“కాలం ఓ ఇతిహాసం”
కాలం ఓ కత్తి!!..
పదును తేలిఉంటుంది…
తలవంచి నిలబడొద్దు!!
తలను ఛేదిస్తుంది…
తలయెత్తి నిలబడు!!…
తలవంచి సలాం చేస్తోంది…
కాలం ఓ సర్వోత్తముడు!!…
సకల అంశాలపై పట్టున్నోడు!!
ఓ విశ్వవిజేత..ఓ విషయ సూచిక!!
సమస్త చరిత్రల సారాంశం…
ఓ ఇతిహాసపురాణం!!…
కాలం ఓ సమస్త చైతన్యం!!..
కాలం ఓ సమాజ స్ఫూర్తి!!..
కాలం ఓ అస్తిత్వ కరవాలం!!
సమస్త ప్రాణకోటి జీవితాలను
తనబుజాలపై వేసుకొని….
సమస్త లోక సంచారియై
పరిమళిస్తూ పరుగులుతీస్తుంది!!…
సమస్థాన్ని ఇమిడించుకుంటూ..
అలల్ని సృష్టించుకుంటూ..
వలల్ని విసురుకుంటూ..
వాస్తవాన్ని నిలిపి అవస్తవాన్ని
నలిపేస్తూ..దిశానిర్దేశం చేస్తుంది!!..
కాలం చూపు బహుదూరం!!
ఎంత దూరాన్నైనా తన
ఒడిలోకి తీసుకుంటుంది…
అంతటా తానై
ప్రశ్నలతో ముడివేస్తుంది!!…
కాలం కడుపులో ఎన్ని అరలో!!??
ఎన్నెన్ని జ్ఞాపకాల పొరలో!!??
కాలం నడకను చూసి
మైలు రాళ్ళు
మౌనంతో చూస్తున్నాయి…
కాలం ఓ మూలాన్వేషి!!
సమాజం గుండెలో సరికొత్త
ఓ విన్యాసం చేస్తుంది…
విశ్వాసంతో
విషయాన్ని అందిస్తుంది!!…
తన అంతరంగం
ఓ కాంతి పుంజమే!!…
ఎన్నెన్నో రంగుల రంగవల్లులు
ఏది జరగాలోఎక్కడ ఉండాలో
ఎందుకు నడవాలో,
ఎలామొదలు పెట్టాలో, ఎప్పుడు
ఏమి జరుగాలో..నిర్ణయిస్తుంది…
కాలం ప్రతి క్షణం ఓ అగ్ని కణమే!!
జగతి గతికి ఓభాష్యం…
ప్రతి మలుపులో ఓ మార్గం ఉంది!!
ప్రతి పిలుపులో ఓ సమగ్రత ఉంది!!
కాలం నిత్యం
ఓ చైతన్య జీవసాగరం…
ఎన్నెన్నో నిజాలకు నిలువెత్తు అద్దం!!
ప్రతిప్రాణినీ తట్టి కొట్టి లేపుతుంది…
ప్రతి మనిషినీ ముట్టి తిట్టి
యవ్వనాన్ని లాగేస్తూఉంది…
అందుకే కాలంతో పెట్టుకోవద్దు…
కాలం ఓ ఇంద్రజాలం!!
వికృతాస్యంతో వికటింపజేస్తుంది…
అంతా చిక్కబడ్డ నిశ్శబ్దాలే!!
చక్కబడ్డ సంస్కారంతో సాగాలి…
మనిషితనం కోల్పోకుండా..
మంచితనం విడిచిపెట్టకుండా..
కాలంతో స్నేహంతో సాగిపోవాలి!!
కాలం అన్నీ రహదారులకు ఓ సూత్రధారి…
అందుకే అనీ అంశాలతో ముడిపడిఉన్న..
ఓ ఇతిహాస పురాణం!!…
అంబటి నారాయణ
నిర్మల్
9849326801