ప్రజల గొడవే… తన గొడవ

పెరుములు కైలాస్

ప్రజల గొడవే… తన గొడవ

“పుటక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది” అని లోగ్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గురించి కాళోజీ పేర్కొన్న మాటలు కాళోజీ జీవితానికి కూడా వర్తిస్తాయనేది అక్షరసత్యాలు. కాళోజీ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది ‘నా గొడవ’ కావ్యం. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన ప్రతి వారికి తమ గొడవగానే అర్ధమవుతుంది. నిజాం నిరంకుశ పాలనకు ప్రజలు విసిగిపోయి ఎదురు తిరుగుతున్న రోజుల్లో కాళోజీ గారు ఒక కవిగా నా గొడవను ప్రకటించారు. అందుకే నా గొడవను నడుస్తున్న చరిత్రకు రన్నింగ్ కామెంట్రీ అని దాశరథి కృష్ణమాచార్య గారు పలికారు.

సమకాలీన వ్యవస్థ పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపన్యాసాల కంటే కవితలే శక్తివంతంగా ఉపయోగపడుతాయని నమ్మిన కవి. తాను నమ్మిన సిద్ధాంతాలే నా గొడవ కావ్యంలో కవితా వస్తువులుగా రూపుదిద్దుకున్నాయి. అసమ్మతి, నిరసన-ధిక్కారం, వ్యంగ్యం, మృదువైన హాస్యం నా గొడవలోని ప్రధానమైన

అంశాలు. “నీ మాతృదేశం నీరు లేని ఎడారే కావచ్చు. నీ పొట్టకు అన్నం, కట్టుకునేందుకు బట్ట, నీకు నీ మాతృదేశంలో సరిగ్గా దొరక్కపోవచ్చు. అయిన ఎక్కడికి వెళ్ళేందుకు ఇష్టపడకు ఎందుకంటే నీ మాతృదేశం మాతృదేశమే. దాన్ని

మించినది నీకు ఎక్కడ వెతికినా కన్పించదు” అని మాతృదేశం కవితలో పేర్కొన్నారు. “అన్నపు రాసులు ఒక చోట – ఆకలి మంటలు ఒక చోట” అనే పంక్తుల ద్వారా సమాజంలోని రెండు వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను చూపించారు. వ్యత్యాసాలు అనే గేయంలో.. 4

ఏమి భాషరా నీది ఏమి వేషమురా ? – ఈ భాష ఈ వేషమెవరికోసమురా ?

ఆంగ్లమందున మాట్లాడ గలుగగవే . ఇంత కుల్కేదవు ఎందుకోసమురా

తెలుగు బిడ్డవయ్యి తెలుగు రాదంచు.

సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా ? అంటూ రాయి వేషం, పరాయి భాష మాట్లాడే తెలుగువాన్ని ప్రశ్నించారు “ఆంధ్రుడా” అనే గేయములో 1942సం||లో నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తెలుగు భాష పట్ల చూపుతున్న నిరాదరణకు స్పందించి రాసిన పంక్తులు. ఊరి వెలుపల నున్న పూరి గుడిసెలలోని చీకట్లను తొలగించలేని దీపాలు ఏవి ? అంటే అవే దీపావళి. పండుగ నాడు కనిపించే దీపాలు అని ‘దీపావళి దీపాలు’ అనే గేయంలో పేర్కొన్నారు. ఈ గేయంలో దళిత వాదానికి సంబంధించిన భావాలు ఆనాడే అంతర్లీనంగా కనిపిస్తున్నాయి. ‘అవనిపై జరిగే అవకతవకలు చూసి నా హృదయంలో ఎన్నో ఆవేదనలు కలుగుతున్నాయి. పరుల కష్టం చూసి నా గుండె కరిగిపోతుంది. మాయలు, మోసాలు చూస్తే. నా ఒళ్ళు మండిపోతుంది’ అని సమాజంలోని స్థితిగతులను చూసిన కాళోజీలో చెలరేగిన మానసిక సంఘర్షణకు ఈ మాటలు తూటాలుగా కనబడుతాయి. ‘కంచే చేను మేయుచుండగా కాంచకుండుట ఇంకెన్నాళ్ళో – దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేది ఎన్నాళ్ళో’ అనీ ‘ఎన్నాళ్ళో’ అనే గేయంలో ప్రశ్నిస్తారు. 1944 సం॥లో జనగామ, నల్లగొండ ప్రాంతంలో రైతు కూలీలపై జరుగుతున్న దౌర్జన్యాలను, అణచివేతలను దృష్టిలో ఉంచుకొని రాసిన మాటలు అర్ధశతాబ్దం గడిచినా ఈనాటికి సామాజిక పరిస్థితులలో పెద్దగా మార్పురాలేదు అని చెప్పడానికి. ఈ గేయం ఒక మచ్చు తునక. రాణి వాసములోన రంజిల్లు రాజా-రైతు బాధలు తీర్చి రక్షింపలేవా, పట్టణపు సొగసుకై పాటుపడు రాజా పల్లెకందము గూర్చు ప్రతిభయే లేదా!” అంటూ అంతఃపుర కాంతలతో ఆనందిస్తూ నీవు రైతు బాధలను పట్టించుకోవడం లేదు. నగరానికి సొబగులు అద్దుతూ పల్లె సీమలను నిర్లక్ష్యం చేస్తున్నావని నిజాం నవాబును ప్రజాప్రతినిధిగా ప్రశ్నిస్తున్నారు ‘ఓ రాజా’ అనే కవితలో. కులంతో, వయసుతో, వరసతో చివరికి కలిమిలేములతో కూడా స్నేహానికి పనిచేయలేదు. అందువల్ల చెలిమి అనేది ఒక కలిమి. అది దేవతలెరుగని దివ్యానుభవము అని పేర్కొంటూ స్నేహానికి లోకములో ఉన్న విలువను చాటి చెప్పారు. ‘ఆ యేడు పొతేమి – ఈ యేడు వస్తేమి, మా యేదు పేదియో-మాతొడనే యుండ’ అంటూ ‘కాలగతి’ అనే గేయము ద్వారా 1951 వికృతినామ సం॥రం ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ గారు కవితా గానం చేశారు. పాత సంవత్సరం పొవచ్చు, కొత్త సంవత్సరం రావచ్చు కానీ మా యేడ్పు మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటుంది అంటూ ఒక సామాన్యుని ఆక్రందన కవి గొంతులో గేయమై ధ్వనించింది.

‘అభ్యర్థులై ఓటు అడిగేటివారు యేమేమి జేసిరో ఎటువంటి వారో’ అని గుర్తించిన తరువాత మాత్రమే ఓటు వేయండి ఓటిచుప్పుడే ఉండాలి బుద్ధి-ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును’ అంటూ ఓటర్లను చైతన్యవంతులను చేశారు.

‘ప్రపంచ చరిత్ర సాంతము – ప్రకటించు ఒక్క విషయము, మాంధాతల నాటి నుండి మార్పులేదు. – ఈ జగాన’ అని ప్రపంచ చరిత్రను ఆసాంతం పరిశీలించి ఒక విషయాన్ని ప్రకటించారు. అదేమిటంటే మాంధాతల కాలము నుండి ఈ ప్రపంచంలో ఎలాంటి మార్పు రాలేదు. దృతరాష్ట్రుడు, దుర్యోదనుడు, శకునుల వంటి వారు దొంగ నవ్వులు, దొంగ ఏడ్పులు అన్నీ అలాగే అప్పటి నుండి కొనసాగుతూనే ఉన్నాయి. యుగాలు మారిన మానవుల స్వభావాలు మాత్రం మారలేదు అనే విషయాన్ని కాళోజీ గారు స్పష్టంగా, సూటిగా ఈ కవిత ద్వారా బలపరిచారు.

‘నేను నవ్వుతాను, ఏడుస్తాను ఎందుకంటే నరుడను కాబట్టి. నవ్వు, ఏడ్పు ఈ రెండు అనుభూతికి సంబంధించిన అంశాలే. ఇవి లేని అమరత్వం నాకు అక్కర్లేదు. ఎందుకంటే ‘చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనము చాటలేదు” అని “నరుడనేను నరుడనేను’ అనే కవిత ద్వారా తెలియజేసిన కాళోజీగారు సెప్టెంబరు 9, 1914సం॥లో రమాబాయి, రంగారావులకు రట్టిపల్లి, బీజాపూర్ కర్ణాటక రాష్ట్రంలో జన్మించినా ఏకశిలానగరంలో జీవించి న్యాయవాద వృత్తిని చేపట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణా రైతాంగ పోరాటంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆడంబరం లేకుండా, అలంకార రహితంగా నిజాల నిప్పులను తన రచనా శైలిలో కురిపించి, సాహిత్యం వ్యాపార వస్తువు కాదు అది ప్రజల జీవితంలో ఒక భాగం అని తన సాహిత్యంలో ధ్వనించే అత్యుత్తమమైన శక్తి మానవత అని నిరూపించుకున్న ఆయన నవంబర్ 13, 2002లో మన నుంచి దూరమైన తన అద్భుతమైన కవితాశక్తిని మాత్రం మనకు అందించిన మహనీయమూర్తి-మానవతా వాది.

పెరుములు కైలాస్

తెలుగు భాషోపాధ్యాయుడు కళ్యాణి, ఎల్లారెడ్డి మండలం.. జిల్లా కామారెడ్డి చరవాణి: 8500609578

Get real time updates directly on you device, subscribe now.