అంతా కల్తీ” అంబటి నారాయణ

నిర్మల్ న్యూస్

“అంతా కల్తీ”

కొందరు మనుషులు
జీవిస్తున్నారు
మృత్యుతోపోరాడుతూ…
శరీరతత్వాన్ని కోల్పోయి…
ఆరోగ్యాన్ని పోగొట్టుకొని…

తింటున్నది
విషపూరితమైనప్పుడు
ఇక మనుషులకు భవిష్యత్తు ఎక్కడ?
ప్రతి వస్తువులో
విషంతో కూడుకున్న కల్తీ!!…
గాలి సైతం విషవాయువులతో
కల్తీయై వీస్తుంది…
సమాజాన్ని పాడు చేస్తుంది….
మానసికంగా జరిగే
ఈపతనాన్ని ఎవరాపగలరు?
ఇదో హింసాత్మక ధోరణే!!…

స్వార్థపు కుట్రతో సాగించే కల్తీ…
డబ్బే ధ్యేయమై,దయ్యమై కూర్చుంది..
చీకటి దందాతో
నిజమైన దానిని చిదిమేస్తుంది…
డబ్బే ప్రధానమంటూ
సాగే ఈ జీవనగమనంలో…
అధికార అహంకారంతో
పచ్చనోట్ల ప్రపంచంలో
కొందరు మనుషులే కల్తీగా మారి
గతి తప్పి మతితప్పి ఆశల దాహంతో
స్వార్థపు గ్రహణంలా చుట్టేసి
మానవసంబంధాల్ని విస్మరించి
కల్తీ విషవాయువులను
ఎగజిమ్ముతున్నారు…

నిశిరాత్రి కాదు ఇది.. విషమ రాత్రి!!
స్వార్థపు నిషాలో ఉంటూ
లోపలదాగి ఉన్న డబ్బు పైత్యమే
అన్ని వస్తువుల్లో కల్తీ చేయిస్తుంది…
అంతా దోచుకోవాలనే మైకంలో ఉండి
కుళ్లు కుతంత్రాల కళ్ళతోనే
ఈ కల్తీ చేసేస్తారు…

అందుకే ఇప్పుడు
బతుకులకు భరోసాలేదు..
నిఘావేసి నిద్రపుఛ్చి
కలుపుతున్నాడు విషాని
కల్తీ చేస్తున్నాడు విషయాన్ని…
వీరందరూ సుప్రసిద్ధులు…
మహా విశిష్ట వశిష్టులే…

శరీరం అణువణువునా
అనేక రకాల రోగాలు…
మార్మికంగా మరణానికి దారితీస్తుంది..
ఎందరెందరో నిరాశా నిస్పృహల
ఊబిలో కొట్టుకుపోతున్నారు…
నాటి జీవన స్థితిగతులే
అద్భుతంగా ఉండేవి…

ఇప్పుడు సుఖాలను మరిగి
నోటి రుచులకు దగ్గరై…
ఇష్టమున్న వాటిని విషపూరితమైనా..
కల్తీ అయినా,తింటున్నారెందరో!!..

ప్రపంచీకరణ పరుగులో
ప్రాణాలను తీసే ప్రమాణాలు ఎన్నెన్నో!!
కడుపులు కొట్టి ఆరోగ్యాన్ని చంపి
కల్తీతో కోట్లు ఆర్జించినా ఇంకా కొదువనే!
ఇంకా కొందరిలో ఉరుములు మెరుపులు..
స్వార్థపుదరులు, ఆశలవలలు…
అందరినీ ఆకర్షించే
ఘాటైన గంధక ధూపం..
మేటైన ఆలోచనల వాటం..
ఇవే కల్తీకి పొడచూపే కవాటం..

ఇక వద్దు.. చూస్తూ ఉండొద్దు…
ఈ కల్తీ హద్దులను కూల్చేద్దాం…
కట్టిన సరిహద్దు దారుల్ని తూడ్చేద్దాం…
ఈ కల్తీలోకాన్ని కాల్చేద్దాం…
వాస్తవలోకాన్ని నిర్మించుకుందాం…
కల్తీ విషమ ముళ్లదారులను తొలిగిద్దాం
రండి..కదలిరండి… కలసిరండి…

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Get real time updates directly on you device, subscribe now.