ఆకలి బాల్యం

రచన నాన

ఆకలి బాల్యం
””””’
ఎందుకో…!
అడుగేయాలని ఎంత ఆరాటపడినా
ఓ అంగుళమైనా చలనం లేదు
పుడమిని గట్టిగా అంటిపెట్టుకున్న పాదాలు
కదలకుండా మెదలకుండా మొద్దుబారినయ్
అటు చూడమంటూ ఆర్ద్రతతో నా రెండు కళ్ళు…!

చెరువులో నాచుకై ఈదాడే చిన్నారి చేపల్లా
చింపిరి జుట్టూ చిరిగిన దుస్తులతో
లోకం తెలియని బంగారు బాల్యం బలిపశువై
నడి రోడ్డున బిచ్చమెత్తుకుంటూ…!

లేమి తనం లేత ప్రాయాన్ని
ఆకలి పురుగై కొరుకుతూ
దేహాన్ని పచ్చిపుండు చేసిందేమో!
ఆకలి అవమానాగ్ని దిగమింగి
ఎన్ని పనులు చేయిస్తుందో…!

కన్న నాటి నుంచి కాటికి చేరేదాకా
ఆకలి అందరికీ తీరేది కొందరికే
ఉరుముల మెరుపుల పెళపెళ ధ్వనులకు
ఈ లోకం ఉలిక్కి పడదా!

ఇక్కడ పిడికెడు ముద్ద కోసం
పడిగాపులు కాసే దైన్యం!
అక్కడ వేల మెతుకులు నేలపాలు
బియ్యం గింజ తయారీకి
ఆర్నెళ్ల కాలమని తెలిసే లోపు
ఆకలి కేకలతో అసువులిడిచే పాపమెవరిదో!

సామ్రాజ్యవాద శక్తుల పెత్తనమా?
బతుకు విలువ తెలియని ఉగ్రవాద అరాచకమా?
మానవత మరిచిన నరమృగ పైశాచికత్వమో!
అక్షర జ్ఞానం లేని కన్నోళ్ళ వెనుకబాటుతనమా?
కారకులెవరో ..! కారణమేదో..!?

మనుషులు మారాలి మనుగడకై పోరాడాలి
బతుకు మెరుగుపరుచు కోవడమే పరిణామం
సమసమాజ నిర్మాణమే సమస్యకు పరిష్కారం!

రచన: కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య పర్యవేక్షకుడు, చిట్యాల, నల్గొండ,8555010108.

Get real time updates directly on you device, subscribe now.