అంతులేనిది అక్షర దాహం..!! Koppula prasad

కొప్పుల ప్రసాద్ . తెలుగు లెక్చరర్ నంద్యాల, కర్నూలు (జిల్లా)

అంతులేనిది అక్షర దాహం..!!

నా కంఠంలో అక్షరమాల
నన్ను సంస్కరించే రుద్రాక్షమాల
వందన చందన ఆనందాల హరివిల్లై
అజరామరమైన జీవితపు వెలుగు పంచే…

అంతులేనిది నా అక్షర దాహం
నీరాజనాలతో నిత్యమూ పండుగే
మాతృభాషలో మాధుర్యం అందుకు ప్రతీక
చెప్పాలనే ఆత్రుతకు అక్షరమే దీపిక….

అక్షరమే నా సంస్కృతి
నా ఆలోచనే కవితా కుసుమము
నిత్య నైవేద్యముగా తెలుగు తల్లికి
ప్రతి నిత్యము అక్షరాభిషేకం చేస్తాను…

ఇతిహాసపు మర్మములు వింటూ
కావ్యాల కాంతామణులతో గడుపుతూ
ప్రబంధ శృంగార రసంలో ఓలలాడుతూ
ప్రతి గ్రంథము పంచే పరిమళాలను ఆస్వాదిస్తున్నా..

రాలిపడిన రస కావ్యం
నవరసభరితం పరివేష్టిత గీతిక
సంగీత జ్ఞానం పరిమళం వసంతము
తెలుగు భాషనే ఒదిగి ఎదిగేందుకు దర్పణం…

సాహిత్యంలో విరబూసిన కావ్య ఫలాలు
హస్తభూషణాలంకారములై నిలిచే
తరతరాలకు అమృత భాండమై
జ్ఞాన వినోద కళారూప సాధనమై వెలుగొందే…

తరతరాల సంస్కృతికి ఓనమాల భాష
జీవనదిలా ప్రతినిత్యం ప్రవహించెను
ఉవ్వెత్తున ఎగిసిన కృష్ణా తరంగిణిలా
గోదావరి నేలపై సాహిత్య మాగాణిలో మణులు పండించే..

ముత్యాల భాషతో ముత్యాల స్వరాలు పలికే
తెలుగు కన్నె వొడిలో రత్నాలు పొదిగే
ముక్తకంఠంలో మురిపెంగా మారుమ్రోగే
ఎలుగెత్తి చాటిన విశ్వమంతా వినిపించే…

కొప్పుల ప్రసాద్ .
తెలుగు లెక్చరర్
నంద్యాల,
కర్నూలు (జిల్లా)
9885066235

Get real time updates directly on you device, subscribe now.