హృదయం పదిలం* కొల్లాబత్తుల సూర్య కుమార్.

సమదర్శిని న్యూస్

*హృదయం పదిలం*
మానవ శరీరం ఒక యంత్రం లాంటిది.శక్తి కోసం యంత్రం పనిచేయడానికి ఇంధనం ఎంత అవసరమో… మానవ శరీరానికి శక్తి కోసం ఆహారం అంత అవసరం.మనం అవసరం ఉన్నంతవరకే ఆహారం తీసుకోవాలి తప్ప, ఎక్కువ తింటే… అది క్రొవ్వు రూపంలో పేరుకుపోతుంది. తద్వారా స్థూలకాయం ప్రాప్తిస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతుంది. ముఖ్యంగా గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. స్థూలకాయం గుండెకు బారం.ఎందుకంటే… అధికంగా తీసుకొన్న ఆహారం చెడు క్రొవ్వుగా రక్తనాళాల గోడలకు లోపలి భాగంలో చేరి ప్రాణంకే ముప్పు వాటిల్లు తుంది.కాబట్టి మనం గుండెని ఎంత బాగా రక్షించుకుంటే అంత ఎక్కువ కాలం మనం క్షేమంగా, ఆరోగ్యంగా జీవనం సాగించడానికి వీలుపడుతుంది.గుండెను గురించీ, గుండెకు వచ్చే వ్యాధుల గురించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందరూ కలిగి ఉండటం మంచిది.గుండెపోటు, గుండె జబ్బులను నివారించడంకోసం 1946లో జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది.1999లో అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ తొలిసారిగా ‘హార్ట్ డే'(హృదయ దినోత్సవం)ని నిర్వహించారు.2000వ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ హార్ట్ డే'(‘ప్రపంచ హృదయ దినోత్సవం’)గా ప్రారంభించబడింది.2010 వరకు సెప్టెంబరు నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ఈ దినోత్సవం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యు. హెచ్.ఒ) సూచనతో 2011వ సంవత్సరం సెప్టెంబరు 29వ తేదీని ‘వరల్డ్ హార్ట్ డే'(‘ప్రపంచ హృదయ దినోత్సవం’ లేదా’)గా ప్రకటించింది.ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ,వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి.ఈ రోజున ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడానికి పలు కార్యక్రమంలను చేపడతారు.
మన గుండె అత్తి పండు ఆకారం కలిగి,మూసిన పిడికిలి అంత పరిమాణం కలిగి ఉండి నిరంతరమూ పనిచేస్తూ మనం జీవించడానికి సహకరించే ముఖ్య అవయవం.దీని పని అంతా ఇంత అని చెప్పడానికి వీలు లేదు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెతలా ఉంటుంది.శరీరంలో థొరాసిక్ కేవిటిలో రెండు ఊపిరితిత్తుల మధ్యలో కొద్దిగా ఎడమభాగంలో అమరి ఉండి, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ప్రతి ఒక్క సారి గుండె కొట్టుకున్న ప్రతిసారీ రెండు ఔన్స్ రక్తం గుండె నుండి పంపు చేయబడుతుంది.మానవుని శరీరంలో నాలుగు నుండి ఆరు లీటర్ల రక్తం సంచరిస్తుంది.శరీర భాగాల నుండి రక్తం సిరలు(వెయిన్స్) ద్వారా గ్రహించి పల్మనరీ ఆర్టరీ గుండా ఊపిరితిత్తుల్లోకి చేరి, అక్కడ ప్రాణవాయువుని తీసుకుని ఎరుపు రంగుగా మారి, ధమనుల ద్వారా మంచి రక్తంగా శరీర అన్ని భాగాలకూ చేరుతుంది.
రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాలను గోడలకు తెచ్చే తాకిడినే ‘రక్త పోటు'(బ్లడ్ ప్రెజర్-బి.పి) అని అంటారు. ఇది ఇది వయసు పెరిగే కొలది రక్తనాళాలు సాగే గుణం తగ్గి, బి.పి పెరుగుతుంది.వ్యాయామం చేయునప్పుడు బి పి ఎక్కువగా ఉండి,తర్వాత క్రమంగా తగ్గి,నార్మల్ కు వస్తుంది.ఇంకా మూత్రపిండాల వ్యాధులలోనూ,స్ట్రోక్ (పెరాలసిస్) లోనూ బి.పి ఎక్కువగా కనిపిస్తుంది. రక్తనాళాల గోడలకు క్రొవ్వు పదార్థాలు పేరుకొనుట వల్ల రక్త సరఫరా కు అంతరాయం కలుగుతుంది ఈ ఆటంకాల వల్ల రక్తనాళాలు పగిలినా,రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయిన స్థితిని ‘గుండె పోటు’ అని అంటాము. రక్త ప్రసారానికి కొద్దిసేపు ఆటంకం ఏర్పడితే దానిని ‘ఏంజైనా పెటోరిస్’ అని అంటారు.ఇలా ఎక్కువ సార్లు జరిగితే అశ్రద్ధ చేయకుండా ఈ.సి.జి తీయించుకోవాలి. గుండె పోటు వచ్చినప్పుడు చెమటలు ఎక్కువగా పట్టి, ఎడమవైపు భాగాలు అన్నీ నొప్పికి గురై, శరీరమంతా ఎవరో గట్టిగా పట్టి, నొక్కి వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ స్థితిలో అశ్రద్ధ చూపకూడదు. వెంటనే వైద్య సహాయం పొందాలి.
గుండె చక్కగా, సమర్థవంతంగా పని చేయాలంటే… మనం తీసుకునే ఆహార పదార్థాలలో ముఖ్యంగా క్రొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు.ధూమపానం చేయకూడదు.మద్యం సేవించకూడదు.సరిపడునంత వ్యాయామం చేయడం ద్వారా గుండెని ఎక్కువ కాలం సమర్థవంతంగా పని చేయునట్లు చేయవచ్చు.మానవుల యొక్క గుండె సక్రమంగా పని చేస్తేనే శారీరకంగాను,మానసికంగాను ఆరోగ్యంగా ఉంటూ కలకాలం జీవితాన్ని ఉల్లాసంగా గడపగల్గుతారు.ఆరోగ్యకరమైన గుండెను ప్రతీ ఒక్కరమూ కల్గి ఉండాలనే కోరుకుంటాం.కాబట్టి మన *హృదయం పదిలం*.

-కొల్లాబత్తుల సూర్య కుమార్.

Get real time updates directly on you device, subscribe now.