నిశి రాత్రి సంగీతం
నిశి రాత్రి నీరవ నిశీధి..
ఆలపిస్తోంది..నిశ్శబ్ద గీతం..!
మిణుగురుల తళుకు బెళకులతో
కీచురాళ్ల చిటికెల సవ్వడితో
“‘ఔల్ ” పక్షుల సూదంటు చూపులతో
నిదుర పట్టని పావురాళ్ల
కుహ కుహల సందడిలో
దూరపు కొండల దావాగ్ని జ్వాలల
చిరు వెలుగులలో
చిరుగాలికి రాలిన ఎండుటాకుల
చిటపటలతో..చలి రాతిరి
వణుకుడులతో…కలసి ప్రకృతి
శ్రావ్యంగా వింటోంది..నిశ్శబ్ద గీతం..!
ప్రాతఃకాలపు సంధ్యా రాగపు
తొలి వెలుగుల వేళ..
కుక్కుటపు కూతతో
జాగృతమైన లోకపు
ఆవులింతల..మేళవింపులతో
ఉదయ రాగం జత కలిసి
” నిశ్శబ్ద శబ్ద ” తరంగమై
వినవస్తోంది..తొలి పొద్దు పలికిన
మోహన రాగం…
శ్రవణ శ్రావ్యమై
హృదయ వీణై
బతకు జాడై..
పరవశపు శ్రుతి..తోడై పలికే
సుస్వర- సమధుర సంగీతం.
విజయకుమార్ గడియా
నెదర్లాండ్స్/చిత్తూరు.