“ఏం మారిందని
ప్రతి ఏటా కొత్త పాట….” (కాళోజీ నా గొడవ కవితలు; పేజీ – 14)
అంటే కాళోజీ మార్పును ఆశించే మనిషి మార్పును ప్రేరేపించే నిత్య చైతన్య శక్తి. ప్రేరణ అసలు కవిలోనే ఉండాలి. అలాంటి నిత్య చైతన్యశీలి కనుకనే
“నాది నిత్య నూత్నవికసిత జ్ఞానం
నేనున్నదే నిలువదగిన చోటు… ( కాళోజీ – నా గొడవ కవితలు; పేజీ – 14)
సమస్త ప్రజానీకానికి నా ‘ఇజం’ కవిత స్పూర్తి అంటారు వరవరరావు. ‘కాళోజీ కవితలు సమాజానికి ఓ చురకలు రాజకీయ పార్టీలకి చురకత్తులు’. అందుకే
“ఓట్ల తిన్నని బాట కడ్డు రాకండి
షాట్లతో మిము దింప పురికొల్పకండి”. (కాళోజీ నా గొడవ కవితలు; – పేజీ – 90)
అంటూ వరవరరావుగారు తనదైన ఉద్మస్పూర్తితో కాళోజీ కవితలన్నింటినీ సునిశితంగా విశ్లేషించడం కనిపిస్తుంది ఈ పుస్తకంలో…
అలాగే మనిషి కథ లో వరవరరావుగారు కాళోజీతో వారి వ్యక్తిగత పరచయాన్ని చెపుతూనే….కాళోజీ అందరి కంటే అంటే మన బోటి మధ్యతరగతి మనుషుల కన్న, కవుల కన్న ఎక్కడ భిన్నమైన వ్యక్తి అంటే, విలక్షణమైన వ్యక్తి అంటే …
“నేను ఉగ్రనరసింహం
చప్పున చల్లారండని ఆగ్రహిస్తే వాడు
నన్ను చప్పున చల్లార్చాలని కాళ్ళమీద పడ్డాడు” ( ప్రజాప్రత్యామ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ – వరవరరావు – పేజీ – 17)
అనే కాళోజీ వాక్యాలను ప్రస్తావిస్తూ, ఆయన ఇచ్చకాలకు, పొగడ్తలకు లొంగని తత్వాన్ని విప్పి చెప్పారు.
ఇక కాళోజీ కథలలో మనదేశంలో ఒక వైవిధ్యం గల సమాజం బ్రాహ్మణీయ భూస్వామ్య నిరంకుశ వ్యవస్థ వల్ల అణగారిన ప్రజాస్వామ్య సంస్కృతి మేల్కొనక ముందే వలస పాలనకు లోనైంది. మరి స్వాతంత్ర్యం వచ్చినా మనం సామ్రాజ్యవాద సంస్కృతినే అనుకరిస్తున్నాం. పాలకుల ఓ విధమైన నిరంకుశ ధోరణి వల్ల ప్రతిఘటించడం కుదరలేదు. ఇప్పుడు పరిస్థితి చెప్పాలంటే ఇంకా అమెరికా వైపు అర్రులు జాపి చూసే మార్కెట్టు సంస్కృతి మన మధ్యతరగతి మూల్గులలో నరనరాన జీర్ణించుకు పోయింది. ఇలాంటి మానసిక స్థితిలో సామాజిక నేపథ్యంలో కాళోజీ వంటి వాళ్ళను అర్థం చేసుకోవడం అంటే అసాధ్యమనే చెప్పాలి. కానీ అలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ రచన సాగించిన విశ్లేషకుడు వరవరరావుగారు.
‘కాళోజీ జీవన నది – నానా భావనా నది’… “Even oral composition is mental writing poetry is speech, but it is also writing”- Derek Walcoth
మిగతా భారతీయ భాష సాహిత్యాలకు లేని ఒక మంచి నేపథ్యం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఉంది. స్థాయీ భేదాలున్నప్పటికీ ఆధునిక తెలుగు సాహిత్యం అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాల ఫలితం.. కాళోజీ కవిత్వం కూడా సరిగ్గా ఇలాంటి నేపథ్యం లోంచి ఆవిర్భవించిందే! కాళోజీ మౌళికంగా రాజకీయ కార్యకర్త. అవి స్వాతంత్ర్యోద్యమ రాజకీయాలైనా, నైజాం పాలనకి వ్యతిరేకంగా సాగిన పోరాటాలైనా ఆయన వ్యక్తిత్వంతో విడదీయ లేని అంశాలు. కాళోజీకి వ్యక్తిగత జీవితం లేదు. అంతా సాంఘిక జీవితమే.. ఆయన కవిత్వం సమస్తం సామాజిక సంఘటనల్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే కాళోజీ జీవితాన్ని కవిత్వాన్ని వేరు వేరుగా చూడలేం. కాళోజీ తన పదిహేనవ ఏట నుండే సంఘజీవి. ఎందుకంటే ‘గణేష్ ఉత్సవాల నుంచి ఉద్యమాల వరకూ అన్నింటా తానే అయి ఉండేవారు’. కాళోజీ జీవితంలో కవిత్వం ఓ పార్శ్వం అయితే కథలు మరో పార్శ్వం. డా.మల్లారెడ్డి, డి.చంద్రశేఖరరెడ్డి, కె.శ్రీనివాస్, ఎన్.గోపి, ఎం.రత్నమాల మొదలైన వారు కాళోజీ కథలను అన్వేషించి శోధించి సాధించారని చెప్పాలి. అవి అనువాద కథలు కావచ్చు, స్వీయ రచనలు కావచ్చు. అణా గ్రంథమాల వారు 24వ ప్రచురణగా కాళోజీ కథలు ప్రచురించిన ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ, సుల్తాన్ బజార్ హైదరాబాద్ వారు, దక్కన్ వారి ఉద్యమ కృషి, వట్టికోట వారి దేశోధ్దారక గ్రంథమాల, గొల్కొండ పత్రిక, తెలుగుతల్లి, శోభ, ఆంధ్రకేసరి, పత్రికలు కాళోజీ రచనలను సాహిత్య లోకానికి అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం. అంటూ….వరవరరావుగారు తమ గ్రంథంలో కాళోజీ కవిత్వాన్ని, కథలను, ఆయన తత్త్వాన్నీ, తాత్త్వికతనీ ఒకే త్రాసులో వేసి ఆచి తూచి చెప్పడం ఈ పుస్తకానికి ఓ ప్రత్యేక లక్షణంగా కనిపిస్తుంది. కాళోజీ గురించి విన్నా, చూసినా, చదివినా హోచిమన్ (విప్లవ నాయకుడు) మన కళ్ల ముందు కదులుతాడు. కాళోజీ ప్రాపంచిక తత్త్వాన్ని ఆయన మాటల్లోనే చెప్తూ….
“అవని పై జరిగేటి అవకతవకలు చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపోవును ఒళ్ళు” (కాళోజీ – నా గొడవ కవితలు; పేజీ – 6)
కాళోజీకి కరికి పోయే గుండె మాత్రమే కాదు, మండి పోయే ఒళ్లు కూడా ఉంది. ఆ లక్షణం ఎంచదగిన చెడ్డ గుణం కాదు. ఆయన నిండుదనానికీ, గుండె బలానికి కారణం ఈ లక్షణమే – అంటారు వరవరరావుగారు. కాళోజీ ఎవరినీ అనుకరించలేదు. కాళోజీని ఎవరూ అనుకరించ లేరు. ‘అనితర సాధ్యం నా మార్గం’ – అని ‘శ్రీశ్రీ’ చెప్పుకున్నా, ‘ఆయన కవిత్వం మార్గం, ధోరణి ఆలోచన ఆనాడు ఎంతో మంది యువకవుల గళాల్లోంచి జాలువారింది’. శ్రీశ్రీ ప్రభావం నుండి బయటపడడానికి చాలా మంది సాహితీవేత్తలకు ఓ తరం పట్టింది. కానీ కాళోజీని అనుకరించ లేరు,కానీ ప్రభావితులవుతారు… అయ్యారు కూడా! ఆనాటి తెలంగాణాలో ఎందరో యువకవులకు, ఉద్యమకారులకు స్పూర్తినిచ్చిన నవయుగ వైతాళికుడు కాళోజీ.. ఈ అంశాన్నే వరవరరావుగారు తమ వ్యాస సంకలనంలో ప్రస్తావించారు. అంతేకాదు కాళోజీ లోని కవిని దర్శిస్తూ, ‘కవియే నిజమైన ప్రపంచ పౌరుడు’. “కవి అంటే ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండేవాడు. తనకూ సమాజానికీ సామరస్యం కుదిరేదాకా అంతర్ బహిర్ యుధ్ధం చేస్తూ, ఆ యుధ్ధ రావాన్ని గొంతెత్తి కవిత్వంగా ఆలపించేవాడు. అంటే ఒక సామాజిక కర్త, ఒక తత్త్వవేత్త, ఒక విప్లవకారుడు, ఓ ఉద్యమకారుడు, ఓ పోరాట యోధుడు – అసలు అన్నింటికన్నా ముందు మనిషి – అంటే మానవత్వం మూర్తీభవించిన మనీషి ….ఇవన్నీ కలగలిపితే కాళోజీ” అవుతాడు- అంటారు వరవరరావుగారు. ఆ సంగతాన్ని కాళోజీ మాటలలో చూద్దాం –
“నాకున్నది కోరిక
నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని
చదువరులకు కవిత్వంగా ఉండాలని
భావకులకు మెదడుగా ఉండాలని
మేధావులకు ఎడదగా ఉండాలని
తార్కికులకు కరుణ పుట్టించేదిగా ఉండాలని
అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని” (కాళోజీ – నా గొడవ కవితలు; పేజీ – 150)
ఈ ఆత్మాశ్రయత్వ ధోరణిని చదువుతుంటే ఎక్కడో ఎన్నడో 11 వ శతాబ్దిలో నన్నయ భారతాంధ్రీకరణకు పూనుకున్నపుడు…
“ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని
యాధ్యాత్మ విదులు వేదాంతంబని
నీతి విలక్షణుల్ నీతి శాస్త్రంబని
కవి వృషభుల్ మహా కావ్యంబని
లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని
యైతిహాసికులితిహాసంబని”…………. (నన్నయ ఆంధ్ర మహాభారతం అవతారిక – పేజీ – )
అన్న నన్నయ పద్యం గుర్తుకు రాక మానదు పాఠకులకు. నిజమే.. ‘కాళోజీ కవిత్వం కేవలం భావోద్రేకమూ, ఆవేశోద్వేగమో కాదు’. చదువరులకు ప్రశాంతంగా ఉన్నపుడు నెమరు వేసుకునే ఆవేశం, భావుకులకు బుద్ధి బలాన్నీ, మేధావులకు హృదయ స్పందనలను, తార్కికులకు భావోద్వేగాలను కలిగించేది. అంటారు వరవరరావు ఈ కాళోజీ జీవన నది అనే వ్యాసంలో….
కాళోజీ వ్యక్తిత్వం ధిక్కార వారసత్వానికి ఆయన ఎత్తి పట్టిన జెండా …. అంటూ మరో వ్యాసంలో వరవరరావు నిర్మొహమాటంగా మాట్లాడుతూ, రాస్తూ నడుచుకుంటూ అందరికీ ఆమోదయోగ్యుడు కావడం కాళోజీకే సాధ్యమైంది. (ప్రజాప్రత్యమ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ – వరవరరావు;పేజీ – 47)
అంటే యదార్థ వాదీ లోక విరోధీ అనే నానుడి వుంది లోకంలో… కానీ నిక్కచ్చితనం, సూటిదనం, నిర్మొహమాటత్వం, నిర్భయత్వం, నిస్సంకోత్వం – ఇలాంటి లక్షణాలన్నీ కలగలిపితే కాళోజీ అంటారు వరవరరావు. ఆయన వివిధ వాదాల, దృక్పథాల మనుషులందరికీ ఆమోదయోగ్యుడు, ప్రజానాయకుడు.
‘ఒక కవిగా, సామాజిక ప్రవక్త గా బహుశా వేమన ఒక్కడే ఆయనకు సాటి వస్తాడు’. “తెలంగాణా గడ్డ మీద ఆయన పాల్కురికి సోమనాథుడికి, బమ్మెర పోతనకీ వారసుడు. ధిక్కార వారసత్వానికి ఎత్తి పట్టిన జెండా”.. (ప్రజాప్రత్యమ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ – వరవరరావు పేజి – 47)
ఈ పుస్తకంలోని మరో వ్యాసం కాళోజీ ‘కాహళి’ నా గొడవ గా మోగుతూనే ఉంటుంది. ఈ వ్యాసం చదువుతున్నంత సేపూ పాఠకుడు మనసులో ఓ పక్క వ్యథ, నైరాశ్యం ….మరో పక్క ఆనందం ఎందుకంటే – ఆయన అనారోగ్యం – చివరి ఘడియలు, మరో పక్క పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న ఆనంద ఘడియలు – ఎలా ఫీల్ అవ్వాలీ….ఆనందమా…..విషాదమా….. అర్థం కాని అయోమయంలో పడిపోతాడు పాఠకుడు. కానీ రచయిత ఈ వ్యాసం ముగింపులో ‘మనుషుల మధ్యన, మాటల మధ్యన ఉండక పోతే బతకలేనన్న’ కాళోజీ మళ్లీ మనుషుల మధ్యకు రాకుండా ఎక్కడకి పోయి ఉండగలడు? అనడం – ఆయనను మరణం కూడా మనల నుండి వేరు చేయలేదు అనడంలో ఓ ఆత్మీయ స్పర్శ ఉంది.
ఇక ఈ వ్యాస సంకలనంలో తెలంగాణా మాండలిక భాష గురించి కాళోజీ కాంటెస్ట్ లో చెప్ప దలుచుకున్నా అంటూ కాళోజీ భాషా ప్రియత్వాన్నీ ,ఆయన తన రచనలో వాడిన పద ప్రయోగాన్నీ, భాష మీద, మాండలికం మీద, కవిత్వం మీద, శిల్పం మీద, శైలి మీద, కాళోజీ వెలిబుచ్చిన అభిప్రాయాలు తనదైన స్టైల్ లో విశ్లేషణ చేసారు వరవరరావుగారు. కాళోజీది బడిపలుకుల భాష కాదు, పలుకుబడుల భాష. తెలంగాణా యాసలోని పలుకుబడులతో ప్రజలకు మరింత చేరువయ్యారు. కాళోజీకి ఏ పెద్ద పెద్ద డిగ్రీలు, అకడమిక్ క్వాలిఫికేషన్లు లేవు. అయినా కమ్మటి తీయనైన తెలంగాణా భాష ఆయన ఊపిరి. ఆంగ్లం, ఆంధ్రం, సంస్కృతం, ఉర్దూ…ఒకటేమిటి… ఏ భాషావేత్త చదవనంతగా ఆయన చదివారు. పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా… సంస్కృత పురాణాలను, అందులోని పాత్రలను ఆధునికీకరించి, అప్పటి సందర్భానికి అనువర్తింప చేసి చెప్పడంలో కాళోజీ చాలా మంది సాహితీవేత్తలను అధిగమించారనవచ్చు.
ఇక కాళోజీ (అను)వాదం వ్యాసం.. ఈయన వాదం ఏమిటి అని ఆరా తీస్తే మానవతావాదం, అందులోనూ ‘ప్రగతిశీల మానవతావాదం’ – గతి తార్కిక భౌతిక వాదం – తత్త్వ వాదం – తాత్త్విక వాదం’ ఇలా ఎంతో చెప్పవచ్చు. అయితే ఇక్కడ రచయిత కాళోజీ అనువాద విధానాన్ని చెప్పారా….కాళోజీ ‘అను’ వాదాన్ని చెప్పారా…అంటే రెండింటినీ ఒకదానితో ఒకటి మేళవించి చెప్పినట్టు తోస్తుంది. హెచ్.ఎన్. బ్రెయిల్ ఫర్డ్ నా భారతదేశ యాత్ర ను ప్రస్తావించారు కూడా….
ఇక కాళోజీ ఉద్యమ జీవితం -వ్యాసంలో కాళోజీ జీవితమే ఉద్యమం. ఆయనకు ఉద్యమమే జీవితం. మనిషి సంచార జీవిగా జీవిక కోసం నిరంతరం కాళ్ళూ చేతులూ ఆడిస్తూ, తోటి మనుషులతో, పనులతో, మాటలతో మానవ సంబంధాలలోకి వచ్చే క్రమంగా ఆయన జీవితాన్ని చూసాడు.
“బతుకమ్మా బతుకు…
బతుకు బతికి బతుకుల బతికిస్తూ బతుకు”…(నా గొడవ – కాళోజీ కవితలు;పేజీ – 109)
బతుకు….బతుకనివ్వు – ఈ తాత్త్విక దృక్పథమే కాళోజీని ఉద్యమ జీవిని చేసింది. ముఖ్యంగా 1950 లో రాజ్యాంగ రచనా కాలం నుంచే ఆయన చేస్తున్న పోరడు – పౌరుడు సైధ్ధాంతిక ప్రచారమైనా నైసర్గిక హక్కుల ప్రచారమైనా అధికృత హింసను ప్రతిఘటించడానికి ప్రతిహింస తప్పు కాదన్న ప్రచారమైనా…. ఈ అవగాహన నుంచి వచ్చినవే… ఆయన ఉద్యమ జీవితమంతా ఈ అవగాహన పరిణతి చెందినట్లు పురోగమిస్తూ సాగింది. అయితే ఈ అవగాహన కాళోజీ తన చిన్నతనంలో తన తండ్రి నుంచి విన్న ప్రహ్లాదచరిత్ర నుంచి వచ్చిందట… ప్రహ్లాదుడు ఎక్కడ ధర్మం, సత్యం ఉందని నమ్మాడో… దాని కోసం ధృఢంగా నిలబడాలని, అధికృత హింసను వ్యతిరేకించాలని అనుకున్నాడు. అదిగో సరిగ్గా ఆ నమ్మకాన్నే కాళోజీ జీవితాంతం నమ్మి నిలబెట్టుకున్నాడు. పౌరుడుగా ఎదిగి రాజకీయ జీవితంలో గాంధేయవాదిగా కొనసాగాడు. ఒక రాజకీయ విశ్వాసం ధృఢంగా ఉండాలంటే దానికి ఒక తాత్త్విక పునాది కావాలి. ప్రహ్లాదుని పాత్రను విన్న కాళోజీ ఆ పునాదిని వారసత్వంగా అందిపుచ్చుకున్నాడు. ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు పోరాటాలు, పార్టీలు, సంస్థలు ఎన్నెన్నో చూసాడు. 16 సంవత్సరాల బాలుడిగా, అంటే 1930 లో కాళోజీ చేపట్టిన మొట్ట మొదటి పోరాటం గణేష్ ఉత్సవాల్లో పౌల్గొనే విద్యార్ధుల హక్కు గురించి…. అది మొదలు మళ్ళీ ఏనాడూ వెనుతిరిగి చూడలేదు. అన్నింట తానే, అంతా తానే అయినా…. ఏ ఇజానికీ, ఏ సిద్ధాంతానికీ, ఏ పార్టీకి చెంది ఉండలేదు. అదీ ఆయన వ్యక్తిత్వ తీవ్రత. కాళోజీ తన ఉద్యమ జీవితంలో ‘పార్టీవ్రత్య విముఖత’ అనే ఓ కొత్త సిధ్ధాంతాన్ని ప్రతిపాదించి నోరు నొచ్చేంతగా ప్రచారం చేసాడు. మీ ఆత్మ చెప్పినట్లు ఓటు వేయండి అనే సిధ్ధాంతాన్ని కాళోజీ పార్టీవ్రత్యం …స్వేఛ్ఛను కట్టివేస్తుందనే వైఖరితో మొదటి నుంచీ ఒక సూత్ర బధ్ధమైన నిజాయితీతో ప్రచారం చేసాడు.
ఈ వ్యాసంలో వరవరరావుగారు తెలంగాణా సాయుధ పోరాట గమనాన్ని కాళోజీ మాటలలో చెప్తూ…. “ప్రాంతేతరులు దోపిడీ చేస్తే పొలిమేరలకావల తన్ని తరుముతాం
ప్రాంతం వాళ్ళే దోపిడి చేస్తే ప్రాంతం లోనే పాతర పెడతాం” …… (నా గొడవ – కాళోజీ కవితలు; పేజీ – 366)
అని స్పష్టంగా ఉండవలసిన పోరాట రూపాన్ని నిర్దేశించారు. ఏ సంస్థకు, ఏ పార్టీకి, ఏ ఉద్యమానికీ ఎన్నుకోబడని నాయకుడు (un acknowledged legislator) కాళోజీ.. అంటారు వరవరరావు.
ఇక చివరి వ్యాసం కాళోజీ కలగన్న తెలంగాణ…కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డు నిలవజాలవు. ‘ఇది కవి గొడవ గానే కనిపించినప్పటికీ ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ. అని అంటూ తెలంగాణా మూగ జీవుల హృదయాల్ని ప్రతిబింబింప చేసాడు కాళోజీ’ అంటారు శ్రీశ్రీ. తెలంగాణా ప్రజా జీవితాలతో పోరాటాలతో మమేకమై పోయిన నిఖార్సైన తెలంగాణా వాది కాళోజీ. అంతగా తపన పడి తహతహలాడి తీరా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును చూసి ఉండలేదు, ఆయన అనిపించినప్పుడు మనసులో బాధ కలుక్కుమనక మానదు.
ఈ విధంగా ‘ప్రజా ప్రత్యామ్నాయాల్లో నూరేళ్ళ కాళోజీ’ వ్యాస సంకలనాన్ని ఆద్యంతం హృదయ గమంగా నడిపిస్తూ…వరవరరావుగారు తమ రచనా వ్యాసంగంలో కృతకృత్యులయ్యారని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు. రాశిలో చిన్నదైనా వాసిలో ఎంతో విలువైనది ఈ గ్రంథం. మరీ చెప్పాలంటే.. ఈనాటి యువతకి, సమాజానికి కరదీపిక వంటిది.

ఆధార గ్రంధాలు:

1. కాళోజీ నా గొడవ కవితలు
2. ఇదీ నా గొడవ
3.నారాయణరెడ్డి, సి, డా.,1967,
ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు: ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్ ,హైదరాబాద్.
4. వెంకటేశ్వర్లు పతంగి డా., 2020, అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచన ఉద్యమ ప్రభావము, వేద నిత్య పబ్లికేషన్స్, హనుమకొండ.

గట్టు ఈశ్వర్
పరిశోధక విద్యార్థి
తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్
సెల్:9705759344

Get real time updates directly on you device, subscribe now.