కాళోజీ నారాయణరావు తెలంగాణ రచయిత


కాళోజీ నారాయణరావు తెలంగాణ రచయిత

కాళోజీ నారాయణరావు భారతదేశంలోని తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత, స్వతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయ కార్యకర్త, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అతని కవిత్వం, వ్యాసాలు మరియు నాటకాలు, భాష మరియు సంస్కతిపై అతని ప్రేమను ప్రతిబింబిస్తాయి.

కాళోజి 20వ శతాబ్దం ప్రజాకవి, గొప్ప మానవతావాది. ఆయన కరా&ణటకలోని బీజాపూరం జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో వీరి కుటుంబం కొన్నేళ్లు మహారాష్ట్రలో ఆ తర్వాత తెలంగాణలోని మడికొండకు రావడం జరిగింది. ఆ తర్వాత తన నివాసమైన ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని అనేక ప్రజా ఉద్యమాలను కాళోజీ నిర్మించారు. కాళోజీ మాటలలో, చేతులలో ఆలోచనలతో ఆవేదనలలో, వేష భాషల్లో, ప్రవర్తనలలో తెలంగాణ స్వరూపం సంపూర&ణంగా కనిపిస్తుంది. అందుకే దాశరథి ఆకఋష&ణమాచార్యులు ఆయన్ని తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం అని అన్నాడు. సామాజిక, గొడవను తన గొడవగా చేసుకుని ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు. మంచి ఎక్కడున్నా స్వాగతించాడు. అన్యాయం అణిచివేతలపై తిరుగబడ్డాడు. తన కవితలకు 1992లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

సార్వజనీయమైనది అందుకే ఐదు దశబ్దాలుగా ఆయన రాసిన కవిత్వాన్ని ప్రజలు ఏమినహాయింపులు లేకుండా పరిమితులు లేకుండా ఆదరించారు.

మాండలికం భాషకు జీవధాతువు :

ఒక తీరుగ చూస్తే వేషం కంటే భాష రక్తమాంసాలల్ల కలిసిపోయి వుంటది. ఇది అందరికి ఎర్కే గ్రాంథిక భాష పాత పుస్తకాల్లోపటిది. ఆ పుస్తకాలలోపటి ప్రతిమాటకు నిఘంటువుల అర్ధం దొరకుతుంది. ఆ భాష నియమాలు కట్టుబాట్లు వ్యాకరణ సూత్రాలు, సంధులు, గొందులు, అన్ని కంఠస్థం చేయాలి. కష్టపడి నేర్చుకోవాలి. అట్ల నేర్చుకొండి. ఆ భాష చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికిరాదు. విశ్వనాథ సత్యనారాయణకు రాదు. బిరుదు రాజు రామారాజుకు రాదు ఎస్వీ జోగారావుకు రాదు వీండ్లందరు పట్టుబట్టి ఆ భాష నేర్చుకున్నారు. ఇదేం రహస్యంగాదు దీంట్ల వుండే కష్టంగాని, సుఖంగాని అందరికి ఒక్కటే కాని రావిశాస్త్రి గారు రాసిన భాష ఏ పుస్తకాలలోపట వుండదు. అది ఉత్తరాంధ్ర భాష అక్కడ ప్రత్యేకించి కొన్ని వర్గాలు మాట్లాడుకునే భాష, చాపల పట్టేటోండ్ల భాష, పోలీసుల భాష, గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, ఎవళ్ళవాడుక భాషల వాండ్లను రాసుకోమన్నారు. ఒకని వాడుక భాషను ఇంకోని వాడుక భాష మీద దుద్దటానికి వాండ్లు పూర్తిగా వ్యతిరేకులు. ఏ ప్రాంతం వాండ్లు ఆ ప్రాంతం వాడుక భాషలోపటనే రాయాలి.

తెలంగాణ వెల్దుర్తి మాణిక్యరావు దయ్యాలపన్గడ (1935-40) అని ఒక కథ తర్జుమా చేసిండు. దీని మూలం టాల్ స్టాయ్ పస్ట్ డిస్టిల్లర్ నాటకం. ఈ తర్జుముమాల ఆయన మెదక్ మాండలికం నాడిండు. తెలంగాణ యాసల రాసుడు అదే మొదలు. సురమౌళి అంగుడు పొద్దు. అని కొన్ని కథలు రాసిండు ఇట్ల రాసినోళ్లు కొంత మంది వున్నారు. అప్పట్ల ఎక్వమందిలేరు. ఇప్పుడు మన విప్లవ రచయితల సంఘానికి చెందినటువంటిద అల్లం రాజయ్యది ఆదిలాబాదు మాండలికం దాన్లనే కొలిమంటుకున్నది వంటి నవలలు రాసిండు. అప్పారావు కన్యాశల్కం వాడుక భాషే వెల్దుర్తి మాణిక్యరావుదీ వాడుక భాషే సురమౌళిది వాడుక భాషే రావిశాస్త్రిదీ అల్లం రాజయ్యదీ వాడు భాషే ఎవని వాడుక భాషల వాడు రాసిండు ఇవన్నీ వాడుక భాషలే.

భాషకు సంబంధించినయి రెండే. ఒకటి మాట, రొండు రాత అంటే ఉచ్ఛారణ దస్తూరి, ఎవళ్ళ దస్తూరి వాండ్లది. అదే ‘అ’ అదే ‘ఇ’ అదే ‘ఉ’ అదే ‘క’ య అక్షరమైతే ఒక్కటే గాని ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా రాస్తారు. ఉదాహరణకు ‘క’ను తీసుకుందం. ఎందరో ఎన్నోతీర్ల రాస్తరు. ఒత్తు పెట్టేటప్పుడు, దీర్ఘం ఇచ్చేటప్పుడు ఎవళ్ళ తీరు వాళ్ళదే ఏ ఇద్దరి దస్తూరి ఒక్క తీరీఖవుండదు. దస్తూరి ముళ్ళు ఏ తీరుగ రాసినా చదువుకునే వారికి అక్షర జ్ఞానంవుంటి పోలిక సాక్షాత్కరిస్తుంది. ‘క’ ఎట్లవున్నా ఏ రూపంల ఉన్నా ‘క’ వతుగనే కనిపిస్తుంది. ‘క’ ఇట్లెందకుంటది నేను రాసిన తీరుగానే ఉండాలె గద అని ఎవరు అనుకోరు. అట్ల ఎవరు అంటే వారికి అక్షర జ్ఞానం అక్షర సాక్షాత్కారం లేనట్లే.

తెలంగాణ యాస ఆయన శ్వాస :

తెలంగాణ రచయితల వేదిక ప్రథమ మహాసభలో కాళోజీ నారాయణరావు అధ్యక్షోపన్యాసం ఇస్తూ తెలంగాణ బతుకు, భాష గురించి ఇచ్చిన ఉపన్యాసం తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రలో సువర్ణాధ్యాయం. ఎవని వాడుక భాష వాడు రాయాలి. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా? అని ముందరనే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలె, తెలంగాణ బతుకు బాగుపడాలి అని ఆయన అన్న మాటలు తెలంగాణ భాష యాస పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తాయి. కాళోజీ దృష్టిలో భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండవది పలుకుబడుల భాష బడి పలుకుల భాష అనేది పుస్తకాల్లో ఉండే భాష, పండితుల భాష ఇది చిలుక పలుకుల భాష, వికాసానికి దోహదం చేయని భాష అని కాళోజీ విశ్వాసం. అందుకే ప్రజల నాలుకలపై నడయాడే సహజమైన స్వచ్ఛమైన పలుకుబడుల భాష కోసం ఆయన తపనపడ్డాడు. జానపద సాహిత్యమంతా పలుకుబడుల భాష కనుక దానిలోనే అసలైన జీవిత వాస్తవికత ఉందని కాళోజీ గాఢంగా విశ్వసించారు. అందుకే ప్రజల కాళోజీని అభినవ వేమన ప్రజాకవి కాళోజీ అని పిలుచుకున్నారు. కాళోజీ వాడిన భాష కాళోజీ నారాయణరావు సాహిత్య రచనలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. మరియు విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. అతని కవిత్వం తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా పరిగణించబడుతుంది. మరియు సామాజిక రాజకీయ సమస్యలపై అతని రచనలు భారతీయ సాహిత్యానికి విలువైన సహకారంగా పరిగణించబడతాయి. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆయన పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు.

తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేనలకు గౌరవ సూచకంగా ఆయన జయంతి సెప్టెంబర్ 9 ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. కాళోజీ నారాయణరావు జీవితం, రచనల సాహిత్యానికి, సామాజిక మార్పు తీసుకురాగల శక్తికి నిదర్శనం. తన నేలపై ప్రజలపై తనకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఆయన తన పదాలను ఉపయోగించారు. మరియు అతని రచనలు తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా కొనసాగుతున్నాయి. కాళోజీ నారాయణరావు ప్రజా హృదయాలలో ఎప్పటికి చిరస్మరణీయుడు.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.