గర్భస్రావ వేదన

రచన:నాశబోయిన నరసింహ(నాన)

గర్భస్రావ వేదన

అతడు పల్లె తల్లితో తగవులాడి
పొలిమేర గడపదాటి
రవ్వంత ఆశాంకురంతో
టన్నులకొద్ది బతుకు భారంతో బహుదూరపు బాటసారి

కనుపాపల్లో కడలి తెప్పలు తెలుపు చొక్కాపై ఉప్పుమరకలు
కన్నీళ్ళలో ఉప్పు ఎలా కలిసిందో!
ఖరీఫ్ రబీ కాలమేదైనా నైరాశ్యమే శేషం
గిట్టుబాటు లేని ధాన్యం గింజ గట్టున విలవిలలాడే చేపపిల్ల చందం!

పైసలు చెట్లకు కాస్తయ్
అతని పరిశ్రమంతా
చెట్టుకు చేయూతనివ్వడమే
నిట్టూర్పుల కాలం వేడి సెగలకి గొంతు తడారి నెర్రలిచ్చిన నేల!
అకాల వర్షాలు అందని ఎరువులు
నీట మునిగిన పంటతో కంటతడి పెడుతూ..

కందిచేళ్ళ చెక్కిళ్ళు కందిపోయి
నిండు చూలింత పత్తిమొక్క పురుడు పోసుకోకుండానే
గర్భస్రావ వేదనతో ఆక్రందన
పెట్టుబడి మట్టిలో కలిస్తే
హలధారి అరణ్యరోధన!

రాయితీల ఆధారం కరువై అన్నదాత వలసపక్షి జీవితం దారం తెగిన గాలిపటం
కబేళ యమపాశానికి మూగ జీవులు బలి!

పాలకుల సహకారం దూరమై ప్రపంచీకరణ విషగాలుల్లో
సేంద్రీయ సేద్యం ఆవిరై
రైతుజాతి నానాటికీ అంతరిస్తే బిచ్చమెత్తుకున్నా
పిడికెడు మెతుకులు కరువే!

సూర్య చంద్రులతో పోటీపడి
స్వేధామృత ధారలు కురిపించి
ఆకలి మంట చల్లార్చే అన్నదాత
ఆనందంగా గడిపే దినమెపుడో!

కాలం కలిసొచ్చి
కిసాన్ కలల పంట సాకారమైతే
విశ్వమానవ జీవితం మంగళకరం
రైతే రారాజైతే రాజ్యమే సుభిక్షం!

రచన:నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,చిట్యాల,నల్గొండ,8555010108

Get real time updates directly on you device, subscribe now.