మాతృభాష తల్లి పేగు ప్రాణధార

వ్యాసం

మాతృభాష తల్లి పేగు ప్రాణధార

తల్లి భాష జ్ఞానధార తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే తల్లి భాషకు ఉండదు.

మానవుని మనసులోని భావాలను వ్యక్తపరిచే సాధనం భాష, సకల జీవరాశులలోనూ మానవుడొక్కడే తన భావాన్ని వాక్కు రూపంలో వ్యక్తపరచగలడు. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్భుత శక్తి మాట్లాడగలగడం, అది మరి ఏ ప్రాణికీ లేదు మనిషికి తప్ప తెలుగుభాషకున్న విశిష్టతను బట్టి శృతి మాధుర్యాన్ని బట్టి పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అని తెలుగును ప్రస్తుతించారు, కీర్తించారు. శాస్త్ర సాంకేతిక విద్యలతో సహా అన్ని విద్యలకు తెలుగుభాష అనువైన భాషనీ, దేశమంతటికి జాతీయభాషకాగల పూర్తి అర్హత తెలుగుభాషకు ఉందని ప్రముఖ జన్యుశాస్త్రవేత్త జెబియస్ హాల్డెన్ కొనియాడాడు. హాలుని గాధాసప్తశతి రచనా కాలానికే తెలుగుభాష అమలులో ఉన్నట్టు చారిత్రక, సాహిత్య పరిశోధనలవల్ల విశదమగుచున్నది. మాతృభాషలో మన అనుభూతులు, ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటేమిటి మన జీవనవిధానానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతిబింబించేలా విశదీకరించగలం. భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీపడుతుంది. ప్రపంచంలోని అతికొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో తెలుగు ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతి శుద్ధంగానూ ఉంటుంది.

మాతృభాషా విశిష్టత:

‘సృజనకు విత్తు స్వంత భాష రచనకు సత్తువ ప్రజాభాష’, విద్యకు పరమార్థాలైన స్వతంత్రంగా ఆలోచించడం, ఆధారపడే తత్వాన్ని విడనాడడం, మాసిక వికాసాన్ని పొందడం, ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం మొదలగునవన్నీ మాతృభాషలో బోధనవల్లనే సాధ్యమవుతాయి. ‘ప్రజలభాషలో విద్య, పరిపాలన ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, హక్కు’ అని ఎలుగెత్తారు గిడుగువారు. ‘మాతృభాష తల్లిపాల వంటిది, పరాయిభాష పోతపాల వంటిది’ అని కొమర్రాజు లక్ష్మణరావుగారు నుడివారు. ‘నిజమైన భావప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లనే సాధ్యమవుతాయని, స్వభాషలో విద్యను బోధించినట్లయితే దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చివుండేదని’ గాంధీ మహాత్ముడు చెప్పారు. మాతృభాషలో విద్యనేర్వని ఏ పిల్లవాడైనా మేధావిగా ఎదగలేడన్నది ప్రామాణిక సత్యం. పద్యనాటకం, అవధాన ప్రక్రియలు తెలుగు భాషకే సొంతం. ప్రపంచంలో మరే భాషోలోనూ ఈ ప్రక్రియలు కనిపించవు. రాసినట్లే ఉచ్చరించడం, ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం. ఏ భాషకూ ఈ సౌలభ్యం లేదు.

మాతృభాషా ప్రయోజనాలు:

తెలుగుభాష ప్రాచీనమైనదేగాక చాలా శక్తివంతమైన భాష ఏ భాషాపదజాలాన్నైనా తనలో కలుపుకోగలదు. సంస్క నీత, ఉర్దూ, పారశీక, ఆంగ్లపదాలను తనలో ఇముడ్చుకోగలడు. ఎంత సున్నితమైనా భావాన్నైనా, ప్రౌఢ భావాన్నైనా బలంగా చెప్పగలిగే శక్తి తెలుగుభాషకు ఉంది. తెలుగుభాషలో బోధన కొనసాగినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మేధావులు చెబుతున్నారు. ఎన్నో సర్వేలు ఘోపిస్తున్నాయి. నాగరికజాతి మాతృభాషలోనే మాట్లాడుతుందని ప్రముఖ ఆంగ్లకవి ఈట్స్ అన్నారు. భాష సంస్కృతిలో భాగం, కావున భాష నిలిచినపుడే సంస్కృతి నిలుస్తుంది. తెలుగుభాషలో బోధన కొనసాగడంవల్ల గ్రహణ సామర్ధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించగలుగుతారు. సాహిత్యాభిరుచి, వివేచనాశక్తి, కళాపోషణ మొదలగు సామర్ధ్యాలు పెంపొందడానికి మాతృభాష దోహదపడుతుంది, సంస్కృతీ సంప్రదాయాలపై మక్కువ ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలుగుతాయి. మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. జాతీయత వికసిస్తుంది. మాతృభాషలో చదివిన వారికి సమయం చాలా కలిసివస్తుంది. భట్టీయం అక్కర్లేకుండానే సులభంగా విషయాలను గ్రహిస్తారు. విషయ సంగ్రహణంతో పాటు వినోదం, విజ్ఞానం, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయి. ఇతరులతో పోటీపడే శక్తి అలవడుతుంది. తల్లిదండ్రులతో పిల్లలకు అనుబంధం మాతృభాషలోనే బలీయంగా ఉంటుంది. మాతృభాషాభిమానం, దేశాభిమానానికి ప్రధమ సోపానం, మాతృభాషలో బోధనవల్ల గ్రహణ సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. మనసులు చురుకుగా పనిచేస్తాయి. అన్ని విద్యాదశలలోనూ మాతృభాష బోధనాభాషగా ఉండాలని కోరారీ కమీషన్ సూచించింది.

ప్రస్తుత మాతృభాషాస్థితి – సమస్యలు:

‘వచ్చినా రానట్లు మాట్లాడేది తెలుగుభాష రాకున్నా వచ్చినట్లు మాట్లాడేది ఆంగ్లభాష’ గా మారిపోయింది నేటి భాషాస్థితి. అభివృద్ధి అంతా ఆంగ్లంలోనే ఉందననట్లు జనమంతా ఆంగ్లభాషా మోజులోపడి కొట్టుకుపోతున్నారు. దైనందిన వ్యవహారంలో ముఖ్యంగా చదువుకున్నవారు కుప్పలు తెప్పలుగా ఆంగ్లపదాలను వ్యవహరిస్తున్నారు. ‘మనిషికి మంచి విగ్రహపుష్టిని ఇచ్చేది మాతృస్తన్యమైతే, ఉత్తమ మూర్తిమత్వాన్ని, సౌశీల్యాన్ని కలిగించేది మాతృభాష’ అని భాషా ఔన్నత్యాన్ని గురించి పెద్దలు చెప్పిన మాటలను విస్మరిస్తున్నారు. ప్రజలు కూడా స్తోమత లేకున్నా అప్పుచేసి తమ పిల్లలను ఆంగ్లమాధ్యమంలో చదివిస్తున్నారు. ఫలితంగా ప్రతి ఏడాది 70 శాతం మంది విద్యర్థులు ఆంగ్లమాధ్యమంలో చేరుతున్నారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగాల్లో చేరిన తర్వాత వాళ్ల పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించే పరిస్థితి ఉండదు. రెండు మూడు తరాలు గడిచిన తర్వాత చూస్తే తెలుగు రాష్ట్రాలలో తెలుగువాళ్ళంతా ఆంగ్ల విద్యాధికులై ఉంటారు. చివరకు తెలుగువాళ్లు ఉండి, భాషలేని స్థితి ఏర్పడుతుంది. అన్యభాషలో బోధనవల్ల విద్యార్థులపై తీవ్ర దుష్ఫలితాలుంటాయని మనోవైజ్ఞానికులు చెబుతున్నారు. ఆంగ్లంలో విన్నదానిని మాతృభాషలో అర్థం చేసుకొని, మళ్లీ ఆంగ్లంలో స్పందించవలసి వస్తుంది. ఇది పిల్లలకు మోయలేని భారమై మానసిక శ్రమకు గురవుతున్నారు. కష్టపడి చదువుతున్నారే కానీ, ఇష్టపడి చదనడంలేదు. విద్యార్థులు ఆయా అంశాలను అర్థం చేసుకోలేక సంకేతాలుగా మాత్రమే గుర్తుంచుకుంటున్నారు. అవగాహనా సామర్ధ్యాన్ని పెంపొందించుకోలేకపోతున్నారు. బట్టీపద్ధతిపై ఆధారపడి యాంత్రికతకు అలవాటుపడుతున్నారు. సృజనాత్మకత దెబ్బతింటుంది. విద్యార్థులకు సొంత ఆలోచనా శక్తి మరుగున పడుతుంది. ఇతర సబ్జెక్టులలో సగటు స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంటున్నారు. పరాయి భాషపై మోజు చూపిస్తూ, పిల్లలు బాల్యం నుండి కృత్రిమంగా చదువుతున్నారు. ఆ పిల్లలు తమ ఆలోచనలను, సృజనాత్మకతను, > రాజ్యాంగంలో ప్రాథమిక విద్యను మాతృభాషలోనే, ఉచితంగా బోధించాలనే నిబంధనలున్నాయి. ఒకటో తరగతి నుంచి పట్టభద్రస్థాయి (కె.జి. నుండి పి.జి.) దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశం చేయాలి.

౦ ప్రాథమిక విద్య పరాయి భాషలో బోధించడం చక్రాలు కదలని బండ్లను బలమైన గిత్తల చేత లాగించడం లాంటిదే అవుతుంది. అది అశాస్త్రీయం,

౦ ప్రాధమిక విద్యాభ్యాసాకికి తగిన పుస్తకాలుండి కూడా ప్రాథమిక విద్య పరభాషలో ఉండడం శోచనీయం. కళాశాల స్థాయి విద్యార్థులకు కావలసిన పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు తగిన సంఖ్యలో లేవు. పుస్తకాలను తెలుగులో తయారు చేసుకోవడం కష్టసాధ్యమే కాని అసాధ్యం కాదు.

O ‘సేవా వృత్తి వల్ల వచ్చు పాయసం కంటే స్వయం వృత్తివల్ల లభించు గంజి మేలు’ అని చప్పిన చిన్నయసూరి మాట మరవద్దు. నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది.

O అనువాద అకాడెమిని స్థాపించి దాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి చట్టాన్ని మొదట తెలుగులో రూపొందించి తరువాత అవసరమయితే ఇతర భాషల్లోకి అనువదించాలి.

• శాసనసభలో గౌరవ సభ్యులందరూ అధికార, మాతృభాషలోనే మాట్లాడాలి.

౦ ఉద్యోగాల కోసం పెట్టే పోటీ పరీక్షలలో శాస్త్ర పరిజ్ఞానానికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని మాతృభాషకు ఇవ్వాలి.

O పాలనారంగంలో అధికార భాషగా మాతృభాషను నూటికి నూరుపాళ్ళు ఉపయోగించాలి. అమలు చేయాలి.

ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డులేకాక, వివిధ రకాల పేర్ల పలకలు తెలుగులోనే రాయించాలి.

• న్యాయవ్యవస్థలో న్యాయవాదుల వాదోపవాదాలు, తీర్పులు పూర్తిగా అధికార మాతృభాషలో జరగాలి.

O దృశ్య మాధ్యమంలో తెలుగుభాషా వికాసానికి కృషి జరగాలి. వృత్తి విద్యలో కూడా ఆంగ్లంతో సమానంగా మాతృభాషనుబోధించాలి.

O పొరుగు రాష్ట్రాలలో వలె అధికార భాష కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పరచాలి.

O తెలుగు భాషలో చదివితే ఉపాధికి హామి ఉండేలా ప్రభుత్వ కార్యాచరణ కొత్తపుంతలు తొక్కితే భాషా పునరుజ్జీవనం సాధ్యపడుతుంది.

0 కొత్త నిఘంటు నిర్మాణం జరగాలి. తెలుగు భాషా స్వరూపాన్ని నిర్ధారించుకోవడానికి పరామర్శ గ్రంథాలు, ప్రామాణికమైన మహానిఘంటువులను నిర్మించుకోవాలి. మహానిఘంటు నిర్మాణానికి శాశ్వత పీఠం ఏర్పాటు కావాలి. వైజ్ఞానిక రంగాలకు చెందిన మౌళిక ఆలోచనలను వ్యక్తం చేయడానికి కావలసిన పరిభాషా నిర్మాణం జరగాలి. అనేక శాస్త్ర సాంకేతిక అంశాలపై పదజాలం, పరిభాష తెలుగులో కొత్తగా రూపొందించడం ఆగిపోయింది. దాన్ని కొనసాగించాలి.

• భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవ కళతో ఉప్పొంగుతుంది. తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, మరాఠీలు తమ భాషా సంస్కృతులను ప్రాణంగా చూసుకొంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసుకున్నారు.

౧ తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమాన్ని సాగించాలి. అవధానాలను ప్రోత్సహించాలి.

డాక్టర్ మాతంగి జానయ్య

తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.