తెలంగాణ పాటలు ఒక పరిశీలన


తెలంగాణ కవిత్వం, తెలంగాణ కథ, తెలంగాణ నవల, తెలంగాణ నాటకం తెలంగాణ భాష ఉన్నట్లే తెలంగాణ పాట కూడా ఉంటుంది. తెలుగు సాహిత్యంలో ఏక రూపత లేనట్లే, తెలుగు పాటలలో కూడా ఏకరూపత లేదు. కనుక తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను తెలంగాణ సాహిత్య ప్రక్రియలుగా కూడా స్థిరపర్చుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ పాట’ అనే ప్రక్రియను కూడా స్థిరపర్చుకోవల్సిన అవసరం ఏర్పడింది. ఇది పూర్తిగా తెలంగాణ సోయితో జరగాలి. మొత్తం భారతదేశంలో అన్ని భాషలలో వచ్చిన పాటలన్నింటి కంటే తెలంగాణ పాటది ప్రత్యేక అస్తిత్వం. ఒకరకంగా ఇట్లాంటి పాటలు మరే ప్రాంతంలో రాలేదంటే అతిశయోక్తి కాదు. పాట నిర్మాణంలోనూ, వ్యక్తీకరణలోనూ తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది. మనిషి సంస్కృతిని వ్యక్తం చేసే బలమైన రూపంగా పాట ఎంత ప్రాధాన్యతను కలిగి ఉందో, సాహిత్యంలో ఒక ప్రక్రియగా కూడా పాటకు అదే స్థానం ఉంది, ఉండాలి.పాట – నిర్వచనం

పాటకు గేయం, గీతం పర్యాయపదాలుగా వాడుతున్నారు. కానీ ప్రజలలో మాత్రం గేయం, గీతం అనే పదాలు వ్యవహారంలో లేవు. అక్షర జ్ఞానం ఉన్న పండితుల రచనలలో మాత్రమే గేయం, గీతం అనే పదాల ప్రస్తావన ఉంది. మౌకిక సాహిత్యంలో మాత్రం పాటకు మొదటి రూపం పదం. శ్రమలో నిమగ్నమైనప్పుడైనా, విశ్రాంతి సమయాలలోనైనా పదం పాడు, పదం చెప్పు అంటారు. పదము అంటే శబ్దరత్నాకరంలో పాదము, పద్య పాదము, శబ్దము, వాక్యము, ప్రయత్నము అనే అర్థాలున్నాయి. పదం పాడూ అంటే పాట పాడు అనే అర్థము. కనుక పాట, గేయం, గీతం ఒకే అర్థంలో వ్యవహరించడం కాకుండా గేయం, గీతం అనే పదాలకు చిన్నతను, పాటకు ఉంటే గుర్తిస్తే మంచిది. గేయం, గీతం పండిత సంప్రదాయం. పాట పామర సంప్రదాయం. దేనికి ప్రాధాన్యత ఉంది. వాటి ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. నిర్మాణ రీత్యా కూడా మూడు పదాలు ఒకటి కాదు. అయితే ఇప్పటి వరకు వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో పాట మీద ఏ మాత్రం పరిశోధన జరగకపోవటం వలన, సరైన నిర్ధారణలు జరగకపోవటం వలన ఈ అసంబద్ధత ఏర్పడింది. పాట పట్ల విమర్శకులు మౌనం వహించటమో లేదా ఉదాసీనంగా ఉండటం వలన కూడా ఈ నష్టం జరిగింది. కనీసం ఈ వందేళ్లలో పాట తన విశ్వరూపాన్ని వివిధ సరైన సందర్భాల్లో చూపించు వచ్చినప్పుడైనా నిర్ధారణలు, నిర్వచనాలు రావాల్సి ఉంటే. అది జరగలేదు. పైగా ఒకే మూసలో పాట గురించి పాట అనే ప్రక్రియతో ఏ మాత్రం తాదాత్మ్యం లేని కొందరు వాదనలు చేస్తూ వారికి తోచిన నిర్ధారణలు చేస్తూ వచ్చారు. ఫలితంగా పండితుల గేయం, గీతం ప్రజలకు సంబంధించిన పాట పర్యాయపదాలుగా మారిపోయాయి.తెలంగాణలో పాట పుట్టుక

”తెలంగాణం’ అంటేనే అనాదిగా అరుణారుణ వీరులకు జయగానమై పోరుపాటల మాగాణమైందని అరుణోదయ రామారావు చెబుతూ “పాట గురించి మాట్లాడుకోవటం అంటే శ్రమను, శ్రమజీవిని గురించి తన బతుకు బాధల గురించి తమ కష్టాల కన్నీళ్లను తుడుచుకోవటానికి జరిగిన, జరుగుతున్న పోరాటాల గురించి మాట్లాడుకోవటమే. శ్రమ నుంచి పుట్టిన పాట, చమటతో తడిసి మట్టి పాటగా పదునెక్కింది. తమ అస్తిత్వం కోసం శ్రమజీవులు జరిపే పోరాటంలో పాటే ఆయుధంగా ధరించి పోరాడిన చరిత్ర విశ్వవ్యాపితం. అయితే పాట వర్గాతీతమైనదేమీ కాదు. పాట వెనుక ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి ఆర్థిక, రాజకీయ, సాంఘిక వ్యవస్థ పునాది. ఎక్కడ ప్రజా పోరాటం ఉందో, అక్కడ పాట ఉంది. అనాదిగా వస్తున్న చారిత్రక సందర్భాలలో, దశలలో పీడిత ప్రజల పక్షపాతియై, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తుంది పాట” అని పాట పుట్టుక గురించి ఒక పాట కవి చేసిన విశ్లేషణ చాలా శాస్త్రీయంగా ఉంది.

ఆదిమ సమాజంలో పాట పుట్టిందని చాలా మంది పరిశోధకులు ప్రతిపాదించి ఉన్నారు. దీని విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండనవసరం లేదు. అయితే శ్రమతో పాటే పాట పుట్టిందని చెప్పిన అభిప్రాయంలో కొన్ని తేడాలు కన్పిస్తున్నాయి. స్థూలంగా శ్రమలో నుంచి పాట పుట్టిందని అంగీకరిస్తూనే, ఆదిమ మానవులు వేటాడే సమయాలలో పాటలు పాడేవారు కాదు, అప్పుడు దృష్టంతా ఆయుధ ప్రయోగం మీద ఉండేది. పైగా వేటాడే సమయంలో పాటలు పాడుతూ ధ్వని చేస్తే జంతువులు పారిపోయే అవకాశం కూడా ఉంది. కనుక వేటాడటం అయిపోయాక, జంతువును తీసుకొని ఇంటికి వెళ్తూ సంతోషంగా పాడుకునేవారని కొందరు పరిశోధకుల అభిప్రాయం. వేట సమయాలలో కాకుండా ఇతర రకాల పనులు చేస్తున్నప్పుడు. పాటలు పాడి ఉంటారనే అభిప్రాయాన్ని అందరూ అంగీకరించారు.

తెలంగాణ వ్యావసాయిక సమాజం. వందేళ్ల కిందట ఏ మాత్రం పారిశ్రామిక వాసనలు లేని సమాజం. ప్రజలందరు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్లు. భూమిని దున్ని నాట్లేయటంతో మొదలు, కోతలు కోసే వరకు ప్రజలు వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉంటారు. ఈ పనులు చేస్తున్నప్పుడు సామూహిక గానం చేస్తారు. ర్యాల పాటలు, కోలాటం 2 పాటలు, మోట పాటలు మొదలైన వివిధ సందర్భాలకు అనుగుణంగా పాటలు పాడుతుంటారు. కేవలం ప్రత్యక్షంగా వ్యవసాయంలో పాల్గొనే వారే కాకుండా వివిధ వ్యవసాయ వృత్తులలో ఉండేవారు కూడా పాటలు పాడుతుంటారు. వీరందరి పాటల్లో ప్రజా జీవితం ప్రతిబింబిస్తుంది.ప్రపంచ వ్యాపితంగా జరిగిన పరిశోధనలలో తేలింది ఏమిటంటే శ్రమ నుంచి లయ, లయ నుంచి పాట పుట్టిందని, తెలంగాణాలో ప్రజలు పనులు చేస్తున్నప్పుడు వారి వృత్తి పరికరాలే వాయిద్యాలుగా మార్చుకొని పాటలు పాడుకుంటారు. కనుక, లయ జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది. తెలంగాణ ప్రజల భాష సజీవంగా ఉంటుంది. సహజమైన మాటలతో పాటను నిర్మాణం చేసారు. తాము చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదుటి వారి హృదయాలకు తాకేటట్లు పాడుతారు. “తెలంగాణ శ్రమజీవుల పాట వారి భౌతిక పరిస్థితి, దోపిడీ పద్ధతి, ఉత్పత్తి సంబంధాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందని” జయధీర్ తిరుమలరావు చెప్పింది తెలంగాణలో పాటపుట్టుక గురించిన ఒక శాస్త్రీయ విశ్లేషణ. ఉత్పత్తిలో కన్పించే సృజనాత్మకతే కళాత్మకంగా

వ్యక్తమై పాటకు మూలమవుతుంది. జనపదాలు, గణాలు, చిన్న రాజ్యాల ఏర్పాటు. ఇదొక క్రమం. మొదట అటవిక జీవితంలో పాట మనిషి జీవితంలో భాగమైంది. రాజ్యాలు ఏర్పడ్డాక పాట విశ్రాంతి వర్గాల పరమైంది. శ్రమజీవులు సృష్టించిన ఉత్పత్తి మొత్తం పాలకుల వశమైనట్లే శ్రమజీవుల కళలు కూడా విశ్రాంతి వర్గాల పరమయ్యాయి. అట్లా పాట కూడా ఆ । వర్గాల చేతుల్లోకి పోయింది. రాజ్యాలు-రాజులు, వారి ఆస్థానాలు- ఆస్థాన కవులు ఏర్పడటంతో పాటను పద్యంగా మార్చుకున్నారు. ప్రజలందరు కలిసి సామూహికంగా సృష్టించిన పాటను ఒక వ్యక్తే పాడే పద్యంగా మార్చుకున్నారు. అంటే పద్యం పుట్టడానికి పాటే మూలం. ఛందస్సుకు, సంగీతానికి కూడా ప్రజల పాటనే మూలమైంది.

ఒక ప్రాంతపు భౌగోళిక స్థితి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వైవిధ్యం ఆ ప్రాంత కళారూపాల మీద ప్రభావం వేస్తాయి. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో ఒకే విధమైన కళారూపాలు లేకపోవడానికే ఈ వైవిధ్యమే కారణం. అట్లా చూసినపుడు తీర ప్రాంతంలో పద్యం-పద్య నాటకాలు ఒక కళారూపం. రాయలసీమలో కొన్ని జానపద కళారూపాలు, అవధాన విద్య ఉంటే తెలంగాణలో పాటకు మొదటి స్థానం ఉంటుంది. మరే శ్రమతో పాటే పాట పుట్టిందని చెప్పిన అభిప్రాయంలో కొన్ని తేడాలు కన్పిస్తున్నాయి. స్థూలంగా శ్రమలో నుంచి పాట పుట్టిందని అంగీకరిస్తూనే. మరే ఇతర కళారూపాలైన పాట తర్వాతనే. తీర ప్రాంతంలో ఉండే గేయానికి తెలంగాణలో ఉండే పాటకు మౌలికంగానే తేడా ఉందని పసునూరి రవీందర్ ‘తెలంగాణ గేయసాహిత్యం -ప్రాదేశిక విమర్శ’ అనే సిద్ధాంత గ్రంథంలో వివరించాడు. ఆంధ్ర ప్రాంత గేయం ప్రధానంగా లలితమైంది. గతాన్ని కీర్తిస్తూ, వర్తమానాన్ని స్వాధించడం దాని ముఖ్య ఉద్దేశ్యం, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గురజాడ, గరిమెల్ల, గేయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆ తర్వాత విశ్వనాథ కిన్నెరసాని పాటలు, నండూరి ఎంకిపాటలు, బసవరాజు అప్పారావు ప్రణయగీతాలు, కృష్ణశాస్త్రి ప్రకృతి ప్రియత్వం గేయాలుగా ముందుకొచ్చాయి. గతాన్ని కీర్తిస్తూ, దేశభక్తిని చెబుతూ, కొన్ని గేయాలు, ప్రణయతత్వంతో మరికొన్ని గేయాలు వచ్చాయి. కాని తెలంగాణ పాట ఇందుకు భిన్నంగా వచ్చింది. ప్రజల ఆరాట-పోరాటాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ పాట వచ్చింది. ఒక స్పష్టమైన పోరాట లక్ష్యంతో తెలంగాణ పాట ప్రారంభమైంది.
తెలంగాణ ప్రాంతంలో ఇవ్వాళ మనకు ఈ రూపంలో కన్పిస్తున్న పాటకు వెయ్యి మసంవత్సరాల చరిత్ర ఉంది. మౌఖిక సాహిత్యంలో పాటకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకాని లిఖిత సాహిత్య సంప్రదాయంలో కూడా పాట నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడి కాలంలో వారి కావ్యాలలో ప్రస్తావించబడి ఉంది. సోమనాథుడు రోకటి పాటలు, తుమ్మెద, -ప్రభాత, ఆనంద, నివాళి, గొబ్బి, వెన్నెల పదాలను పేర్కొన్నాడు. పోతన జోల పాటల ప్రస్తావన చేసాడు. కొరవి గోపరాజు వెన్నెల గుడిపాటల గురించి విన్నట్లు చెప్పాడు.

వెయ్యేళ్ల నుంచి పరిణామం చెందిన తెలంగాణ పాట ఆయా సమాజాల అవసరాలను తీర్చుతూ వచ్చింది. ఒక కాలంలో మూగరోదనలకు ఒంటి నిట్టాడు రాగమయ్యింది. మరో సమయంలో పిల్ల తెమ్మెర గానమై ప్రియురాలు చెంపలను తాకింది. ఇంకో సందర్భంలో వెన్నెల రాత్రుళ్లలో కోలాటం కట్టెకు పల్లాయి పాడింది. కొన్ని క్షణాలలో మార్మికత్వాన్ని బోధించిన తత్వమైంది. రాముడి పాదాలను తాకిన గోదారయింది. సంస్థానాల మెడ బిరుసుతనాన్ని సవాల్ చేసిన జానపద కథానాయకుడు అయింది. అణిచివేతను ధిక్కరించే సామూహిక గానమయింది. సందర్భమేదైనా శ్రమజీవిని మర్చిపోని చరణమయింది. పాట పుట్టుకలోనే సజీవంగా తొణికిసలాడింది. పాట పుట్టి ఏ విధంగా నిలబడుతుందో పాట గురించి పాటను రాసిన పాట కవి సుద్దాల అశోక్ చరితార్థుడయ్యాడు.

చెమటబొట్లు తాళాలు పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే

పాట పనితో పాటే పుట్టింది

పనీ పాటతోటే జత కట్టింది”(ఆటలాడేటి పిల్లల పాటలు, 2008 పుట.51)

పాట శ్రమలో పుడుతుందని, ఉత్పత్తి క్రమంలో ఉండే కళాత్మకతే పాటగా మారుతుందని, ఆ పాటను వ్యక్తం చేయడానికి కావల్సిన లయను శారీరక శ్రమ సాధనాలే సమకూర్చుతాయని అనుకున్నాం. ఒక భౌతిక వాస్తవాన్ని పాట కవి ఎంత సౌందర్యాత్మకంగా చెప్పాడో చూస్తే పాట కవులకు సాహిత్యంలో ఎంత అన్యాయం జరిగిందో చరిత్ర సమాధానం చెప్పక తప్పదనిపిస్తుంది.

ఆదిమకాలం నందు ఆ నదితీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపుగూడి నడిచినప్పుడు ఆకలి మంటల బాటలో ఆకలి తీరే వేటలో అలఘట చెందే ఊపిరి హ…హా… అలపటయే మొదటి పాట (పైదే) ఈ పాటలో కవి చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మొదట అయిదు పాదాలనుఎత్తుకున్న పద్దతి ద్వారా పరితలో ఆసక్తిని పెంచాడు. పాటకు ఎత్తుగడ ఎంత బాగుంది శ్రోతల హృదయాలలోకి చేరుతుంది. పాటకు నిర్వచనం పాట ద్వారా రెప్పటం శ్రోతను తన వైపుకు తిప్పుకున్నాడు అశోక్, ఇక పాట ద్వారా తానేమి చెప్పాలనుకున్నాని రా పాదాల ద్వారా అర్ధమవుతుంది. మనిషికి ఆకలి-నిద్ర చాలా సహజమైనవి, ఆదిను తొలగణ ఆధునిక కాలంలోనైనా వాటి తీవ్రతలో తేడా లేదు. కనుక ఆకలి కోసం మనిషి జరిసే ఆపేస పొందిన అలసటనే పాటగా రూపొందిన క్రమాన్ని హృద్యంగా చెప్పుకుంటూ వెళ్లాడు.

“ఆ గడీల అగడాల దినగందపు ఏలుబడిలో మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయు వేళ’

మనిషి అనుభవించిన ఆయాసం జానపదమైన తీరును పాటలో వర్ణిస్తూ పోయాడు. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రక్తం చుక్కను ప్రవహింపచేస్తూ పోయాడా? ఈ కవి అని మనం అబ్బురపడేటట్లు పాటను అల్లాడు. ఈ పాటను చదివాక లేదా విన్నాక ఇక పాటకు సంబంధించ పరిశోధకులు, విమర్శకులు చెప్పే ఏ నిర్వచనం కూడా అవసరం లేదనిపిస్తుంది.

పాట అప్పుడైనా, ఇప్పుడైనా మనిషిలో కలిగించే చలనం సాధారణమైనదేమీ కాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ నేల మీద పాట కల్గించిన చైతన్యం అన్ని తరాలను నడిపిస్తుంది. పాట ఉద్యమరూపాన్ని సంతరించుకోవడానికి మొదలు కావల్సిన చైతన్యాన్ని వివిధ రూపాలలో పొందింది. ముఖ్యంగా 17, 18 శతాబ్దాలలో భూస్వామ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన జానపద నాయకులు దొరల చేత దొంగలుగా ముద్రింపడి హత్యకు గురయ్యారు. నిజానికి వీళ్లు ధనవంతులను దోపిడిచేసి పేద ప్రజలకు పంచిపెట్టారు. కనుకనే ఈ జానపద హీరోల మీద ప్రజలు పాటలు అల్లుకొని పాడుకోవటం ద్వారా భూస్వామ్యం మీద, దొరల మీద తమ నిరసనను వ్యక్తం చేసారు. తెలంగాణ పాటలో వ్యక్తమైన ఇదే, మొదటి సామూహికమైన సామాజికి నిరసన.

మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు పండగ శాయన్న, మియాసాబ్. శాయన్న బ్రిటీష్ సైన్యాన్ని కూడా ఎదిరించినట్లు దేవులపల్లి రామానుజరావు రాశాడు. 1910లో ఇతన్ని ఉరితీసారు. ఇతని మీద మాదిగ మాస్టీ, డక్కలి కులానికి చెందిన కళాకారులు అద్భుతమైన వీరగాథను గానం చేస్తారు.

“కలిగినోల్ల కొట్టిండూ బీదోల్లకు పెట్టిండూ పేద పేద లోకూలయి పెండ్లిలు చేసిందూ పాపమేమి చేయలేదు పండుగోల్ల సాయన్న”

ప్రజలు ఇంత అభిమానంగా పాడుకునే జానపద కథానాయకులు తెలంగాణ ప్రాంతంలో కాకుండా మరే ప్రాంతంలో పుట్టినా చరిత్ర పురుషులుగా ప్రసిద్ధికెక్కినారు.
వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే పానుగల్లు ప్రాంతంలో మరో జానపద కథానాయకుడు మీయాసబ్, అతన్ని పానుగల్లు ఖిల్లా మీద చంపేసారు. అతని వీరత్వాన్ని ప్రజల పాట రూపంలో కీర్తిస్తారు.

“పానుగంటి ఖిల్లా మీద పండినాడు మీయాసాబ్… మీరు ఆదరకుండి లంబాడొల్లు ఇట్ల బెదురాకుండి లంబాడీలు కొత్త కోట పాలెము కాడ ఖానే పల్లె పెద్ద చెరువు కట్టేపిచ్చి తూము మీన పేరేపిచ్చి అరవై మంది ఒద్దెరోల్ల పిలువానంపై మీసాబ్”

వనపర్తి రాణిశంకరమ్మ మీయాసాబ్న పట్టి చంపించిందని ప్రజల నమ్మకం. ధనవంతుల దగ్గర ఉన్న సొమ్మును దోపిడి చేసి శంకర సముద్రం(సింగోటం చెరువు?) లాంటి చెరువులను కట్టిన చారిత్రక వ్యక్తి. కానీ దొరల చేత దొంగగా ముద్రపడటం చారిత్రక విషాదం. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఇట్లాంటి తప్పుడు చరిత్రను సరిదిద్ది కొత్త చరిత్రను నిర్మించాల్సి ఉంది. వీరి చరిత్ర నిర్మాణం పాటలే గొప్ప ఆధారం. ప్రజలు తమ నాయకులను కోల్పోతే బాధను, నిరసనను వ్యక్తం చేయడానికి తెలంగాణ ప్రాంతంలో పాటను ఆశ్రయించారు.వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే పానుగల్లు ప్రాంతంలో మరో జానపద కథానాయకుడు మీయాసబ్, అతన్ని పానుగల్లు ఖిల్లా మీద చంపేసారు. అతని వీరత్వాన్ని ప్రజల పాట రూపంలో కీర్తిస్తారు.

“పానుగంటి ఖిల్లా మీద పండినాడు మీయాసాబ్… మీరు ఆదరకుండి లంబాడొల్లు ఇట్ల బెదురాకుండి లంబాడీలు కొత్త కోట పాలెము కాడ ఖానే పల్లె పెద్ద చెరువు కట్టేపిచ్చి తూము మీన పేరేపిచ్చి అరవై మంది ఒద్దెరోల్ల పిలువానంపై మీసాబ్”

వనపర్తి రాణిశంకరమ్మ మీయాసాబ్న పట్టి చంపించిందని ప్రజల నమ్మకం. ధనవంతుల దగ్గర ఉన్న సొమ్మును దోపిడి చేసి శంకర సముద్రం(సింగోటం చెరువు?) లాంటి చెరువులను కట్టిన చారిత్రక వ్యక్తి. కానీ దొరల చేత దొంగగా ముద్రపడటం చారిత్రక విషాదం. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఇట్లాంటి తప్పుడు చరిత్రను సరిదిద్ది కొత్త చరిత్రను నిర్మించాల్సి ఉంది. వీరి చరిత్ర నిర్మాణం పాటలే గొప్ప ఆధారం. ప్రజలు తమ నాయకులను కోల్పోతే బాధను, నిరసనను వ్యక్తం చేయడానికి తెలంగాణ ప్రాంతంలో పాటను ఆశ్రయించారు.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.