మకుటం లేని మహా రాజు / నాశబోయిన నరసింహ

నాశబోయిన నరసింహ

మకుటం లేని మహా రాజు
“””””””””””””””””
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే దాకా
మట్టితో చెలిమి చేసే మకుటంలేని మహారాజు
పల్లె తల్లిని పరవశింప చేసే భూమి పుత్రుడు
హలం ఆయుధంగా పొలం సాగున యుద్ద సైనికుడు

పుడమి తల్లిని ప్రేమతో ఆరాధిస్తూ
వ్యవసాయ యజ్ఞంలో అతనో సమిధ
విరామ మెరుగని విశ్వరక్షకుడు
అన్నార్తుల ఆకలి తీర్చే ఆపద్బంధువు

తిండి తిప్పలు వదలి ప్రకృతితో మమేకమై
అలుపెరుగని నిత్య కృషీవలుడు
నేలతల్లి కడుపున పసిడి పండించే
మానవాళికి గోరు ముద్దలందించే మట్టి మనిషి!

కాలం కన్నెర్ర చేసినా గుండె నిబ్బరంతో
సేద్యం వదలని అపర భగీరథుడు
అతని పాద స్పర్శకు పులకరించే ధరణి
పొద్దంతా సూరీడుతో పోటీ పడే శ్రమ యోగి!

పంట చేతికొచ్చే దాకా ప్రాణాలరచేతిలో!
కంటికి రెప్పలా పంటకు అంగరక్షకుడు
రోగం రొప్పీ మరిచి కష్టించే కర్మయోగి
అన్నధాత కన్నీటి ధారలు దేశ ప్రగతి నిరోధకాలు!

రచన: నాశబోయిన నరసింహ (నాన),చిట్యాల,నల్గొండ,8555010108.

Get real time updates directly on you device, subscribe now.